వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మున్సిపల్‌ ఎన్నికలను ఆలస్యం చేయొద్దు రాష్ట్ర హైకోర్ట్టు

September 10, 2019

రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి సమయం ఆసన్నమైందని తెలంగాణ హైకోర్టు డివిజన్‌ ‌బెంచ్‌ అభిప్రాయపడింది. మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ ‌జారీ చేయడంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన రెండు ప్రజావ్యాజ్యాలపై స్పందిస్తూ ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌ ‌చౌహాన్‌, ‌జస్టిస్‌ ఎ అభిషేక్‌ ‌రెడ్డితో కూడిన ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టంలో నిర్దేశించిన విధంగా ఎన్నికల ముందస్తు ప్రక్రియను తిరిగి చేపట్టాలని ఆ వ్యాజాలలో వాదులు కోరారు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేసి చూడవలసిన అవసరం లేదని, ఎన్నికల ముందస్తు ప్రక్రియలో చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమేనని ధర్మాసనం పేర్కొంది. లోపాలను గుర్తించి, వాటిని సవరించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఎన్నికల ముందస్తు ప్రక్రియ విషయంలో తెలంగాణ మున్సిపాలిటీల చట్టం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించడంలో మున్సిపల్‌ అధికారులు విఫలమయ్యారని, బదులుగా ప్రక్రియను మొత్తం వేగంగా నిర్వహించారని పిటిషనర్‌ ‌తరఫు న్యాయవాది సిహెచ్‌ ‌నరేష్‌ ‌రెడ్డి కోర్టుకు తెలిపారు. వార్డులను విభజించే ముందు స్థానిక ఎంపీలకు, ఎమ్మెల్యేలకు తెలిపి, వారి సూచనలను తీసుకోవడంలో వారు విఫలమయ్యారని ఆయన అన్నారు. కాగా, నిబంధనలకు అనుగుణంగానే అధికారులు ఎన్నికల ముందస్తు ప్రక్రియను పూర్తి చేశారని రాష్ట్ర అదనపు అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌జె. రామచంద్రరావు పేర్కొన్నారు. వాస్తవానికి, ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఇప్పటికే మించిపోతోందని, వాటి కాలపరిమితి జులైలోనే ముగిసిపోయిందని ఆయన వివరించారు. ఇరు పక్షాల వాదనను విన్న కోర్టు, ఎన్నికలను ఇంకా ఆలస్యం చేయకూడదని అభిప్రాయపడింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 11‌కు వాయిదా వేయడం జరిగింది.