వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మున్సిపల్‌ ఎన్నికలకు లైన్‌క్లియర్‌!

November 30, 2019

  • 73‌మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు
  • కొత్త నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
  •  14రోజుల్లో అభ్యంతరాలు, సవరణలను పూర్తిచేయాలని సూచన

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 73మున్సిపాలిటీలపై ఉన్నస్టేను ఎత్తివేసింది. శుక్రవారం మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డుల విభజన, సవరణలపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ దాఖలైన పిటీషన్‌లపై హైకోర్టు విచారించింది. మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది. కాగా మున్సిపల్‌ ఎన్నికల ముందస్తు పక్రియను మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణపై గతంలో ఇచ్చిన తుది నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరకు 14రోజుల్లోగా ముందస్తు పక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ విషయంపై ప్రభుత్వం కోర్టుకు సమాధానమిస్తూ ర్‌పేట మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌కు వార్డుల విభజన పక్రియ ఇంకా ప్రారంభించలేదనీ తెలిపింది. ఇదిలాఉంటే ఆగస్టులో మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డుల విభజనతో పాటు రిజర్వేషన్లు, ఓటర్ల వివరాలను ప్రభుత్వం పూర్తిచేసింది. కాగా మున్సిపల్‌ ఎన్నికల పక్రియ సక్రమంగా జగరలేదనీ, వార్డల విభజన, రిజర్వేషన్లు, ఓటర్ల లిస్ట్ ‌తయారీలో లోపాలున్నాయంటూ 67మున్సిపాలిటీలకు సంబంధించి 76పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో మున్సిపల్‌ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటీషన్లపై జస్టిస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి గురువారం మరోసారి విచారణ చేపట్టగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌జె. రామచంద్రరావు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో హైకోర్టు మున్సిపల్‌ ఎన్నికలపై మరోసారి విచారణ చేపట్టిన అనంతరం73 మున్సిపాలిటీలపై తెలంగాణ హైకోర్టుస్టే ఎత్తివేసింది. కాగా వార్డుల విభజన, ఓటర్ల లిస్‌ట్లో మరోసారి సవరణలు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే గ్రేటర్‌ ‌హైదరాబాద్‌, ‌గ్రేటర్‌ ‌వరంగల్‌, ‌గ్రేటర్‌ ‌ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. దీంతో 10 నగరపాలికలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 128 మున్సి పాలిటీల్లో సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల పదవీ కాలం పూర్తి కాలేదు. అంతేకాకుండా కొన్ని సమస్యల వల్ల మరో ఐదు పురపాలక స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.