వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘ముంపు ‘ సమస్యల పై పోరాటం

August 30, 2019

స్పష్టం చేసిన అఖిల పక్ష నేతలుమిడ్‌ ‌మానేరు నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామాల ప్రజల సమస్యలను నేటికిని పరిష్కారం కాకపోవడం పట్ల రాష్ట్రంలోని అఖిల పక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ,సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.మిడ్‌ ‌మానేరు ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజల అఖిల పక్షం కొదురుపాక వద్ద వేలాది మందితో సమావేశం ఏర్పాటు చేయగా ఎంపిలు రేవంత్‌రెడ్డి,బండి సంజయ్‌,ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి,సిపిఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి, టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరాం,టిడిపి నాయకులు ఎల్‌ .‌రమణ,విజయరమణరావు,మాజీ ఎంపిలు పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, ‌వివేక్‌,అరుణోదయ సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క,రాజన్న సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ,వేము)వాడ నియోజక వర్గ కాంగ్రెస్‌ ‌నాయకుడు ఆది శ్రీనివాస్‌,‌బిజెపి నాయకుడు ఎర్రం మహేశ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.వీరంతా మాట్లాడుతూ రాష్ట్ర సిఎం కెసిఆర్‌ ‌తన స్వంత గ్రామమైన చింతమడకలోని ప్రజల సంక్షేమానికి ఇంటికి పది లక్షల ప్యాకేజిని ప్రకటించారని,తన అత్తగారి ఊరైన కొదురుపాకతో పాటు ముంపు గ్రామాల ప్రజలకు రూ 5లక్షల ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్‌ ‌చేశారు.మిడ్‌ ‌మానేరు నిర్మాణంతో వేలాది ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని,అయితే దానికోసం త్యాగం చేసిన ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి పూర్తిగా రువైందని,ఈ గ్రామాల ప్రజలకు ఉపాధి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.ముంపు గ్రామాల్లోని యువకులకు రెండు లక్షల వంతున సహాయం అందించారని,అదే రీతిలో యువతులకు కూడ సహాయం అందించాలని కోరారు.ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని,అవసరమైతే ముఖ్యమంత్రి నివాస భవనమైన ప్రగతి భవన్‌ను ముట్టడించడానికి ప్రజలంతా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముంపుగ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ముంపుగ్రామాల ప్రజలు పాదయాత్రకు సిద్ధంగా ఉండాలని,తాము సైతం ఈ పాదయాత్రలో ఉంటామని నేతలు స్పష్టం చేశారు.ముంపు గ్రామాల ప్రజల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు తాము అండగా ఉంటామని వారు ప్రకటించారు.కాగా త్వరలో మిడ్‌మానేరు చూడటానికి సిఎం కెసిఆర్‌ ‌హెలికాప్టర్‌లో రానున్నారని,ఆయనకు ముంపు గ్రామాల ప్రజల నిరసనను తెలియ జేయడానికి ప్రజలంతా నల్ల బెలూన్‌లు ఊదాలని మాజీ ఎంపి,టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌పొన్నం ప్రభాకర్‌ ‌పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా సమావేశానికి ముందు,తర్వాత వర్షం కురిసినప్పటికిని భారీ సంఖ్యలో జనం హాజరుకావడం విశేషం.