వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మీ నిర్ణయమే.. నా నిర్ణయం..

August 29, 2019

  • ప్రజల ఆరోగ్య భద్రతకు పనిచేద్దాం
  • పట్టణ ప్రజలను భాగస్వామ్యం చేద్దాం
  • లక్ష్య సాధనకు కౌన్సిలర్లు సహకరించాలి
  • స్పెషల్‌ ‌గ్రేడ్‌ ‌మున్సిపాలిటీ  సాధారణ సమావేశంలో హరీష్‌రావు వెల్లడి

    ఫోటో:గురువారం సిద్ధిపేట మునిసిపల్‌ ‌సమావేశంలో మాట్లాడుతున్న హరీష్‌రావు.

అభివృద్ధిలో స్పెషల్‌ ‌గ్రేడ్‌ ‌మున్సిపాలిటీ సిద్ధిపేట ఒక్క అడుగు ముందున్నది. ఇక ప్రజల ఆరోగ్య భద్రతకు పని చేద్దాం. పట్టణ ప్రజా ప్రయోజనార్థం భవిష్యత్‌ ‌తరాల కోసం ఒక మంచి పని చేయాల్సిన అవసరం ఉన్నదని, ఇందుకు పట్టణ ప్రజలను భాగస్వామ్యం చేద్దామని, ఈ కార్యక్రమాన్ని ప్రతీ వార్డు కౌన్సిలర్‌ ‌బాధ్యతగా తీసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో ముందుకొచ్చే కౌన్సిలర్లకు.. మీ నిర్ణయమే.. నా నిర్ణయమని స్థానిక ఎమ్మెల్యే, మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్‌ ‌కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం  మున్సిపల్‌ ‌కౌన్సిల్‌ ‌సాధారణ సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో హరీష్‌రావు మాట్లాడుతూ.. మన నియోజకవర్గం పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో పలు సంస్కరణలు చేస్తూ, కొత్త కార్యక్రమాలను చేపట్టినట్లు, గ్రామాల్లో చైతన్యవంతం చేసే ప్రక్రియ పూర్తయ్యిందని, ఇక పట్టణంలో కూడా ప్రజా అవసరాల దృష్ట్యా  మరింత సేవ చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా పనులు మొదలు పెడదామని పట్టణ ప్రజల భవిష్యత్‌ ‌తరాల కోసం ఆలోచన చేద్దామని, ముఖ్యంగా యువత కోసం పనిచేద్దామని కోరారు. కరీంనగర్‌ ‌కార్పోరేషన్‌ ‌తరహాలో సిద్ధిపేట మున్సిపాలిటీలో ఉచిత అంతిమ సంస్కారాల నిర్వహణ గురించి కౌన్సిల్‌ ఆలోచన చేయాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతీ వీధి పరిశుభ్రంగా ఉండే విధంగా కృషి చేయాలనీ, ఇందు కోసం వార్డు వారీగా స్వచ్ఛ కమిటీలను వేయాలని, అలాగే హరిత వార్డుగా మార్చేందుకు హరిత కమిటీని వేయాలని, అదే విధంగా వార్డు ప్రజల ఆరోగ్యాలను కాపాడే విధంగా ఆయా వార్డు పరిధిలో ఆరోగ్య వార్డుగా కమిటీ వేయాలని కౌన్సిలర్లకు సూచనలు చేశారు. ఇప్పటికే సిద్ధిపేట పట్టణంలో ప్లాస్టిక్‌ ‌రహిత సమాజం నిర్మాణం జరిగేలా.. ప్రత్యేక శ్రద్ధ వహించామని, ఇటీవల నియోజకవర్గంలో 85 గ్రామాలుంటే 40 గ్రామీణ ప్రాంతాలలో ఒక్కడే మట్టి వినాయకుడు ఏర్పాటు కోసం పల్లెలన్నీ కలిసి వచ్చి ఐక్యంగా ముందుకు వస్తున్నాయని., కానీ పట్టణంలో ఏలాంటి స్పందన రాలేదన్నారు. వచ్చే యేడాది నాటికి పట్టణంలోని వార్డుల్లో వార్డుకొక్కడే వినాయకుడు.. మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసేలా కౌన్సిలర్లు చొరవ చూపాలని కోరారు. వచ్చే నెల సెప్టెంబరు 1న సిద్ధిపేటలో 15వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్ధిపేటలోని శిశు రక్ష వైద్యులు రోగులకు ప్లాస్టిక్‌ ‌వాడకం నిషేధించేలా జూట్‌ ‌బ్యాగులు ఇవ్వడం అభినందించాల్సిన అంశమని, మిగతా వైద్య వర్గాలు ముందుకు వచ్చేలా కౌన్సిల్‌ ‌తీర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, ఇదే స్ఫూర్తితో ప్రజలందరిలో చైతన్యం రావాలని సూచించారు. పట్టణంలో ప్రత్యేకించి ప్రతి వార్డులో హరిత కమిటీ, ఆరోగ్య కమిటీలు ఏర్పాటు చేయాలని కోరుతూ.. ప్రతీ వార్డులోని ప్రజలకు యోగ సాధన, ప్రాణాయామం, వాకింగ్‌ ‌గురించి వివరిస్తూ ప్రతీ ఒక్కరి ఆరోగ్యం పై శ్రద్ధ చూపడం మంచిదని కోరారు. ప్రతి ఇంట్లో ఒక వేప తులసి మొక్క నాటలని, పట్టణంలోని వార్డుల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్‌ ‌చదివిద్దామని., అలాగే ప్రతి వార్డులో నిరంతరంగా పరిశుభ్రత పై వారం రోజులలో ఒక్క రోజూ ఒక గంట సమయాన్ని కౌన్సిలర్లు కేటాయించి ఆయా వార్డు ప్రజల భాగస్వామ్యం చేయాలని కోరారు. హోటల్స్, ‌ఫుడ్‌ ‌స్టాల్స్ ‌పై మున్సిపాలిటీ అధికారిక యంత్రాంగం దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం తప్పనిసరిగా ప్రతీ పరిస్థితులలో కృషి చేయాలని, హోటల్స్ ‌లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా.. (ఆకుపచ్చ, పసుపు, ఎరుపు) గ్రీన్‌, ఎల్లో, రెడ్‌ ‌రంగులలో మూడు రకాల గ్రేడింగ్‌ ఇచ్చి ప్రజలలో చైతన్యం తేవాలని సూచించారు. ఈ మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన యూజీడీ- అండర్‌ ‌గ్రౌండ్‌ ‌డ్రైనేజీ పనులపై వార్డుల వారీగా కౌన్సిలర్లు, అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అసంపూర్తి పనులన్నీ తొందరగా పూర్తి చేయాలని, యూజీడీ నిర్మాణ పనులను వేగంగా నాణ్యతతో కూడిన నిర్మాణాలు జరగాలని, ఇందుకు స్థానిక కౌన్సిలర్లు చొరవ చూపాలని కోరారు. కాగా కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ ‌మృతి చెందడం పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ… రెండు నిమిషాలు మౌనం కౌన్సిల హాల్‌ ‌లో పాటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌రాజనర్సు, వైస్‌ ‌ఛైర్మన్‌ అక్తర్‌ ‌పటేల్‌, ‌కమిషనర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.