వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మిగులు రాష్ట్రంలో లోటు బడ్జెట్‌

September 9, 2019

‌తెలంగాణ ఏర్పడినప్పటి నుండి మిగులు రాష్ట్రంగా చెప్పుకుంటూ తాజాగా బడ్జెట్‌లో లోటును చూపించడం పలువురిని విస్మయపరిచింది. అది కూడా తక్కువేమీ కాదు, ఏకంగా 24వేల 800 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం లోటును చూపించింది. ప్రభుత్వానికున్న అనేక ఆదాయ మార్గాలను సక్రమంగా వినియోగించు కోకపోవడమే ఇందుకు కారణంగా పలువురు విశ్లేషిస్తున్నారు. పైగా ఆ దురవస్థకు కేంద్రమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తున్నదన్న విమర్శ కూడా లేకపోలేదు. అయితే కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం చూపించలేదని కూడా అనలేము. ఫలితంగా కేంద్ర ఆదాయంతో పాటు, రాష్ట్ర ఆదాయానికి కూడా ఇప్పుడు గండిపడింది. కేంద్రం నుండి రావాల్సిన నిధులు సకాలంలో అందక రాష్ట్రాలు కూడా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. కేంద్రం ఇవ్వాల్సిన నిధులను సమకూర్చకపోవడం, స్థానికంగా ఆదాయ మార్గాలను రాష్ట్రం పెంచుకోకపోవడం, బయటి నుండి తెచ్చిన అప్పులు భారంగా మారడం, వాటికి కోట్లలో వడ్డీలు పెరగడం ఒక ఎత్తు అయితే దేశమంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఈ తరుణంలో రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 2019-20 సంపూర్ణ వార్షిక బడ్జెట్‌ను తప్పనిసరిగా కుదించుకునే దిశగా పరిస్థితులు దారితీశాయి. గతంలో ఓట్‌ఆన్‌ ఎకౌంట్‌ ‌బడ్జెట్‌ ‌లక్షా 74 కోట్లతో ప్రవేశపెట్టిన ప్రభుత్వం దేశ, రాష్ట్ర పరిణామాల దృష్ట్యా దాదాపు 36వేల కోట్లు తక్కువగా అంటే లక్షా 46 వేల కోట్లతో తాజాగా సోమవారం శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అంతేకాదు 24 వేల కోట్ల లోటు బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇందుకు రాష్ట్రప్రభుత్వం దూరదృష్టితో, ముందుచూపుతో వ్యవహరించకపోవడమే కారణంగా కొందురు మేధావులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక అంచనాలు వేయడంలో ప్రభుత్వం విఫలమైందని కొందరు పేర్కొంటుంటే, కేంద్రం నుండి నిధులను సమకూర్చుకోవడంలో సమర్థతగా వ్యవహరించలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసేందుకు కేంద్రంపై వొత్తిడి తీసుకురావడంలో టిఆర్‌ఎస్‌• ‌ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం వల్లే కోట్లాది రూపాయల ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందని కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు అయితే కనీసం ఆరవై శాతం నిధులు సమకూరేవన్నారు. అలాగే కేంద్రం పేదప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ ‌కన్నా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం మంచిదని బడ్జెట్‌ ‌ప్రవేశపెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పేర్కొనడంపైన కూడా జీవన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఆరోగ్యశ్రీ మెరుగైన పథకమే అయినా కేంద్రం ఆ పథకం కింద అందజేసే నిధులను వాడుకోకపోవడాన్ని ఎత్తిచూపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర అనేక పథకాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకుంటున్నప్పుడు పేదప్రజల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్‌ ‌నిధులను వద్దనుకోవడం ఎంతవరకు సబబంటారాయన. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కొన్ని రంగాలను విస్మరించిందంటూ విమర్శిస్తున్నా రాయన. విద్యార్థుల గురించి గాని, నిరుద్యోగ యువత గురించి గాని, ఉద్యోగుల పిఆర్‌సి, ఐఆర్‌ల గురించిన ప్రస్తావన ఎక్కడ కనిపించక పోవడంపట్ల ఆయన విస్మయాన్ని వ్యక్తం చేశారు. కాగా, జూన్‌లో రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులగురించి ప్రస్తావించినప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని ఆర్థికరంగ నిపుణులంటున్నారు. గత ఆరవై ఆయిదు సంవత్సరాల్లో లేనంతగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత 159 శాతం వరకు రాష్ట్రంలో అప్పులు పెరిగాయన్న నిర్మలాసీతారామన్‌ ‌ప్రకటనపై వారు స్పందిస్తూ రాష్ట్రం ఏర్పడిన అయిదేళ్ళలోనే తెలంగాణ ఉజ్జ్వల ప్రగతి సాధించిందంటున్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలపైన పరోక్షంగా ఏ మేరకు ఆర్థిక భారాన్ని మోపుతుందో అర్థం చేసుకోవాలంటున్నారు. 159శాతం అప్పులు పెరగడమన్నది మామూలు విషయం కాదు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో కేవలం 6,247 కోట్లను మాత్రమే ఖర్చుచేసే స్థితి నుండి 11వేల 305 కోట్లను ఖర్చుపెట్టే స్థాయికి ఎదిగామని ప్రభుత్వం చెబుతున్నా అందుకు ఈ అప్పులే కారణమని గణాంకాల నిపుణులంటున్నారు. కాగా, కేంద్రం నిధుల కోత రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసిందని బడ్జెట్‌ ‌సభలో సిఎం కెసిఆర్‌ ‌పేర్కొన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వాటా, నిధుల బదలాయింపుకు సంబంధించి కేంద్రం 4.19 శాతం కోతపెట్టింది. తెలంగాణకు సంబంధించిన ఇతర విషయాల్లో కూడా ఇదే విధంగా కోత విధించడంవల్ల తెలంగాణకు తీవ్రనష్టం వాటిల్లిందంటున్నారు కెసిఆర్‌. అయినా మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణనే మెరుగ్గా ఉందన్న కెసిఆర్‌, ఇటీవల కాగ్‌ ‌నివేదికలో కర్నాటక, పంజాబ్‌, ‌హర్యాన తదితర రాష్ట్రాలు మైనస్‌ ఆదాయ అభివృద్ధి రేటును నమోదు చేసి తిరోగమనంలో ఉన్నాయని చెబుతూ, తెలంగాణ మాత్రం స్థిరమైన ఆర్థిక ప్రగతి, పట్టుదల, ఆర్థిక క్రమశిక్షణతో ఆర్థిక పరపతిని సాధించుకుంటున్నదన్నారు. ఫలితంగా ఇతర సంస్థల నుంచి నిధులను సమకూర్చుకోగలుగుతున్నామన కెసిఆర్‌ ‌మాటలపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన అప్పులకు ప్రతీ సంవత్సరం దాదాపుగా పన్నెండు వేల కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి వస్తున్న క్రమంలో మరిన్ని అప్పులు చేస్తామన్నట్లుగా కెసిఆర్‌ ‌మాటల్లో ధ్వనిస్తోందని, ఇది రాష్ట్ర ప్రజలపై మోయలేని భారంగా పరిణమిస్తుందన్న అభిప్రాయాలను ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.