Take a fresh look at your lifestyle.

మిగిలింది రెండు రోజులే..

మరో రెండు రోజల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలకు రంగం సిద్దమైంది. అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు, పార్టీల ఫిరాయింపులు, పొత్తులు, జిత్తులతో యుద్ధానికి సిద్ధమైనాయి. ఇక మిగిలింది పోలింగ్‌ ‌మాత్రమే. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇచ్చిన హామీలు ఏమేరకు నెరవేరాయి, ఇప్పుడిస్తున్న కొత్త హామీలేంటివి. అలాగే ఇంతవరకు అధికారంలోకి రాలేకపోయిన పార్టీలు అధికారంలోకి వస్తే తాము ఏమిచేయదల్చుకున్నది తదితర అంశాలతో కూడిన మానిఫెస్టోలను ఒకదాని తర్వాత ఒకటిగా దాదాపు అన్ని పార్టీలు విడుదల చేస్తూనే ఉన్నాయి. ఎన్నికలకు నలభై ఎనిమిది గంటల లోపే తమ మానిఫెస్టోలను విడుదల చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సోమవారం చివరిరోజున భారతీయ జనతాపార్టీ ఆ అవకాశాన్ని వాడుకుంది. మానిఫెస్టోలంటే భగవద్గీతతో సమానమని రాజకీయ పార్టీలు పలుసందర్భాలలో చెబుతుంటాయి. అలాంటి మానిఫెస్టోలను తు.చ. తప్పకుండా అధికారంలోకి వచ్చిన పార్టీలు అమలు పర్చాల్సిఉంటుంది. కాని, అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగానే ఆ పార్టీలు మానిఫెస్టోలను అసలు పట్టించుకోవన్నది కూడా అంతే నిజం. చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా వోటర్లను ఆకర్షించేందుకు అమలుకు నోచుకోలేని హామీలను గుమ్మరిస్తుంటాయి. కేవలం లిఖితపూర్వకమైన హామీలేకాకుండా ఎన్నికల సందర్భంగా పలు ఇతర హామీలను కూడా ఇస్తుంటారు. కాని ఆ తర్వాత అవి తమ మానిఫెస్టోలో లేవనో, తామలా అనలేదనో చెప్పడానికి అలవాటు పడ్డారు పార్టీ నేతలు. ప్రధానంగా ప్రధాన రాజకీయపార్టీల విషయానికి వస్తే గత ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనేక హామీలనిచ్చింది. వాటిని అమలు చేయడంలో విఫలమైన విషయాన్ని ఇప్పుడు విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో మూలుగుతున్న నల్ల డబ్బు విషయం. ముక్కు పిండి ఆ డబ్బును తీసుకువచ్చి, భారతదేశంలోని ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలను వేస్తామని అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఆ హామీని నిలుపుకోలేదన్న అపనిందను నేటికీ మోస్తున్నారు. అలాగే ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీని కూడా నిలుపుకోలేదు. వీటికితోడు వ్యవసాయరంగానికి తగిన ప్రాధాన్యతమిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి అయిదేళ్ళ కాలంలో రైతుల పంటకు కనీస మద్దతు ధరను కల్పించడంలో విఫలమైందన్న అపవాదు కూడా ఉంది. తాజాగా విడుదల చేసిన మానిఫెస్టోలో గతంలో చేయలేక పోయిన వాటిని నెరవేరుస్తామంటోంది బిజెపి. మరోసారి మోదీని గెలిపిస్తే యాభై కోట్ల పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రయత్నిస్తామంటోంది బిజెపి తన తాజా మానిఫెస్టోలో. ఒకే మిషన్‌, ఒకే డైరెక్షన్‌ ‌లక్ష్యంగా ముందుకు పోయేందుకు సంకల్ప పత్రం పేరున విడుదల చేసిన మానిఫెస్టోలో ప్రధానంగా రైతాంగాన్ని మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రైతులకు కిసాన్‌ ‌క్రెడిట్‌ ‌కార్డులపైన లక్ష వరకు తీసుకునే రుణాలపైన వడ్డీ రాయతీని ఇస్తానంటోంది. అలాగే అన్ని వర్గాల రైతులకు కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామంటోంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులతో పాటుగా, చిన్నతరహా వ్యాపరస్తులకు పెన్షన్‌ ‌పథకాన్ని వర్తింపజేస్తామంటోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను ఇస్తామంటోంది. కాని, ఇంతవరకు బిజెపితో పాటు ఏ ప్రభుత్వం కూడా విత్తనాలపై పెద్దగా శ్రద్ధ పెట్టింది లేదు. కాంగ్రెస్‌ ‌కూడా ఇలాంటి హామీలనే గుమ్మరించింది. కాంగ్రెస్‌ ‌నెరవేరుస్తుంది.. అన్న శీర్షికన కామ్‌.. ‌దామ్‌.. ‌శాన్‌.. ‌సుశాన్‌, ‌స్వాభిమాన్‌, ‌సమ్మాన్‌ ‌పేర రూపొందించిన మానిఫెస్టోలో యాభై రెండు అంశాలను పొందుపర్చింది. ఈ పార్టీ కూడా ముందుగా వ్యవసాయరంగాన్ని, ఆ తర్వాత యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే 2020 మార్చ్ ‌కల్లా కేంద్రంలో ఖాళీగా ఉన్న నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే కనీస ఆదాయ (న్యాయ్‌)‌పథకం కింద ప్రతీ ఏటా అయిదు కోట్ల పేదకుటుంబాలకు ఏటా 72 వేల రూపాయల చొప్పున ఇస్తామని, అవి కూడా నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో వేస్తామంటూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బిజెపి చేయలేకపోయిన అంశాన్ని ఎత్తి చూపుతూ రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిపై విచారణ జరుపుతామని కాంగ్రెస్‌ ‌తన మానిఫెస్టో ద్వారా చెబుతున్నది. అలాగే దేశవ్యాప్తంగా రైతుల రుణాలను మాఫిచేయడం, వ్యవసాయరంగానికి కొత్త కిసాన్‌ ‌బడ్జెట్‌ను ఏర్పాటు చేయడం లాంటివనేకం పొందుపర్చారు. కాగా మూడు నాలుగు నెలల కింద రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మానిఫెస్టోలో కొన్ని సవరణలతో తెరాస ఈ ఎన్నికల బరిలో దిగింది. ఎకరాకు ఇప్పటికే అందిస్తున్న ఎనిమిది వేల రూపాయల రైతు బంధు సహాయాన్ని పదివేలకు పెంచడం, వివిధ పథకాల కింద అందజేస్తున్న పెన్షన్‌లను మరింత పెంచడంలాంటి వాటితో అన్ని రంగాల వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది తెరాస. కులాల కుళ్ళు, మతాల పంచాయితీలేని దేశ నిర్మాణం జరుగాలన్న ఆకాంక్ష, దళితులు, గిరిజనులు, మహిళలు గౌరవించబడినప్పుడే దేశం పురోగమిస్తుందంటూ ఈ ఎన్నికల్లో ప్రజల దృష్టిని దేశంపై మళ్ళించే ప్రయత్నిస్తున్న కెసిఆర్‌ ‌మాటలు యువతను, వివిధ మతాల వారిని ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలు ప్రకటించే మానిఫెస్టోలను ప్రజలేనాడు ప•ట్టించుకోకపోవడంతో ఆ పార్టీలు కూడా తమ మానిఫెస్టోలను ఎన్నికల చివరిరోజు వరకు విడుదల చేయడం లేదు. మానిఫెస్టోను చూసి కాకుండా వ్యక్తులు, పార్టీలనుబట్టే ఎన్నుకునే అ)వాటు పడ్డారు వోటర్లు. మానిఫెస్టో హామీలపై నిలదీసే పరిస్థితి లేదు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!