వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మా సమస్యలపై గళం వినిపిస్తాం

April 8, 2019

  • నేడు ఆర్మూర్‌లో రైతుల సదస్సు
  • నామినేషన్‌ ‌వేసిన రైతుల వెల్లడి                    

నిజామాబాద్‌ ‌జిల్లాలోని ఆర్మూర్‌లో ఈ నెల 9న రైతుల ఐక్యత సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్మూర్‌ ‌పట్టణంలోని జిరాయత్‌ ‌నగర్‌ ‌కాలనీలో గల మినీ స్టేడియంలో సభను నిర్వహిస్తామని అన్నారు. రైతు ఐక్యత సభసాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సభలు, రోడ్‌షోల నిర్వహించి జనాన్ని సకరిస్తుంటాయి. అయితే, నిజమాబాద్‌లో అందుకు భిన్నంగా రైతులే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. రైతులు, రైతు కుటుంబాల సభ్యులు స్వచ్ఛందంగా తరలిరావాలని కమిటీ నేతలు కోరుతున్నారు. తమ గళాన్ని వినిపిస్తామని, ఎందుకు బరిలెఓకి దిగాల్సి వచ్చిందో ప్రజలకు వివరిస్తామని అన్నారు. నిజామాబాద్‌ ‌లోక్‌సభ స్థానానికి అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసిన పసుపు, ఎర్రజొన్న రైతులు… తమ డిమాండ్‌ను బలంగా వినిపించేందుకు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. లోక్‌సభ ఎన్నికల బరిలో దిగి చరిత్ర సృష్టించిన రైతులు… తమ ఐక్యతను చాటి చెప్పటానికి సమాయత్తమవుతున్నారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర ప్రకటించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లోక్‌సభ ఎన్నికలను రైతన్నలు అస్త్రంగా ఎంచుకున్న విషయం తెలిసిందే. నిజామాబాద్‌ ‌నుంచి 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వారిలో 176 మంది రైతులే కావడం విశేషం.గ్రామస్థాయిలో ఎక్కడికక్కడ రైతు సంఘాలు, కమిటీల ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అందుకనుగుణంగా వాహనాలు సమకూర్చుకొని ఆర్మూర్‌ ‌సభకు వచ్చేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఆర్మూర్‌ ‌మినీ స్టేడియంలో నిర్వహించే సభ రాజకీయాలకు అతీతమని, ఈ ఉద్యమం రాజకీయపార్టీలకు, పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్నదని పసుపు, ఎర్రజొన్నల కమిటీ నాయకుడు మునిపల్లి సాయిరెడ్డి తెలిపారు. ఆర్మూర్‌ ‌పట్టణంలోని జిరాయత్‌ ‌నగర్‌ ‌కాలనీలో గల మినీ స్టేడియంలో 9న నిర్వహించే రైతు ఐక్యత సభకు విద్యార్థులు, యువత, మేధావులు తరలి వచ్చి మద్దతు తెలపాలని రైతు ఐక్య కమిటీ నాయకులు, రైతు ఎంపీ అభ్యర్థులు కోరారు. పసుపు బోర్డు ఏర్పాటు, పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్‌తో 178 మంది రైతులు నామినేషన్‌ ‌వేసి తొలిదశలోనే విజయం సాధించామన్నారు. నామినేషన్లతో యావత్తు దేశం నిజామాబాద్‌ ‌పార్లమెంట్‌ ఎన్నికల వైపు ఉత్కంఠతో చూస్తున్నారన్నారు.ఈసభకు రైతులు, రైతు కూలీలు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, మేధావులు, వ్యాపారులు వేలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.నిజామాబాద్‌, ‌జగిత్యాల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని కోరుతున్నారు. రైతుల ఐక్యతను చాటడానికి నిర్వహిస్తున్న సభను అడ్డుకోవద్దని అధికార పార్టీని వారు వేడుకున్నారు.