నాగర్ కర్నూల్,జులై 30.ప్రజాతంత్రవిలేకరి: శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రంలోని కిసాన్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ప్రపంచ మానవ అక్రమ రవాణా ప్రత్యేక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవ డం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ మాధవ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్సై మాధవరెడ్డి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో నే పరిమితమై ఉండేది కానీ ప్రస్తుతం ఈ సమస్య గ్రామాల్లో కూడా విస్తరించిందని ఆవేదన వ్యక్తంచేశారు.బాలికలు మరియు యుక్త వయసు మహిళలను ఉద్యోగాల పేరుతో, మోడలింగ్ ల పేరుతో వారిని మోసగించి అక్రమ రవాణాకు గురిచేస్తున్నారని అన్నారు.ఎవరైనా ఎవరైనా అక్రమ రవాణా కు పాలుపడుతున్నట్లు, మరియు ఆచర్యల కు ప్రేరేపించినట్లనిపిస్తే 100, 181, 1098 టోల్ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకోవాలని తెలిపారు.అమ్మాయిలు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
జిల్లాకు ఒక యాంటిహ్యూమన్ ట్రాఫికింగ్ ఏర్పాటు చేయాలి
శ్రామిక వికాస కేంద్రం డైరెక్టర్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ…
ఇప్పటికీ మానవ అక్రమ రవాణా నిరోధకచట్టం1956 ప్రకారమే నడుస్తోందని దీనిలో సమూల మార్పులు చేయాలని టాప్ బిల్లు-2018ని ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని కోరారు. జిల్లాకు ఒక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్ టీయు)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రామిక వికాస కేంద్రం మానవ అక్రమ రవాణా నిర్మూలన కోసం గ్రామస్థాయిలో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నదని తెలిపారు. అనంతరం లింగాల మండలం మారుమూల గ్రామాలలో బాలల హక్కులు, మానవఅక్రమ రవాణా పై నిరంతరం పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త ,ఎఫ్ఆర్డిఎస్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసులును ఎస్సై మాధవరెడ్డి , ఎస్వికె డైరెక్టర్ లక్ష్మణరావులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిపియు నిరంజన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ మధు బాబు, షీ టీం ఇన్చార్జ్ వెంకటయ్య, శ్రామిక వికాస కేంద్రం జిల్లా సమన్వయకర్త విష్ణు, మత పెద్దలు మరియు పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఎస్ వి కే సిబ్బంది పాల్గొన్నారు.