Take a fresh look at your lifestyle.

మళ్ళీ తెరపైకి రెండవ రాజధాని

మలివిడుత తెలంగాణ ఉద్యమం కొనసాగిన పద్నాలుగేళ్ళు వినిపించిన వాదనే మళ్ళీ ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం ఇష్టంలేనివారు ఉద్యమం ఉదృతంగా సాగినప్పుడల్లా తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌ ‌విషయంలో పంచాయతి పెడుతూ వచ్చారు. హైదరాబాద్‌ ‌లేకుండా తెలంగాణ ఇవ్వాలని కొందరు, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని మరికొందరు, దీన్ని దేశానికి రెండవ రాజధానిగా తీర్చిదిద్దాలని ఇంకొందరు తెలంగాణ ప్రజలనుండి హైదరాబాద్‌ను వేరు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. హైదరాబాద్‌లేని తెలంగాణను ఊహించడమే కష్టం. అంతే కాదు నిజాం కాలం నుండి స్వాతంత్య్రానంతరం కూడా హైదరాబాద్‌ ఈ ‌ప్రాంతానికి రాజధానిగా ఉంటూనే ఉంది. నిజాంకాలంలోనే ఎంతో అభివృద్ధిని సాధించిన హైదరాబాద్‌ను కబళించే విషయంలో భాషాప్రయుక్త రాష్ట్రాలపేర అనేక ఒప్పందాలతో ఈ ప్రాంతాన్ని కలుపుకుని, ఒప్పందాలను తుంగలో తొక్కారడనడానికి చరిత్రే సాక్ష్యం. పచ్చగా పదికాలల పాటు తెలంగాణ ప్రజలను తమ స్వంతరాష్ట్రాన్ని ఏలుకోనివ్వకుండా ఏదోఒక నినాదాన్ని ముందుకు తీసుకువచ్చి హైదరాబాద్‌ను ఇక్కడి ప్రజలకు దూరంచేసే ఆలోచనలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయడనడానికి నిదర్శనం తాజాగా ప్రజల మధ్య నలుగుతున్న రెండవ రాజధాని అంశం. ఉద్యమ కాలంలో ఇలాంటి ఆలోచనలు తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ ఉద్యమ నేతలుకూడా వంతపాడడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించు కోలేకపోతున్నారు.
కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దుచేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ దక్షిణాదిపైన తనదృష్టిని కేంద్రీకరించింది. తెలంగాణలో తెరాసను మట్టుపెట్టి, ఆంధ్రలో రాజకీయంగా ఎదుగాలన్న పెద్ద ప్రణాళికత• ఆ పార్టీ ముందుకుపోతున్నది. ఆ ఆలోచనలో భాగంగానే మరోసారి రెండవ రాజధాని అంశం వెలుగులోకి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉండడంతో హైదరాబాద్‌ను రెండవరాజధానిగా ఏర్పాటుచేయడం వల్ల దక్షిణ ప్రాంత రాష్ట్రాల్లో తమ రాజకీయ ప్రాభవంతో పెత్తనం చెలాయించవచ్చన్న ఆలోచన బిజెపికి ఉన్నట్లుగా రాజకీయవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. నిజంగా ఇదే వ్యూహంతో బిజెపి వెళుతున్నట్లు అయితే రాజకీయాల్లో అంతకన్నా దిగజారుడు మరోటి ఉండదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అది చివరకు మరో తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి దారితీసే అవకాశాలున్నా యంటున్నారు. హైదరాబాద్‌ను దేశానికి రెండవ రాజధానిగా చేస్తే, హైదరాబాద్‌ ‌మరింత సత్వర అభివృద్ధి జరుగుతుండవచ్చు, కాని, నిన్న మొన్నటివరకు హైదరాబాద్‌లో అడుగుపెట్టలేక పోయిన తెలంగాణలోని నిరుపేద కుటుంబాలకు దీనివల్ల హైదరాబాద్‌ ‌మరింత దూరమయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నా యంటున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత ప్రజలు రాష్ట్ర రాజధానిలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ విపరీతంగా పెరిగిన భూ ధరలకు ఇంకా ఇక్కడ నివాసాలను ఏర్పరుచుకోగలమని ఊహించుకోలేక పోతున్నారు. అయితే దీనివల్ల లాభాలు కూడా లేకపోలేదు. హైదరాబాద్‌ ‌రెండవ రాజధానిగా మారితే కేంద్ర ప్రభుత్వం మనదరిదాపుల్లోనే ఉన్నట్లు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పాలనా విభజన జరుగుతుంది. అనేక రాష్ట్రాలకు ఢిల్లీ దూరమే కాకుండా, అక్కడి కాస్ట్ ఆఫ్‌ ‌లీవింగ్‌, ‌భాష ఇబ్బందికర విషయాలే. అలాంటప్పుడు ఇక్కడ రెండవ రాజధాని ఏర్పడడం వల్ల సుప్రీంకోర్టు బెంచీఏర్పడే అవకాశాలుంటాయి. పార్లమెంట్‌ ‌సెషన్స్ ‌జరిగే అవకాశాలుంటాయి. కేంద్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికార కార్యాలయాల విభాగాలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉంటుంది. తమ కేసుల విషయంలోనో, మరేఇతర అవసరాలకో ఢిల్లీకి వెళ్ళి, నాయకులను కలువడం, అధికారులను కలవడం లాంటి వ్యయభారం తగ్గుతుంది. అన్నిటి కన్నా ఉత్తరాధివారి డామినేషన్‌ ‌చాలావరకు తగ్గుతుందన్న అభిప్రాయాలు లేకపోలేదు. వీటన్నిటితోపాటు హైదరాబాద్‌ ‌మరింత ప్రధాన పట్టణంగా వెలుగొందే అవకాశముంది. నదులు ఉప్పొంగటం, వరదలు రావడం, శత్రు దేశాల దాడుల భయం ఇక్కడ ఉండదు. ఇతరదేశాల్లో దాదాపు డెబ్బైకిపైగా దేశాలు రెండు రాజధానులను కలిగున్నాయి. సౌత్‌ ఆ‌ఫ్రీకాలోనైతే మూడు రాజధానులుండడం గమనార్హం. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌స్వాతంత్య్ర రాకముందే దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్‌ ‌సరైందిగా ఏనాడో పేర్కొన్నాడు. తాజాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌విభజన సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణకమిటీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త రాజధానులను ఏర్పాటుచేసి, హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలని తన నివేదికలో సూచించింది. ఈ పరిణామలన్నిటి దృష్ట్యా ఈ విషయం చాలాకాలంగా నలుగుతూనే ఉంది. ఉద్యమ కాలంలో హైదరాబాద్‌ను యుటి చేయడాన్ని గాన్ని, రెండవ రాజధానిగా చేస్తేమనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్‌ను రెండవ రాజధానిచేసే విషయంలో తనకేమీ అభ్యంతరంలేదడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. కేంద్రం ఈ విషయంలో ముందుకు వస్తే స్వాగతిస్తానని కెసిఆర్‌ అనడాన్ని ఉద్యమ రథసారధుల్లో ఒకరైన ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌లాంటివారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలనుండి హైదరాబాద్‌ను శాశ్వతంగా వేరుచేయడమే అవుతుందని, ఒక విధంగా తెలంగాణ ప్రజలను వంచించడం, ద్రోహంచేయడమేనంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే అసలు దేశానికి రెండవ రాజధాని ఎందుకు? అంత అవసరమేమొచ్చిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!