Take a fresh look at your lifestyle.

మరో విముక్తి ఉద్యమానికి సిద్ధమవుతున్న ‘తెలంగాణ’

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేండ్లు గడుస్తున్నా  తెలంగాణ విముక్తి విషయంలో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.  ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిననాడే తెలంగాణకు విముక్తి జరిగిందంటే, అసలు ‘తెలంగాణ’ ఇంకా విముక్తే కాలేదని, విముక్తి కోసం మరో ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలంటున్నాయి ప్రతిపక్షాలు. ఏ తెలంగాణకోసమైతే ప్రజలు కలలుకని, ప్రాణాలర్పించి పోరాటం చేశారో ఆ తెలంగాణ ఇంకా ఆవిర్భవించనేలేదంటున్నారు. నిజాం కబంధ హస్తాల నుంచి ఈ ప్రాంతం విముక్తి పొందిన రోజును అధికారపూర్వకంగా  జరుపుకోలేనప్పుడు ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడిదంటున్నాయి ఆ పక్షాలు. మలివిడుతలో సీమాంధ్ర పాలననుండి ఈ ప్రాంతాన్ని కాపాడుకున్న ఉద్యమకారులను కాదని, ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నించినవారే పాలకులైనప్పుడు ఈ ప్రాంతం విముక్తి పొందిందనడం అతిశయోక్తే అవుతుందంటూ, నయా నిజాంపాలన విముక్తి పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలంటున్నాయి ఆ పక్షాలు.  అసలు తెలంగాణలో సెప్టెంబర్‌ 17‌ను ఏ పేరున నిర్వహించాలన్న  విషయంలోనే ఈ రాజకీయపక్షాల్లో ఇంకా స్పష్టతలేదు. కొందరు విముక్తి దినంగా చేపట్టాలంటే, మరికొందరు విమోచనదినమని, ఇంకొందరు విలీన దినోత్సవమంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడి ప్రజలకు మాత్రం ఆరోజు విశిష్టదినమనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కువ కాలం సీమాంద్ర ప్రాంత నాయకుల ఏలుబడిలో ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఏమేరకు అన్యాయం జరిగిందనేందుకు దశాబ్దంన్నర కాలం ఇక్కడ జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే ప్రత్యక్ష నిదర్శనం. ఇతర అన్ని విషయాల మాదిరిగానే సెప్టెంబర్‌ 17‌ను కూడా సీమాంధ్ర నాయకత్వంలోని ప్రభుత్వాలు  ఆరున్నర దశాబ్ధాల కాలం నిర్లక్ష్యం చేసి, తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీశాయని ఆనాడు గొంతుచించుకున్న ఉద్యమ నాయకత్వం, ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్రనేతల దారిలోనే పయనిస్తుండడమే రాష్ట్రంలో గత ఆరేళ్ళుగా  ఈ రోజు వేడుకలను నిర్వహించే విషయం వివాదగ్రస్తమైంది. నిజాం నిరంకుశ పాలనను అంతమొందించిన దినంగా సెప్టెంబర్‌ 17‌కు ప్రత్యేక గుర్తింపుంది. తెలంగాణ గాంధీగా పిలువబడిన భూపతి కృష్ణమూర్తిలాంటి వారు ఎవరు వచ్చినా రాకున్న వరంగల్‌లో తెలంగాణ సరిహద్దులతో కూడిన పతాకాన్ని దాదాపు ఆయన చివరి శ్వాసవరకు ఎగురవేశాడంటే ఆ రోజుకున్న ప్రత్యేకతేమి•న్నది అర్థమవుతున్నది.  భాషాప్రయుక్త రాష్ట్రాల కారణంగా  తెలంగాణలోని కొంతభాగం మహారాష్ట్ర, కర్నాటకలో చేరినప్పటికీ ఆ ప్రభుత్వాలు అక్కడి తెలంగాణ ప్రజలకు సముచిత గౌరవాన్నిస్తూ సెప్టెంబర్‌ 17 ‌వేడుకల కోసం ప్రత్యేక నిధిని కూడా కేటాయించాయి. కాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ  తెలంగాణ ప్రజలు ఆ వేడుకలను అధికార పూర్వకంగా జరుపుకోలేకపోతున్నారు. ఉద్యమకాలంలో  సీమాంధ్ర నాయకత్వాన్ని ఈ విషయంలో విమర్శించిన టిఆర్‌ఎస్‌ ‌నాయకత్వం అధికారంలోకి వచ్చిన  ఈ అయిదేళ్ళలో ఆవిషయాన్నే మరిచిపోయింది. పైగా ప్రజలనుండి వొత్తిడి పెరుగుతుండడంతో దీనిపై అచూతూచి మాట్లాడుతూ వస్తున్న ఈ ప్రభుత్వం తాజా శాసనసభ సమావేశంలో ఆరోజున వేడుకలు అధికారికంగా నిర్వహించే ఉద్దేశ్యం తమకు లేదని తేల్చిచెప్పేసింది. అందుకు కారణాలను కూడా  చెప్పింది. ఆరోజున వేడుకలు నిర్వహిండమంటే మానిపోయిన గాయాన్ని కెలుకడమేనంటూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంతకాలంగా నలుగుతున్న విషయాన్ని నిండుసభలో తేల్చేశాడు. ఉద్యమకాలంలో తాను కూడా ఈ విషయంలో పట్టుపట్టిన విషయం నిజమే అయినప్పటికీ పాత గాయాన్ని ప్రేరేపించవద్దని విజ్ఞులు, మేధావులు ఇచ్చిన సలహా మేరకే తానీనిర్ణయానికి వచ్చినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. కాలగమనంలో కలిసిపోయినదాన్ని పక్కకు పెట్టి, తాజాగా 2014 జూన్‌ 2‌న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజే సరైన విముక్తి దినంగా పాటించాలని సూచించాడు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన ఈ ఆరేళ్ళలో ఏనాడు రాష్ట్రం అశాంతిగా లేదు, ఈ శాంతిని భగ్నంచేయడానికి ప్రయత్నిస్తే ఊరుకునేదిలేదంటూ పరోక్షంగా దీనిపై పట్టుపడుతున్న పార్టీలను హెచ్చరించారాయన. అయితే దీన్ని ప్రైవేటు కార్యక్రమంగా ఎవరి ఉత్సాహాన్నిబట్టి వారు నిర్వహించుకోవచ్చని,  టిఆర్‌ఎస్‌ ‌భవన్‌లో ఏటా ఆరోజున జాతీయ జండాను  ఎగురవేస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు.  అసలు నిజాం వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు  నిజాంకు రాజ్‌‌ప్రముఖ్‌ ‌బిరుదునిచ్చి, రాజభరణాలను ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించడంపై  ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా భారతీయ జనతాపార్టీ ఈ విషయంలో పట్టుదలతోఉంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు ఎన్నికలతో కాస్త బలంపుంజుకున్న భారతీయ జనతా పార్టీ గతంలోకన్నా ఇప్పుడు రాష్ట్రప్రభుత్వంపై మరింత వొత్తిడి పెంచుతోంది. ఆరోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా వేడుకలను నిర్వహించాల్సిందే నంటూ పట్టుపడుతోంది. 2024లో ఎలాగూ అధికారంలోకి వస్తాంకాబట్టి,  అప్పుడు అధికారికంగా విమోచనదినాన్ని తామే అధికారికంగా జరుపుతామంటోన్న బిజెపి,  తెలంగాణ సర్కార్‌ ‌విమోచనదినాన్ని జరిపే విధంగా  కేంద్రతో వొత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ మేరకు రాష్ట్ర గవర్నర్‌కు ఇప్పటికే విజ్ఞాపన పత్రాన్ని అందజేసిందాపార్టీ. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఈ విషయంలో జోక్యం తీసుకోవావలని విజ్ఞప్తి చేసింది. అంతటితో ఆగకుండా  రాష్ట్ర రాజధానిలో పటాన్‌చెరువు వద్ద ఆరోజున భారీ బహిరంగ సభ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకాలను ఎగురవేయడంతో పాటుగా, బైక్‌ ‌ర్యాలీలను నిర్వహించి, ఎంఐఎంకు భయపడి టిఆర్‌ఎస్‌సర్కార్‌ ఈవేడుకలను ఉద్దేశ్యపూర్వకంగా విస్మరిస్తోందన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ప్రయత్నిస్తోంది. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో దీన్నో ఆయుధంగా వాడుకోవాలనుకుంటోంది బిజెపి.

మండువ రవీందర్‌ ‌రావు, గెస్ట్ ఎడిటర్‌

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy