వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మరో ప్రాంతీయ పార్టీ ..? అసంతృప్తి నేతల తర్జనభర్జనలు

September 13, 2019

పైకి అంతా బాగుగా ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో లోలోపల ఏమో జరుగుతుందన్న అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే నేతలు వరుసగా నిరసన గళాన్ని విప్పడమే. అయితే, పార్టీలో అభిప్రాయం కూడా విననప్పుడు పార్టీలో ఉండి ఏం లాభమన్న ఆలోచనలో పలువురు అసంతృప్త నేతలు వచ్చారనీ తెలుస్తుంది. కాంగ్రెస్‌ ‌పార్టీని బలహీనపరిస్తే బిజెపి ఎదుగుతుందనీ, తద్వారా టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి నష్టం అని, ఎంఐఎంతో దోస్తానా వద్దనీ, పార్టీలో తన్నీరు హరీష్‌రావు ప్రాధాన్యతను తగ్గించడం వల్ల పార్టీకి బాగా నష్టం వాటిల్లుతుందనీ పలువురు నేతలు చెప్పినప్పటికీ పార్టీ పెద్దలు వినిపించుకోకపోవడమే చాలా మంది నేతల అసంతృప్తికి కారణంగా తెలుస్తున్నది. ఇదిలా ఉంటే, మారిన రాజకీయ పరిణామాలతో పార్టీలోని అసంతృప్త నేతలందరూ మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు సమాలోచనలు చేస్తున్నట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాలు శుక్రవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి తెలిపాయి. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రాంతీయ పార్టీని స్థాపిస్తే ఎలా ఉంటుంది? పార్టీని వీడి, మరో ప్రాంతీయ పార్టీ పెడితే ఇప్పుడున్న పరిస్థితులలో మరో ప్రాంతీయ పార్టీని ప్రజలు ఆదరిస్తారా?లేదా? ఏ ప్రాతిపాదికన, సిద్ధాంతంతో పార్టీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అసంతృప్త నేతలు తెలంగాణ మేధావులు, ఉద్యమకారులతో పాటు తెలంగాణ అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ఉన్న ప•లువురు ఉన్నతాధికారులతో కూడా భేటీఅవుతూ అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం పార్టీలో చాలా కాలం మాత్రం ఇమడలేకపోతున్నామనీ, తమ అభిప్రాయాలను పట్టించుకోని పార్టీలో ఉండటం కష్టమనీ అసంతృప్త నేతలందరూ ఒకే కచ్చితమైన అభిప్రాయానికి వచ్చారనీ సమాచారం. ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలందరి ముందు ఒకే ఒక ఆప్షన్‌ ఉం‌దనీ అదేమిటంటే…పార్టీలో ఉండటమా? పార్టీని వీడి మరో ప్రాంతీయ పార్టీని పెట్టడమా? బిజెపిలోకి వెళ్లడమా?అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా రానున్న రోజులలో రాష్ట్రంలో భారీ మార్పులు చోటుచేసుకోవడం ఖాయంగా తెలుస్తుంది. ఇదిలావుంటే, ఇంకెంతమంది అంసతృప్త ఎమ్మెల్యేలు, నేతలు బిజెపి వైపు చూస్తున్నారనేది కొన్ని రోజులు ఆగితే తేలిపోతుందని అంటున్నారు కమలనాథులు.!