Take a fresh look at your lifestyle.

మన కాలపు మహా మనిషి!

‘సత్యం, అహింస, శాంతి, సమానత్వ’ సూత్రాలు అటు మౌర్యన్‌ ‌సామ్రాజ్య వాదాన్ని, ఇటు బ్రిటిష్‌ ‌సామ్రాజ్యవాదాన్ని బీటలు వార్చడమే కాదు భూమండలమంతా విస్తరించి మానవుల జీవితాల్లో నూతన కాంతులు నింపాయి. ఈ తాత్విక పదాలను ప్రపంచంలోని అన్ని మతాల్లో, వర్ణాల్లో, జాతుల్లో ఉన్న వివక్షతపై ప్రజల్ని మేల్కొలిపి, ప్రశ్నించడానికే కాదు వాటికి ఒక సైద్ధాంతిక రూపాన్ని ఇచ్చి దాని ప్రాతిపదికగా పీడిత ప్రజలను ఐక్యం చేయవచ్చని పీడిత, తాడిత జాతులకు, పరాయి పాలనలో ఉన్న దేశాలకు తెలియజెప్పి విముక్తి కొరకు, స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం, సౌబ్రాతృత్వం సాధించడానికి వాడవచ్చని ప్రపంచానికి పరిచయం చేసినవాడు గాంధీ. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్‌ ‌న్యూస్‌ ‌నెట్వర్క్ (చీచీ) జరిపిన సర్వేలో గాంధీని ప్రజలు గుర్తించారు. టైమ్‌ ‌పత్రిక ప్రపంచవ్యాప్తంగా అధిక ప్రాముఖ్యత గల 25 మంది రాజకీయనాయకులలో గాంధీని ఒకరుగా పేర్కొంది. ఆయన పూర్తి పేరు మోహన్‌ ‌దాస్‌ ‌కరంచంద్‌ ‌గాంధీ. అక్టోబరు 2, 1869న గుజరాత్‌లోని పోరుబందర్‌లో జన్మించాడు. గాంధీ సైద్ధాంతిక పునాది ఎంత గొప్పదంటే రవీంద్రనాధ్‌ ‌ఠాగోర్‌చే ‘మహాత్మ’ అని, భిన్నదృవమైన సుభాష్‌ ‌చంద్రబోస్‌చే ‘జాతిపిత’ పిలువబడేంత గొప్పది! ఎర్రవాడ జైళ్ళో ఆయన చేబట్టిన నిరహార దీక్ష అంబేడ్కర్‌ను సైతం కరిగించడమే కాదు అయిష్టతతోనే కమ్యూనల్‌ అవార్డ్‌పై ఆయన ప్రతిపాదనలను అంగీకరించ వలసి వచ్చింది. ఆ సైద్ధాంతికతను గుర్తించే ప్రపంచంలోని పలు దేశాలతో పాటు గాంధీ జయంతి అక్టోబర్‌ 2‌ను ‘ప్రపంచ అహింసా దినం’గా ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్నది. ఇంతటి మహాత్ముని 150వ జయంతి ఉత్సవాలను సంవత్సరమంతా ఆయన మార్గాన్ని అనుసరించే విధంగా స్మరించుకోవడం మాత్రమే సముచితం కాకపోవచ్చు! ఆ మార్గంలో ప్రపంచ మానవాళి పయనించి తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి గల అవకాశాల అన్వేషణ చేస్తూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడం సముచితం. అనేక మతాల పవిత్ర గ్రంథాలను ఆయన అధ్యయనం చేసాడు. లియో టాల్‌స్టాయ్‌ ‌రాసిన ‘ది కింగ్డమ్‌ ఆఫ్‌ ‌గాడ్‌ ఈజ్‌ ‌వితిన్‌ ‌యు’, జాన్‌ ‌రస్కిన్‌ ‌యొక్క ‘అన్టూ దిలాస్ట్’ ‌గ్రంథాలతో పాటు ఆయన ఆలోచనలపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథము భగవద్గీత. వీటితో పాటుగా సమాజాన్ని అధ్యయనం చేయడం, బెర్నార్డ్ ‌షా లాంటి వారి పరిచయం వలన ఆయన తత్వము ఎంతో పరిణతి చెందింది. గాంధీ స్వయంగా టాల్‌స్టాయ్‌ ‌యొక్క శిష్యునిగా పరిగణించుకొనేవారు. గాంధీజీ తన విలువల సారంశాన్ని తాత్వికంగా ‘‘సత్యమే దేవుడు’’ అని పేర్కొన్నాడు. సత్యాగ్రహాన్ని మార్టిన్‌ ‌లూథర్‌ ‌కింగ్‌ ‌జూనియర్‌ ‌తన ప్రసిద్ధ ప్రసంగం ‘‘నాకు ఒక కల వుంది’’లో ‘‘ఆత్మ శక్తి’’గా పేర్కొన్నారు. సామాన్యునికి భుజబలం కన్నా గొప్ప నైతిక శక్తి సత్యాగ్రహం ఒక ‘‘సార్వత్రిక శక్తి’’.
విప్లవం అంటే మార్పు అని అది సాయుధ పోరాటం ద్వారా మాత్రమే సాధ్యం అని రష్యా విప్లవం అనంతరం బుద్ధిజీవులు నమ్ముతున్న కాలంలో దానిని తోసిరాజని సత్యం, అహింస, సమానత్వంతో కూడిన సిద్ధాంత ప్రాతిపదికగా విప్లవాలు తీసుకురావడమేకాక ప్రజలలో మార్పు సాధించవచ్చని ప్రపంచానికి ఒక కొత్త దశ, దిశను నిర్దేశం చేసాడు. ఆ సిద్ధాంత మూ)సూత్రాలను సాధించడానికి ప్రాతినిధ్యం, నిరసన, సహాయనిరాకరణ, సత్యాగ్రహము అనే ఆయుధాలను వివక్షతపై ఆఫ్రికాలో, స్వాతంత్య్రంకై భారతదేశంలో ఆచరణ సాక్షిగా రుజువు చేసి, ప్రపంచ మానవాళికి అందించిన మహనీయుడు గాంధీ. మహాత్ముని సత్యాగ్రహ విధానం యుద్ధానికి ప్రత్యామ్నాయం. అందుకే ఆయన భారతీయులచేతనే కాదు ప్రపంచ ప్రజలందరిచేత ముఖ్యంగా ఐన్‌స్టీన్‌, ‌మార్టిన్‌ ‌లూథర్‌ ‌కింగ్‌ ‌జూనియర్‌, ‌నెల్సన్‌ ‌మండేలా వంటి దిగ్గజ నాయకులచే ఆరాధ్యుడుగా అభివర్ణించబడ్డాడు. గాంధీ సిద్ధాంతాల ప్రాతిపదికగానే అమెరికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా నడిచిన పౌర హక్కుల ఉద్యమానికి నాయకత్వం వహించిన మార్టిన్‌ ‌లూథర్‌ ‌కింగ్‌, ‌స్వాతంత్రం కోసం దక్షిణాఫ్రికాలో నెల్సన్‌ ‌మండేలా, మయన్మార్లో ప్రజాస్వామ్యం కోసం ఆంగ్‌ ‌సాన్‌ ‌సూకీ పోరాటాలు నడిచాయి. ఉత్తర ఐర్లాండ్‌లో, ఉగ్రవాద ఘర్షణల్లో కూడా గాంధేయ సూత్రాల ద్వారానే తాత్కాలిక శాంతి నెలకొంది. భారతదేశంలో నెహ్రూ, వినోభా భావే, రామ్‌మనోహర్‌ ‌లోహియా మరియు దలైలామా గాంధీ వారసులుగా పేర్కొనబడ్డారు.
ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఈజిప్ట్, ‌ట్యునీషియా మరియు సిరియాలో అరబ్‌ ‌మేల్కొలుపులో గాంధేయ పద్ధతులు మరియు నమ్మకాల ప్రభావం, స్ఫూర్తి కనిపిస్తుంది. ఈజిప్ట్‌లో జనవరి 25, 2011న, అహింసా పద్ధతుల్లో నిరసనలు ప్రారంభమై 18 రోజులు కొనసాగి అధ్యక్షుడు ముబారక్‌ ‌పతనం జరిగింది. ఈజిప్టులో ఉద్యమంలో సమాజంలోని అన్ని వర్గాలు, పేదలు, ధనవంతులు, విద్యావంతులు, చదువురానివారు, నిపుణులు మరియు సాధారణ పురుషులు, మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ట్యునీషియాలో అవినీతి, నిరుద్యోగం, ఆహార అభద్రత, భావ ప్రకటనా స్వేచ్ఛ లేకపోవడం మరియు జీవన పరిస్థితులకు వ్యతిరేకంగా గాంధేయ మార్గంలోనే ఉద్యమం జరిగింది. మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా గాంధేయవాద పద్ధతుల్లోనే నడిచి విజయవంతమైంది.
సత్యం, అహింస సూత్రాలను కనిపెట్టినది గాంధీజీ కాదుగాని వాటిని భారీస్థాయిలో రాజకీయాలలో మొదట ఉపయోగించిన వ్యక్తి గాంధీజీ. అహింసతో సత్యాగ్రహమూ పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. జీవితంలో అన్నింటిని ప్రయోగాత్మకంగా తనపై ప్రయోగించుకొని ఇవి ఆచరణసాధ్యం అని నమ్మిన తర్వాతే వాటిని ప్రజలకు పరిచయం చేసాడు. గాంధీది కొల్లాయి గట్టిన అతి సామాన్యమైన జీవితం. శాంతి, అహింసలను నూలుగా మార్చి రాట్నంపై వడకి శ్రమలో యోగాను చేసి చూపినవాడు గాంధీ. మురికివాడలు శుభ్రంచేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని ఆ మహాత్ముడు చాటాడు. విదేశీ వస్తువులను బహిష్కరించడం, నూలు వడకడం, ఖద్దరు ధరించడం, విదేశీ విద్యను, బ్రిటిష్‌ ‌సత్కారాలనూ తిరస్కరించే నిరసన పద్ధతుల వల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది. మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు.
ప్రపంచ స్థాయిలో శాంతి రావడానికి సత్యాగ్రహం మరియు అహింసా వంటి గొప్ప మార్గాలను ఉపయోగించాలని గాంధీ నొక్కిచెప్పారు. అహింస ద్వారా మాత్రమే ఈ ప్రపంచంలో సత్యాన్ని కనుగొన వచ్చని గాంధీ గట్టిగా నమ్మారు. ఇది వ్యక్తిగత లేదా అంతర్జాతీయ స్థాయిలో సంఘర్షణను పరిష్కరించ డానికి అతిపెద్ద సాధనంగా ఉపయోగపడుతుందని చెప్పాడు. హింస, ప్రతిహింసకు దారితీస్తుంది. విశ్వాసం మరియు రాజీసూత్రాల ఆధారంగా హింసను అహింస ద్వారా మాత్రమే ఎదుర్కోగలమని గాంధీ అభిప్రాయపడ్డారు. గాంధీ హింసను ‘అసత్యంతో’ పోల్చాడు. గాంధీకి అహింస అనేది ‘సత్యం యొక్క లిట్మస్‌ ‌పరీక్ష’. అందుకే సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో జరిగిన చౌరీ చౌరా హింసాత్మక సంఘటనతో కలతచెంది వెంటనే ఆయన ఉద్యమాన్ని నిలిపి వేసి లిట్మస్‌ ‌పరీక్షలో గెలిచాడు.
గాంధీ దృష్టిలో స్వాతంత్య్రము అంటే పరిపూర్ణమైన వ్యక్తివికాసానికి అవకాశం. అంటరానితనమున్న చోట, మురికివాడలున్న చోట, హిందూ ముస్లిములు తగవులాడుకొంటున్నచోట స్వాతంత్య్ర మున్నదనుకోవడంలో అర్ధం లేదు. గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచనా సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలూ, విలువలూ ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకొన్నాయని మనం గ్రహించాలి. గాంధీ భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించాడు మరియు సాధారణ ప్రజలతో సన్నిహితంగా ఉన్నాడు. అతను ‘వారితో నివసించాడు, వారితో వాదించాడు మరియు వారితో ప్రార్థించాడు’. భారతదేశంలో అంటరానితనం యొక్క తీవ్రతను గుర్తించి ఆ సమస్యపై శాంతియుతంగానే ఉద్యమాలు నడిపాడు. చంపారన్‌, ‌ఖేడా ఉద్యమాల ద్వారా రైతుల సమస్యలపైనే కాదు ఆఫ్రికాలో ఉన్న సమయంలో గనులలో పనిచేసే కార్మిక సమస్యలపై కూడా ఉద్యమాలు నడిపాడు. మతసామరస్యంలో భాగంగా ఖిలాఫత్‌ ఉద్యమానికి మద్దతు పలికాడు. అతని వివిధ ఉద్యమాలకు ప్రజల మద్దతు కోరడంలో ఇవన్ని ఆయనకు సహకరించాయి. అతని సరళమైన జీవనం, ఉన్నత ఆదర్శాలు మరియు త్యాగం చేసే స్వభావం ప్రజలను, నాయకులను ఒకేలా ఆకర్షించింది కాబట్టే అందరూ అతని వెనుక నడిచారు.
స్వాతంత్య్రానంతరం మత అల్లర్లు జరుగుతున్న బెంగాల్‌ ‌లాంటి ప్రాంతాలకు వెళ్ళి శాంతియుత చర్చలు జరిపి విజయం సాధించాడు. అందుకే ఒక సందర్భంలో మొదటి గవర్నర్‌ ‌జనరల్‌ ‌మౌంట్‌బాటన్‌ ‌వైర్‌ ‌సందేశంలో ఆయనకు ఇలా అభినందనలు తెలుపుతూ ‘‘పంజాబ్‌లో మనకు యాభై ఐదు వేల మంది సైనికులున్నారు. కానీ అల్లర్లు అదుపుకాలేదు. బెంగాల్‌లో మన సైన్యానికి చెందిన ఒకేఒక వ్యక్తి ఉన్నారు. అక్కడ సంపూర్ణ శాంతి నెలకొంది.’’ అన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్‌ ‌గాంధీ గురించి మాట్లాడుతూ ‘‘ఈ భూమిపై భావితరాల వారు ఒకప్పుడు ఈ నేలపై ప్రేమశక్తి, అహింసాశక్తితో మానవులను ఉన్నతీకరించవచ్చని నమ్మిన రక్తమాంసాలున్న ఒక మనిషి నడయాడాడా!, మన మధ్య జీవించాడా! అనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు’’ అని వ్యాఖ్యానించాడు. మార్టిన్‌ ‌లూథర్‌ ‌కింగ్‌ ‘‘‌జీసస్‌ ‌నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు’’ అన్నాడు.
దేనికి వ్యతిరేకంగానైతే తన జీవితమంతా పోరాడాడో అదే హింస చేతిలో జనవరి 30, 1948లో డిల్లీలోని బిర్లా మందిర్‌లో గాడ్సే అనే దుండగుడు కాల్చి చంపడంతో ఈ నేల తల్లి విముక్తి కోసం తన నెత్తుటి చుక్కల్ని ధారపోసి ఒరిగినవాడు గాంధీ. ఆ నెత్తుటి చుక్కల చితాభస్మంలోంచే ప్రతి ఊరిలో గాంధీ విగ్రహాలు నెలకొల్పబడ్డాయి. మరణాంతరం ఆయన సిద్ధాంతానికేకాక, ఆర్థిక, పారిశ్రామిక, విద్యా రంగాల్లో ఆయన చూపిన మార్గానికి కాంగ్రెస్‌ ‌పార్టీ మెల్లమెల్లగా తిలోదాలకిచ్చినప్పటికి గాంధీయిజానికి మరణం లేదు. ఈ పద్ధతులు గాంధీ కాలానికే కాక నేటి కాలానికి కూడా సందర్భోచితమైనవి మరియు ఆచరణాత్మకమైనవి. అది అమరం, శాశ్వతం. ఎందుకంటే వ్యక్తిగత, స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలలో తలెత్తున్న సమస్యల పరిష్కారానికి ఇవి ఎంతగానో ఉపయోగాపడతాయి. పై అన్ని స్థాయిల్లో అహింస, శాంతి లేకపోవడం వల్ల నేరాల పెరుగుదల, నిరుద్యోగం, మత, జాతి అల్లర్లు, ఆర్థిక, లింగ అసమానతలు, అవినీతి, మానవ హక్కుల నిరాకరణ, అగ్ర దేశాల ఆధిపత్యం, ఉగ్రవాదం పెరగడం, పర్యావరణం, ప్రపంచీకరణ లాంటి అనేక సమస్యలతో ప్రపంచ మానవాళి బాధపడుతోంది. దిగజారిపోతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ విలువలను కాపాడుకోవాలంటే గాంధీ ప్రబోధాలైన సత్యం అహింసలను పాటించి తీరాలి. వర్తమాన భారత దేశంలో ఆర్థిక అభివృద్ధి ఎలావున్నా, సామాజిక శాంతి మాత్రం పెను ప్రమాదంలో ఉన్నది. మునుపటి మానవులు మరణం అనివార్యమని భయపడ్డారు, కానీ ఇప్పుడు మానవజాతి మొత్తం ‘‘మానవ జాతి అంతరించిపోతుందనే భయంతో జీవిస్తుంది’’. ఈ భయం నుండి బయటపడాలంటే గాంధీ అనుసరించిన శాంతియుత మార్గమే ఏకైక శరణ్యంగా కనబడుతున్నది. మానవ సమాజం ఎదగాలని, జీవించాలని కోరుకుంటే, అహింసాత్మకంగా కలిసి జీవించడం తప్ప వేరే మార్గం లేదు. ప్రాపంచిక విషయాలలో అహింసను ఆచరించడం అంటే దాని నిజమైన విలువను తెలుసుకోవడం. ‘‘… అహింస అనేది వ్యక్తి తన శాంతి మరియు అంతిమ మోక్షానికి పాటించాల్సిన ధర్మం కాదు, కానీ ఇది సమాజానికి ఒక నియమం లేదా ప్రవర్తన.’’ అని గాంధీ అన్నారు. అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన మహాత్మాగాంధీకి నోబెల్‌ ‌శాంతి బహుమతి ఐదుసార్లు ప్రతిపాదించబడ్డ ఇవ్వలేదు.1948లో ప్రతిపాదించబడినా అదే సంవత్సరం గాంధీ హత్యచేయబడినందున ఇవ్వలేదు. కొన్ని సంవత్సరాల తరువాత నోబెల్‌ ‌కమిటీ గాంధీకి నోబెల్‌ ‌బహుమతి ఇవ్వకపోవటానికి విచారం ప్రకటించింది.
ఒక వైపు 150వ జయంతి ఉత్సవాలను సంవత్సరం మంతా జరుపడానికి పిలుపునిస్తూనే రెండోవైపు పాలకులు గాంధీని ఒక కులస్తునిగా గుర్తిస్తు, గాంధీ బిర్లా గారితో సన్నిహితంగా ఉండేవారంటూ ప్రకటించి చరిత్రను వక్రీకరించి కార్పొరేట్‌ ‌పారిశ్రామికవేత్తలకు దేశాన్ని తాకట్టు పెట్టడం, గాంధీని చంపిన గాడ్సెను పూజింప చూడడం, గుడులు కట్టడానికి ప్రయత్నించడం దేనికి సంకేతం! ఒకప్పుడు బ్రిటిష్‌ ‌సామ్రాజ్యవాదాన్ని పారద్రోలడం కోసం గాంధీ స్వాతంత్రోద్యమం నడిపి స్వాతంత్య్రం, సార్వభౌమత్వం సాధిస్తే ఇవ్వాల్టి పాలకులు ప్రపంచీకరణ పేరుతో వాటిని ఇతర దేశాలకు తాకట్టుపెడుతూ, రాజకీయాలలో అవినీతిని ప్రోత్సహించడం ఆందోళన కలిగిస్తున్నది. గాంధీలాగా సాధారణ జీవితం గడపడం నుండి ఎప్పుడో దూరం జరిగారు. బుద్దుడిని, బౌద్దాన్ని ఇక్కడి నుండి వెళ్ళగొట్టినట్లే, గాంధీని, ఆయన చెప్పిన సత్యం, అహింస, సమానత్వం సిద్ధాంతాలను వెళ్ళగొట్టాలని నేటి పాలకులు చూస్తున్నట్టుగా కనబడుతున్నది! చరిత్రను మార్చి గాంధీని గాడ్సేను చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణలోని, ఈ దేశంలోని విద్యావంతులు ఎండగట్టి, ఆయన చూపిన క్రాంతి దర్శనాన్ని సమకాలీన తరాలకు తెలిపి, భవిష్యత్‌ ‌తరాలకు అందించి ఆ పోరాట మార్గాన్ని కాపాడటమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి!!
డా।। ఏరుకొండ నరసింహుడు,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌(‌టిటియు)

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy