వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మనిషి సామాజిక బాధ్యతలను విస్మరించకూడదు

July 10, 2019

జనాభా పెరుగు దలతో జరిగే పరిణామాల గురించి తెల్సుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నది. నానాటికి పెరుగుతున్న జనాభా.. తద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, ఆయా సమస్యలపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా జూలై 11వ తేదీన ‘‘ప్రపంచ జనాభా దినోత్సవాన్ని’’ నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదలకు, తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజలలో చైతన్యం తెచ్చేందుకుగాను ఐక్యరాజ్యసమితి 1989వ సంవత్సరంలో దీనిని ప్రారంభించింది. మనం మన సాంప్రదాయాన్నీ, మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఎలాగైతే పండుగలను చేసుకుంటున్నామో అదే విధంగా మన సమాజాన్ని మన దేశాన్ని ప్రేమిస్తూ దినోత్సవాల ద్వారా గత స్మృతులను జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చరిత్ర తెలుసుకొని మన జీవిత విధానము సరియైన మార్గంలో సాగించడమే దినోత్సవాల ముఖ్య ఉద్దేశం. నానాటికీ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్లుగా ప్రకృతి వనరులు తరిగిపోతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు రీఛార్జి చేసుకునేందుకు, లేదా సహజ వనరుల్ని పొదుపుగా వాడుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. ప్రకృతి వనరుల ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పర్యావరణాన్ని కాపాడుకునేలా చేయాలి. లేకపోతె రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామలు సంభవిస్తాయి. అలాగే ప్రపంచంలో జనాభా పెరుగుదల వల్ల కలిగే నష్టాలు, ఆర్థికంగా కుంగిపోవడం, నిరక్షరాస్యత, అవసరాలు తీరకపోవడం లాంటి సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ విషయాలపై వారికి క్షుణ్ణంగా అవగాహన కల్పించాలి. జనాభా పెరుగుదల వల్ల చాలా మందికి… ఆహారం దొరకడం లేదు. పిల్లలకు సరైన పౌష్టికాహారం అందటం లేదు. అనేక మంది పిల్లలు… ఆకలితో చనిపోతున్నారని మనకు సర్వేల ద్వారా తెలుస్తుంది దీనంతటికీ కారణం జనాభా పెరుగుదల!ప్రస్తుతం జనాభా పెరుగుతోంది కాని ఆహార ఉత్పత్తులు పెరగడం లేదు. అవనిపై జనాభా కోట్లాదిగా పెరిగి పోతోంది. అందుకే చాలామందికి తిండి దొరకడం కష్టమై పోతోంది. కాబట్టి ఈ విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి సమాజంలో అన్ని వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు విసృతంగా పని చెయ్యాలి. సామాజికంగా ప్రతి ఒక్కరి బాధ్యతగా అవగాహన కల్పించాలి. జనాభా పెరుగుదల అన్నది ఒక సామాజిక సమస్య, ఇది ఒకరికి సంబంధించిన సమస్య కాదు. ఇది అందరు అర్థం చేసుకొనే వరకు, ప్రపంచానికి ఈ సమస్య కొనసాగుతూనే ఉంటుంది. పర్యావరణ నిపుణుల ప్రకారం ప్రస్తుతం ఉన్న జనాభాలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతలు విస్మరించిన, జనాభా పెరుగుదలను తగ్గించకుంటే ఆహారం, పిల్లల పోషణ, కాలుష్యం, పేదరికం, తల్లి ఆరోగ్యం మొదలగునవి అన్నీ ఈ సమస్యతో ముడిపడి వున్నాయి. కాబట్టి ఇది భవిష్యత్తును దెబ్బతీసే సమస్య అని తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పి. మహమ్మద్‌ ‌రఫి సామాజిక కార్యకర్త