వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మనిషి మనుగడకు ప్రమాదమే..!

August 20, 2019

నల్లమల యురేనియం, క్వారీలు, క్రషర్లూ..సామాన్య ప్రజల జీవన భద్రతకు భరోసానిచ్చేందుకు పాలకులు సిద్దపడటం లేదు. ప్రజల తరుఫున చేసే వాదనలన్నింటినీ సత్యదూరమని కొట్టిపారేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. అందులో భాగంగానే ‘ప్రకృతిపై ఆధిపత్యమే ప్రగతి’ అనే ఆధునిక వ్యాపార ఆలోచన ధోరణి పునాదులను పటిష్టపరుస్తూ ప్రకృతిని విచ్ఛిన్నం చేసే విధానాలను పాలకులు యథేచ్ఛగా అమలు పరుస్తున్నారు. అమెరికా ఆదివాసి తెగల ముఖ్యనేత సియాటిల్‌ 1952‌లో అమెరికా అధ్యక్షునికి ఓ లేఖ రాశారు. అందులో ఇలా పేర్కొన్నారు. ‘గాలీ తాజాద•నానికి, నీటి ధగధగలకీ యజమానులం కానప్పుడు వాటినెల అమ్మగలం’ అంటూ పేర్కొంటాడు. కానీ నేటి పాలకులు గాలీ తాజాధనాన్ని, నీటి ధగధగలనే కాదు యావత్తు ప్రకృతి సంపదను కొల్లగొట్టటంలో ఆరితేరిపోయారనేది కాదనలేని సత్యం. నల్లమలలో ‘యురేనియం’ తవ్వకాలు కావచ్చు, ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో నిర్వహించబడుతున్న క్వారీలు, క్రషర్లు, డాంబర్‌ప్లాంట్లు కావచ్చు.. అక్కడైనా, ఇక్కడైనా ప్రకృతి సంపదను యథే•చ్ఛగా కొల్లగొట్టటం, పర్యావరణాన్ని దెబ్బతీయటానికే అనేది మాత్రం గ్రహించాల్సిన అవసరముంది. పాలకులు చేపడుతున్న చర్యల వల్ల ప్రకృతి వినాశనంతో పాటు మనిషి మనుగడ, జీవించే హక్కు ప్రశ్నార్థకం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలోన్ని ఏడు జిల్లాల పరిధిలో యురేనియం తవ్వకాలకు కేంద్రం సిద్ధపడిన విషయం బహిరంగ రహస్యమే. ఆసియాలోనే అతిపెద్ద అరణ్యంగా పేరొందిన ‘నల్లమల’లో యురేనియం తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. నల్లమల యురేనియం తవ్వకాల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపయోగించే తాగునీరు, సాగునీరు సైతం విషమయంగా మారుతుందని, హైదరాబాద్‌కు సైతం ప్రమాదం వాటిల్లక తప్పదని పర్యావరణ వేత్తలు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు నెత్తినోరు మొత్తుకున్నా పాలకులు పెడచెవిన పెడుతున్నారు. హైదరాబాద్‌తో సహా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదం అవుతుందనేది కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. గాలీ, నీరు, పర్యావరణం, ప్రకృతి సంపదను భవిష్యత్‌ ‌తరాలకు స్వచ్ఛతగా అందించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి స్వార్థంతో ప్రకృతి వినాశనానికి దారితీసే చర్యలకు పాల్పడుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. నల్లమల యురేనియం తవ్వకాల వల్ల ప్రమాదాల భారినపడే ప్రజలు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో గుట్టలు కరుగదీసి క్వారీలు, క్రషర్లు నిర్వహించబడుతున్న గ్రామాలలోని ప్రజలతో పాటు యావత్తు ప్రజానీకం భవిష్యత్‌ ‌మానవ మనుగడకు ప్రమాదంగా గుర్తెరుగాలి.
‘‘క్వారీలు, క్రషర్లు, గనుల తవ్వకాలు తదితర వంటివన్నీ అభివృద్ధిలో భాగమే. ఇలాంటివి చేపట్టకుండా ప్రగతి ఎలా సాధ్యం.’’ అంటూ వాదించే పెద్దమనుషులు కూడా ఉన్నారు. తమ తర్కంతో అదే సరైందనే విధంగా వాదించే ఘనులు వీళ్లు. అభివృద్ధి తర్కాన్ని చూసి నిజమే ఇది సరైందే అని భ్రమించే విధంగా వీరి వాదన ఉంటుందనటంలో సందేహం లేదు. కానీ వ్యాపారమే ప్రాథమిక హక్కుగా భావిస్తున్న వారు గనుల తవ్వకాలు, క్వారీలు, క్రషర్లతో గుట్టలను కరుగదీయటం లాంటి చర్యల వల్ల ‘మనిషి బతికే హక్కు’ కు భంగం కలుగుతుందనేది కూడా గమనించాలి.
మన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ‘జీవించే హక్కు’ ఒకటని మనం చెప్పుకుంటాం. కానీ రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాపాడాల్సిన పాలకులే కాలరాసే విధంగా తమ విధానాలను రూపొందిస్తున్నారనేది ప్రజలు గమనించాలి. మానవ మనుగడకు ప్రమాదకరమైన ఇటువంటి చర్యలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరముంది. ప్రకృతి వినాశన చర్యలు ఇలాగే కొనసాగితే వచ్చే దశాబ్దన్ని మనిషి చూస్తాడనటం కూడా ప్రశ్నార్థకమని ఇప్పటికే పరిశోధకులు, పర్యావరణవేత్తలువిశ్లేషించారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రేక్షకులుగా ఉండకూడదు. నల్లమల యురేనియం తవ్వకాలతో పాటు నష్టదాయకంగా పరిగణించే క్వారీలు, క్రషర్లు, డాంబర్‌ప్లాంట్ల నిర్వహణను నిలువరింపచేసేందుకు కంకణబద్దులు కావాల్సిన అవసరముంది. వీటికి వ్యతిరేకంగా ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకుంటున్న శక్తులకు ప్రజలు అండగా నిలువాల్సిన అవసరం ఎంతో ఉంది.
మైఖేల్‌ ‌మూర్‌ అన్నట్లుగా ‘‘ప్రజాస్వామ్యం చూసే ఆటకాదు. అది పాల్గొనే ఘటన? మనం పాల్గొనకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు’’(డెమొక్రసీ ఈజ్‌ ‌నాట్‌ ఎ ‌స్పెక్టేటర్‌ ‌స్పోర్ట్, ఇట్స్ ఎ ‌పార్టిసిపేటరీ ఈవెంట్‌. ఇఫ్‌ ‌వుయ్‌ ‌డోన్ట్ ‌పార్టిసిపేట్‌ ఇన్‌ ఇట్‌, ఇట్‌ ‌సీజెస్‌ ‌టుబి ఎ డెమొక్రసీ). పాల్గొనడమే పరిష్కారం అంటాడు. అందుకోసమే నల్లమల యురేనియం తవ్వకాలతో పాటు ముప్పుగా భావించే చర్యకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాన్ని సాగించి అందులో పాల్గొనటమే భవిష్యత్‌ ‌తరాల మనుగడకు పరిష్కారం.
రాజేందర్‌ ‌దామెర
జర్నలిస్ట్ – ‌వరంగల్‌
‌సెల్‌ :8096202751