వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

మజ్లిస్‌ ‌వల్లే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు : టిఆర్‌ఎస్‌పై కిషన్‌ ‌రెడ్డి మండిపాటు

September 17, 2019

ఫోటో: మంగళవారం రాత్రి పటాన్‌చెరులో జరిగిన సభలో కేంద్రమంత్రులు, నేతలకు బతుకమ్మలతో స్వాగతం పలుకుతున్న సంగారెడ్డి జిల్లా బిజెపి నేతలు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో పాటిలో మంగళవారం రాత్రి జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లోకేంద్రమంత్రులు ప్రహ్లాద్‌జోషి, కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాల బాటలో వెళ్తూ విమోచన దినోత్సవాన్ని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రభుత్వం తుడిపేస్తోందని అన్నారు. మజ్లిస్‌ ‌వల్లే విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించటం లేదని ఆయన చెప్పారు. వోటు బ్యాంకు రాజకీయాలు, చరిత్ర వక్రీకరణను బీజేపీ సహించదన్నారు. నిజాం పరిపాలన తనకు ఆదర్శమని కేసీఆర్‌ ‌చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ‌లక్ష్మణ్‌, ‌మురళీధర్‌రావు,బిజెపి ప్రముఖ నేతలు బాబు మోహన్‌, ‌డీకే అరుణ, వినోద్‌, ‌పార్లమెంట్‌ ‌సభ్యులు అరవింద్‌ ‌తదితర ప్రముఖులకు పార్టీ జిల్లా అధ్యక్షులు నరేందర్‌ ‌రెడ్డి తో కలిపి శ్రీకాంత్‌గౌడ్‌ ‌పటాన్‌చెరు ముఖద్వారమైన ఇక్రిసాట్‌ ‌వద్ద ఘన స్వాగతం పలికారు.

పటాన్‌చెరులో అంబేద్కర్‌ ‌విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారీ స్థాయి లో ర్యాలీ నిర్వహించి ఎస్‌విఆర్‌ ‌గార్డెన్‌ ‌వద్దకు చేరుకున్నారు. అనంతరం ఎస్‌విఆర్‌ ‌గార్డెన్‌లో జరిగిన సమావేశంలో శ్రీకాంత్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్‌ ‌పార్టీకి తలొగ్గి నియంతలా వ్యవహరిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి బిజెపి సిద్ధంగా ఉందని, తెలంగాణలో అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ విమోచనలో పటాన్‌చెరు ప్రాంతానికి ఒక ప్రాముఖ్యత ఉందని, అందుకే పటాన్‌చెరులో రాష్ట్రస్థాయి విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. జిల్లా అధ్యక్షుడు నరేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి కేసీఆర్‌ ‌ప్రభుత్వం మీనవేషాకు వేస్తుందని తెలిపారు. ఆనాడు సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌నైజాం నవాబు ఆగడాలను అడ్డుకొని తెలంగాణ ప్రాంతానికి విమోచన కల్పించాలని కొనియాడారు. అనంతరం మంత్రులను శ్రీకాంత్‌ ‌గౌడ్‌ ‌ఘనంగా సన్మానించి మెమెంటోలు అందజేశారు.

కేసీఆర్‌..‌హిందువా? రజాకారా?: పరిపూర్ణానంద స్వామి

హిందుగాళ్లు… బొందుగాళ్లు అని మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హిందువా? రజాకారా? అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు.సెప్టెంబర్‌ 17‌ను పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లాలోని వీరబైరాన్‌పల్లిలో కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌ ‌కుమార్‌తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ..సాధారణ ప్రజలు తూటాలకు మరణిస్తే నయా నిజాం కోటలో బతుకుతున్నారు. తెలంగాణ అంతా తిరుగుతా..అమరవీరుల ఇంటికి వెళ్తా. నాకు ప్రధాని పదవి వడ్లగింజతో సమానం. అని అన్నారు. ఎంపి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ…2024లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందనానరు. బైరాన్‌పల్లి అమరవీరుల ఆశయం ఇంకా పూర్తి కాలేదని ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. కేసీఆర్‌ ‌నీచచరిత్రను సమాధి చేసి నిజమైన చరిత్రను లిఖిస్తామని ఆయన తెలిపారు. 2024లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని బండి సంజయ్‌ ‌చెప్పారు. వీరి వెంట రాజ్యసభ మాజీ సభ్యుడు ఆనంద్‌ ‌భాస్కర్‌, ‌సిద్ధిపేట జిల్లాకు చెందిన బిజెపి నేతలు ఉన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో జరిగిన తిరంగా యాత్రలో ఈ నేతలందరూ పాల్గొన్నారు.