వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భూమి పుత్రికలకు ‘వీసా’ గ్రహణం..!

September 12, 2019

ఐక్యరాజ్య సమితి పురస్కార గ్రహీతలు..
అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌నిర్వాకం
ఐక్యరాజ్యసమితివారి మహోన్నతమైన ఈక్వేటర్‌ ‌పురస్కారాన్ని 2019కి గాను దక్కన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సొసైటీకి ప్రకటించింది.127 దేశాలనుండి వచ్చిన 847 దరఖాస్తులనుండి కేవలం 20 సంస్థలను ఈ పురస్కారానికి ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసింది. అందులో ఒకటైన మనదేశంలో రాష్ట్రంలోని జహీరాబాద్‌ ‌దక్కన్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌సొసైటీ ఒక్కటే ఈ పురస్కారానికి ఎంపికైంది. అందుకనుగుణంగా ఏర్పాట్లన్నీ చేసుకున్నప్పటికీ సొసైటీకి చెందిన గ్రామీణ మహిళా రైతులు వెళ్లి అందుకోలేని పరిస్థితి. కారణం వీసా తిరస్కరణకు గురవ్వడమే..!
వీళ్ళు అందుకోబోయేది చిన్నా చితకా అవార్డు కాదు. అంతర్జాతీయ అవార్డు. ఆ ఇచ్చింది ఎవరో పేరూ ఊరూ లేనివాళ్లు కాదు. ఐక్యరాజ్యసమితి. అవును. ఐక్యరాజ్యసమితివారి మహోన్నతమైన ఈక్వేటర్‌ ‌పురస్కారాన్ని 2019కి గాను దక్కన్‌ ‌డెవలప్మెంట్‌ ‌సొసైటీకి ప్రకటించింది.127 దేశాలనుండి వచ్చిన 847 దరఖాస్తులనుండి కేవలం 20 సంస్థలను ఈ పురస్కారానికి ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసింది. అందులో ఒకటి డెక్కన్‌ ‌డెవలప్మెంట్‌ ‌సొసైటీ. మనదేశంలో దక్కన్‌ ‌డెవలప్మెంట్‌ ‌సొసైటీ ఒక్కటే ఈ పురస్కారానికి ఎంపికైంది. సెప్టెంబర్‌ 24‌వ తేదీన న్యూయార్క్‌లోని టౌన్‌ ‌హాల్‌లో జరిగే ప్రధానమైన కార్యక్రమంలో పాల్గొని పదివేల డాలర్ల బహుమతిని స్వీకరించవలసింది ఆహ్వానించింది. అవార్డు ప్రదానోత్సవంతో పాటు 19 నుండి 26 వరకూ న్యూయార్క్‌లో జరగనున్న మరియు ఇతరకమ్యూనిటీ వర్క్ ‌షాప్స్, ‌చర్చా కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి) వారు కోరారు. వారి ఆహ్వానంలో ‘‘మేము డెక్కన్‌ ‌డెవలప్మెంట్‌ ‌సొసైటీ సాధించిన ఘనకార్యాలు వ్యక్తిగతంగా అభినందించాలి. మీ రాకకోసం ఎదురుచూస్తున్నాం. మీ ప్రయాణ ఖర్చులు, వసతి ఏర్పాట్ల బాధ్యత ఈక్వెటర్‌ ఇనిషియేటివ్‌ ‌తీసుకుంటుంది’’ అని స్పష్టంగా చెప్పారు. అందుకనుగుణంగా ఏర్పాట్లన్నీ చేసుకున్నప్పటికీ డెక్కన్‌ ‌డెవెలప్మెంట్‌ ‌సొసైటీకి చెందిన గ్రామీణ మహిళా రైతులు వెళ్లి అందుకోలేని పరిస్థితి. కారణం వీసా తిరస్కరణకు గురవ్వడమే.
స్థానిక వనరులతో ప్రకృతి సిద్ధమైన పరిష్కారాలతో పర్యావరణాన్ని కాపాడుతూ, వారి ఆరోగ్యాన్నే కాక భూమి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ అభివృద్ధి సాధించడంలో అసాధారణ ఉదాహరణగా నిలిచినందుకు చేసిన కృషికి దక్కన్‌ ‌డెవలప్మెంట్‌ ‌సొసైటీ మహిళలకు ఈ పురస్కారం అందజేస్తున్నామని ఐక్యరాజ్యసమితి జూన్‌ 5‌న ప్రకటించింది. ఈ క్రమంలో న్యూయార్క్ ‌నుండి ఇద్దరు సభ్యుల బృందం డెక్కన్‌ ‌డెవలప్మెంట్‌ ‌సొసైటీకి వచ్చి 15 రోజులుండి ఇక్కడి గ్రామాలలో చేస్తున్న కార్యక్రమాలను సూక్ష్మ స్థాయిలో పరిశీలించి అంతా వీడియో చిత్రీకరించుకొని వెళ్ళింది. ముప్పై సంవత్సరాలకు పైగా ఈ మహిళలు చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చిందని సభ్యులంతా సంబురాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా అవార్డు అందుకోవడానికి అనసూయమ్మ, మొగులమ్మ, మయూరిలతో కూడిన ముగ్గురు సభ్యులను డెక్కన్‌ ‌డెవలప్మెంట్‌ ‌సొసైటీ ఎంపిక చేసింది. ఆ ముగ్గురూ తమ ప్రయాణానికి అవసరమైన పాస్పోర్ట్, ‌వీసా వంటి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్‌ 10‌వ తేదీ ఫింగర్‌ ‌ప్రింట్స్ అయ్యాయి. 11వ తేదీ ఉదయం వీసా ఇంటర్వ్యూకి వెళ్లారు. మీ పేరేమిటి, మీరేం చేస్తారు, ఎందుకు వెళ్తున్నారు అనే మూడు ప్రశ్నలు తప్ప మరో ప్రశ్నవేయకుండా మీ దరఖాస్తును తిరస్కరిస్తున్నామని అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌చెప్పింది. అమెరికా వీసా విధానాలు ఏమిటో, ఎందుకు తిరస్కరిస్తున్నారో ఈ గ్రామీణ మహిళలకు తెలియదు. వారికి తెలిసిందల్లా తమకు అమెరికా వెళ్ళడానికి అనుమతించే వీసా రాలేదనే. ఈ సందర్భంగా వారి మనో భావాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
జయశ్రీ చెరుకూరి, అసోసియేట్‌ ‌డైరెక్టర్‌
‌సంస్థ తరపున అమెరికన్‌ ‌వీసా ఉన్న మీరెవరయినా ఆ అవార్డు అందుకోవచ్చు కదా అన్నప్పుడు ‘‘ఈ అవార్డు వచ్చింది మాకు కాదు. కమ్యూనిటీకి. వాళ్ళు గత ముప్పై ఏళ్లుగా చేస్తున్న కృషికి. కాబట్టి అది అందుకోవలసింది వాళ్ళు… ఆ గౌరవం దక్కాల్సింది వాళ్ళకే. వాళ్ళకి వీసా ఇవ్వనప్పుడు మేం వెళ్లడం అనవసరం. ఆ విషయమే ఐక్యరాజ్యసమితి ప్రతినిధులకు తెలియజేసాం. సమయం చాలా తక్కువగా ఉంది.
అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన ఈక్వెటర్‌ ‌పురస్కారం పొందిన తమకి వీసా తిరస్కరణను అవమానంగా భావిస్తున్న ఆ మహిళలు అది తమకే కాదు తమను ఆహ్వానించిన ఐక్యరాజ్యసమితికి కూడా అవమానమే అంటున్నారు. మన సౌలభ్యం కోసం ఏర్పరచుకున్న విధులు, విధానాలు ఒక్కోసారి ముందుకు పోయేదారికి అడ్డుతగిలి తలకు బొప్పి కట్టిస్తాయంటే ఇదేనేమో .?! రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ప్రతిష్ట తెచ్చిన ఈ అవార్డు అందుకునే అద్భుతమైన, అసాధారణమైన ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోకుండా అనసూయమ్మ, మొగులమ్మ, మయూరిలకు తెలంగాణ ప్రభుత్వం చేయందించి వీసా ఏర్పాట్లకు కృషి చేస్తే బాగుంటుంది.
వి. శాంతి ప్రబోధ, హైదరాబాద్‌