Take a fresh look at your lifestyle.

భాగ్యలక్ష్మీ టెంపుల్‌ ‌వద్ద ప్రారంభమై… హుస్నాబాద్‌లో ముగింపు

నేటితో ముగియనున్న బిజెపి చీఫ్‌ ‌బండి ప్రజా సంగ్రామ యాత్ర
భారీ రోడ్‌షో, బహిరంగ సభ
యాత్ర సక్సెస్‌తో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి బిజెపి చీఫ్‌, ‌కరీంనగర్‌ ‌పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర శనివారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ముగియనున్నది. ఆగస్టు నెల 28న హైదరాబాద్‌లోని పాతబస్తీలో గల శ్రీ భాగ్యలక్ష్మీ టెంపుల్‌ ‌వద్ద ప్రారంభమైన బండి తొలిదశ పాదయాత్ర 36 రోజుల పాటు కొనసాగింది. అక్టోబర్‌ 2‌న గాంధీ జయంతిని పురస్కరించుకుని హుస్నాబాద్‌లో బండి ముగింపు పాదయాత్రను పురస్కరించుకుని భారీ రోడ్‌షో, బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభకు సంబంధించి దాదాపుగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ ముగింపు సభకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే, బండి తొలిదశ పాదయాత్రలో 35 సభలు నిర్వహించి..438కిలో మీటర్లు కొనసాగింది. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను వింటూనే…ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు,  కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల వివరాలను సభల్లో ప్రజలకు వివరించారు బండి. హైదరాబాద్‌, ‌రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, మెదక్‌, ‌కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలు కవర్‌ అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే.. చార్మినార్‌, ‌గోషామహల్‌, ‌నాంపల్లి, ఖైరతాబాద్‌, ‌జూబ్లిహిల్స్, ‌కార్వాన్‌, ‌రాజేంద్రనగర్‌, ‌చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, ఆందోల్‌, ‌నర్సాపూర్‌, ‌మెదక్‌, ఎల్లారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, మానకొండూర్‌, ‌హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నడిచారు. ఎంపీ సెగ్మెంట్ల విషయానికొస్తే…హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌చేవెళ్ల, మెదక్‌, ‌జహీరాబాద్‌, ‌కరీంనగర్‌ ‌నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఈ యాత్రలో భాగంగా బండి ప్రజల నుంచి వినతుల రూపంలో 11వేల 675పత్రాలను తీసుకుని లక్షలాది మంది ప్రజలను కలుసుకున్నారు. వారి బాధలు విన్నారు. అంతేకాకుండా, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ  ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి తీవ్రమైన వ్యతిరేకత ఉందో స్వయంగా తెలుసుకోగలిగారనీ బిజెపి శ్రేణులు శుక్రవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయ.

రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, కార్మికులుసహా దాదాపు అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి  చేయాలని కోరుతూ ఇప్పటి వరకు 11,675 వినతి పత్రాలను అందజేశారు. అందరి సమస్యలు వింటూ వారికి భరోసానిస్తూ టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరును ఎండగడుతూ బండి సంజయ్‌  ‌పాదయాత్ర కొనసాగింది.  ఈ పాదయాత్ర ద్వారా లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదాన్ని పొందారు. ఎక్కడికి వెళ్లినా మహిళల మంగళహారతులు, బోనాలతో స్వాగతం పలికారు. బండి యాత్రలో ఇద్దరు మాజీ సిఎంలు, 6గురు కేంద్ర మంత్రులతో సహా 24మంది జాతీయ నాయకులు పాల్గొని ప్రసంగించారు.

ఈ పాదయాత్రలో అన్నార్తులు, అభాగ్యులు, బాధితులు, నిరుద్యోగులకు అండగా బిజెపి చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ కార్యక్రమాన్ని అద్భుతంగా ఆదరించి ఆశీస్సులు అందించి విజయవంతం చేసినందుకు  రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరునా బిజెపి శాఖ వందనాలు తెలియజేస్తుందనీ పార్టీ నాయకులు తెలిపారు. బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌తొలిదశ పాదయాత్ర ద్వారా 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్‌ ‌నియోజకవర్గాల్లో నడుస్తూ ప్రజలను కలుసుకున్నారు. మొత్తం 8 జిల్లాల్లో తొలిదశ పాదయాత్ర చేశారు. ఇదిలా ఉంటే, బండి తొలిదశ పాదయాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్‌లో నిర్వహించే రోడ్‌షో; బహిరంగ సభకు లక్షలాది మంది హాజరై విజయవంతం చేయాలని బిజెపి నాయకులు పిలుపునిచ్చారు. సభ సక్సెస్‌కు బిజెపి శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసింది.

Leave a Reply