Take a fresh look at your lifestyle.

భవిష్యత్‌ ‌తరాలని బలిపెట్టే అణు ఇంధన శక్తి

అణువిద్యుత్‌ ‌తయారీ తరువాత వచ్చే స్పెంట్‌ ‌ఫ్యూయల్‌ (‌వ్యర్థ ఇంధనం) నిర్వహణ అత్యంత జాగ్రతతో చేయాల్సిన పని. దానికోసం అయ్యే లక్షలాదికోట్ల రూపాయల ఖర్చును కూడా కలుపుకుంటే అణు విద్యుత్‌ అనేది ఎంత ఖరీదయినదో నిర్ధారణ అవుతుంది. వాటిని పర్యావరణం నుండి కొన్ని వేల ఏళ్ల పాటు దూరంగా వుంచాలి. మనలాంటి దేశాలకు అది సాధ్యమయ్యే వ్యవహారమేనా? వీటిని చర్చించాల్సిన అవసరం లేదా? ప్రజలకు వీటితో ఏ రకమైన సంబంధం లేదా? మా భవిష్యత్తుని బలిపెట్టే నిర్ణయాలను మీరెలా తీసుకుంటారని ప్రశ్నించే భవిష్యత్‌ ‌తరాలకు సమాధానం ఎవరు ఇవ్వాలి?ఒక పక్క నల్లమల అడవిలో యురేనియం అన్వేషణ చేపట్టబోతున్నారన్న వార్తే అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తుం డగానే, పదిహేనేళ్ళ క్రితం ప్రజల వ్యతిరేకతతో ముగిసిపోయిందనుకున్న నల్లగొండ యురేనియం తవ్వకాల అంశం మళ్లీ తెరమీదకు వస్తోంది. తీవ్ర స్థాయిలో ప్రజల వ్యతిరేకతను చవి చూసినప్పటికీ యుసిఐఎల్‌ ‌గనుల తవ్వకం గురించి వున్న పర్యావరణ అనుమతుల గడువును ఏకపక్షంగా 2035 సంవత్సరం వరకూ తనంతట తానే పెంచుకుందని వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈ కంపెనీకి ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఎంత అవహేళన వుందో తేటతెల్లమయినట్లే! దానితో పాటు, అక్కడ శుద్ధి కర్మాగార ఏర్పాటుకి కూడా దేవరకొండ మండలం శేరుపల్లి గ్రామంలో 2006లో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ప్రతివక్కరూ వ్యతిరేకత తెలిపారు. మరి ఇప్పుడు శుద్ధి కర్మాగారానికి అక్కడ అనుమతులు లేకుండా మైనింగ్‌ ఎలా చేస్తారు? అంటే శుద్ధి కర్మాగారం ఏర్పాట్లకు చాపకింది నీరులా ప్రయత్నాలు చేస్తూనే వున్నారా?
మన దేశంలో అణుపరిశ్రమ మొదలైనప్పటి నుంచీ వస్తున్న వాదనల్లో ఎప్పుడూ ఒకటే వినిపిస్తుంది. పర్యావరణాన్ని రక్షించటానికి అణువిజ్ఞానమే మనకు అత్యంత అవసరమనీ, ఇప్పుడు శక్తిని ఉత్పత్తి చేస్తున్న వనరులన్నీ అయిపోవచ్చాయనీ, మనకు ఇంక ఇది తప్ప గత్యంతరం లేదనీ చెబుతూ ప్రజలను నమ్మించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ఖర్చు పెడుతున్న డబ్బు కూడా తక్కువేమీ కాదు. ఏ వనరులు అయిపోవస్తున్నాయని చెబుతున్నారో ఆ వనరులనే ఈ అణుశక్తి తయారీలో పెద్ద ఎత్తున ఉపయోగిస్తామని మాత్రం ఎక్కడా చెప్పరు. యురేనియం తవ్వితీయటం దగ్గర నుంచీ, దాన్ని శుద్ధి చేయటానికి జరిగే రవాణా, తిరిగి దానిని అవసరమైన కడ్డీలు(యురేనియం-235)గా మార్చటం కోసం న్యుక్లియర్‌ ‌ఫ్యూయల్‌ ‌కాంప్లెక్స్‌ల వరకూ వెళ్ళటం, అక్కడ జరిగే ప్రక్రియలు, రియాక్టర్లు, విద్యుత్‌ ‌కేంద్రాల నిర్మాణం, అక్కడి పని ఇలా అనేక దశలలో ఇంధనశక్తి వాడకం భారీ స్థాయిలో వుంటుంది. దీనినిబట్టి అర్థమయ్యేదేమిటంటే అణువిద్యుత్తు కాలుష్య కారకాలు లేకుండా ఉత్పత్తి కాదు.
ప్రకృతి సహజంగా లభించే సూర్యరశ్మి, గాలి, నీరు వంటి వాటితో ప్రత్యామ్నాయ విద్యుత్‌ అవసరాలను పెంపొందించటానికి ఎలాంటి అవకాశాలు వున్నాయో, వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో ఎక్కడా మాట్లాడరు. వాణిజ్యపరంగా అవసరానికి మించి విద్యుత్‌ ఎక్కువ వినియోగం అవుతున్న చోట, వాటిని తగ్గించే చర్యల గురించి ఎక్కడా ఊసు వుండదు. ఇదంతా ప్రజలకు సంబంధంలేని, అర్థం కాని సాంకేతిక బూచిగా చూపిస్తారు.అణువిద్యుత్తు చాలా చౌక అని వస్తున్న వాదనలు కూడా పూర్తిగా అసత్యాలని మనకు అంతర్జాతీయ అనుభవాలు తెలియజేస్తున్నాయి. మనకంటే అభివృద్ధిలో ముందున్న బ్రిటన్‌, ‌ఫ్రాన్స్, అమెరికా, జపాన్‌ ‌లాంటివి అణు విద్యుత్‌ ‌తయారీ భారాన్ని, వాటిలో జరిగే ప్రమాదాలను నివారించలేమనే నిర్ణయానికి వచ్చి, వాటిని ఎలా మూసేయాలనే వైపుగా అడుగులు వేస్తున్నాయి. ఇవే కాకుండా అణువిద్యుత్‌ను తయారు చేస్తున్న ఇతర దేశాల అనుభవాలు కూడా ఉత్పత్తికి, ఖర్చుకు ఎక్కడా పొంతన లేకపోవటమే కాక రెట్టింపు భారం అవుతోందని తెలియజేస్తున్నాయి. ఇందులో వున్న మరో తలనెప్పి ఏమిటంటే ఈ అణువిద్యుత్‌ ‌కేంద్రాల మూసివేతకు కూడా అప్పటి వరకూ ఖర్చు పెట్టినదానికి రెండింతలు ఖర్చు పెట్టాల్సి రావటం. కొన్ని దేశాల్లో అయితే, ఈ అణుఇంధన ఖర్చుతో దేశ ఆర్ధిక వ్యవస్థే కుదేలయిపోయే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
వీటన్నితోపాటు అణువిద్యుత్‌ ‌తయారీ క్రమం నుంచీ ఉత్పత్తి వరకూ బయటకు వచ్చే అణుధార్మిక వ్యర్థాల వల్ల జరిగే కాలుష్యం ఎంత బీభత్సంగా వుంటుందో మన కళ్లెదుటే జాదూగూడ, తుమ్మలపల్లి అనుభవాలు తెలియజేస్తున్నాయి.
1950 కంటే ముందుగానే అమెరికాలోని మూలవాసులైన నవాజో ఆదివాసీలుండే చోట పెద్ద ఎత్తున యురేనియం గనుల తవ్వకం మొదలైంది. ఈ ప్రాంతంలోనే రెండవ ప్రపంచ యుద్దానికంటే ముందు ఆటంబాంబు పని సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ గనుల వల్ల వచ్చే ఏ రకమైన ప్రమాదాలను కూడా వారికి చెప్పకుండా దశాబ్దాల పాటు గనులు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ నివసించే ఆదివాసీలను తమ భూములనుంచి తరలించారు. ఒకప్పుడు సార్వభౌమత్వంతో విలసిల్లిన ప్రాంతాలు ఇప్పుడు వదిలేసినా యురేనియం గనులుగా మారాయి. అవి కాలుష్యాలను వదులుతూ అక్కడ నివసిస్తున్న ప్రజలకు ప్రాణాంతకంగా మారాయి. మనకంటే అక్కడ చట్టాలు ఎంతో పకడ్బందీగా వుంటాయి. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశుభ్ర గాలి, రక్షిత తాగునీరు, రేడియో ధార్మిక నష్ట పరిహార చట్టాలు అమలులో వున్నప్పటికీ అణుధార్మికత విషయంలో వాటి పనితీరు నిస్సహాయంగానే మిగిలింది. దాదాపు నలభై సంవత్సరాల నుంచీ అణు ధార్మికతకు లోనైన భూగర్భజలాలను శుద్ధిచేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ మాత్రం ఫలితం వుండటం లేదు.
విద్యుత్‌ ‌కేంద్రాలలో ప్రమాదాలు ఎంత ఘోరమైన అనుభవాలను చూపిస్తాయో అమెరికాలోని త్రీమైల్‌ ఐలాండ్‌, ఉ‌క్రెయిన్‌లోని చెర్నోబిల్‌, ‌జపాన్‌లోని ఫుకుషిమ అనుభవాలు కళ్ళముందు కనిపిస్తూనే వున్నాయి. అణుధార్మిక వ్యర్థాల జీవితకాలం కొన్ని వందల కోట్ల సంవత్సరాలు వుంటుందని తెలిసిన తర్వాత కూడా ఆ వైపుగా ప్రభుత్వాలు ప్రయాణించటం అంటేనే వీటి వెనుక చెప్పకూడని వేరే రాజకీయ కోణాలు వున్నాయని అర్థం.
ఇక్కడ ప్రమాదం తర్వాత చెర్నోబిల్‌ అనుభవాన్ని చూద్దాం : 1986 ఏప్రిల్‌ 26, ‌శనివారం, తెల్లవారుజాము 1:23 గంటలు. ఉక్రేయిన్లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్‌ ‌కేంద్రంలోని నాలుగవ రియాక్టర్లో ఏదో జరగరానిది జరిగింది. ఒక్కసారిగా రియాక్టర్‌ ‌పేలిపోయింది. మంటలు ఎగిసిపడ్డాయి. అణుధార్మిక శక్తి ఎగిరిపడి వెయ్యిమీటర్ల విస్తీర్ణంలో వాతావరణంలో కలిసిపోయింది. ఆ మంటల్ని అదుపు చేయటానికి వేల టన్నుల సీసాన్ని, రాళ్ళని విమానాల ద్వారా కుమ్మరించారు. ప్రజల్ని హుటాహుటిన అక్కడి నుంచి తరలించడం మొదలుపెట్టారు. నీళ్లు తాగటానికి వీల్లేదని, బట్టలు బయట ఆరేయవద్దని, అయోడిన్‌ ‌టాబ్లెట్లు తీసుకోవాలని చెప్పారు. అణువిద్యుత్‌ ‌రియాక్టర్ని దట్టమైన కాంక్రీట్‌ ‌దిమ్మలతో పూడ్చేశారు. విద్యుత్‌ ‌కేంద్రం చుట్టూ ముప్ఫై కిలోమీటర్ల విస్తీర్ణంలో నిషేధాజ్ఞలు విధించారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎప్పటికీ ఎవ్వరూ నివసించడానికి లేదని ప్రకటించారు.
అణుధార్మికత వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు సజీవ ఉదాహరణ మనకు జాదూగూడ. అక్కడ జరిపిన యురేనియం తవ్వకాలతో స్థానిక ఆదీవాసీ పిల్లలు అనేక దుర్భరమైన శారీరిక మానసిక వైకల్యాలు ఎదుర్కొంటున్నారు. యురేనియం కలిగిన ఖనిజ పదార్ధాలు గాలిలో, నీటిలో మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలతో కలవటం వల్ల, అవి శరీర కణాల్లో విభజనకు దారితీస్తాయి. జన్యుసంకేతాల్ని చెడగొట్టి అనేకరకాల క్యాన్సర్లకు, ఊపిరితిత్తుల సమస్యలకు, ట్యూమర్లకు, వంధ్యత్వానికి కారణమవుతుంది.
అణువిద్యుత్‌ ‌తయారీ తరువాత వచ్చే స్పెంట్‌ ‌ఫ్యూయల్‌ (‌వ్యర్థ ఇంధనం) నిర్వహణ అత్యంత జాగ్రతతో చేయాల్సిన పని. దానికోసం అయ్యే లక్షలాదికోట్ల రూపాయల ఖర్చును కూడా కలుపుకుంటే అణు విద్యుత్‌ అనేది ఎంత ఖరీదయినదో నిర్ధారణ అవుతుంది. వాటిని పర్యావరణం నుండి కొన్ని వేల ఏళ్ల పాటు దూరంగా వుంచాలి. మనలాంటి దేశాలకు అది సాధ్యమయ్యే వ్యవహారమేనా? వీటిని చర్చించాల్సిన అవసరం లేదా? ప్రజలకు వీటితో ఏ రకమైన సంబంధం లేదా? మా భవిష్యత్తుని బలిపెట్టే నిర్ణయాలను మీరెలా తీసుకుంటారని ప్రశ్నించే భవిష్యత్‌ ‌తరాలకు సమాధానం ఎవరు ఇవ్వాలి?

కె.సజయ,
సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy