Take a fresh look at your lifestyle.

బెంగాల్లో వ్యాక్సిన్‌ ‌తీసుకున్న ఇద్దరు మృతి

దేశవ్యాప్తంగా కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌ ‌వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం వైద్యసిబ్బంది,పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, 45 ఏండ్లు దాటిన దీర్ఘకాలిక రోగులకు టీకాలు వేస్తున్నారు. ఈ టీకాలు తీసుకున్న తర్వాత అక్కడక్కడ కొంతమంది మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో హృదయసంబంధ రోగాలతో బాధపడుతున్న ఇద్దరు వృద్ధులు కోవిడ్‌ ‌టీకా తీసుకున్న కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోయారు. డార్జిలింగ్‌కు చెందిన పారుల్‌ ‌దత్తా (75) అనే వృద్ధురాలు ఈ నెల 8 న మధ్యాహ్నం 3.30 గంటలకు కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌ ‌తీసుకుంది. అనంతరం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికివెళ్లింది. సాయంత్రం ఆరు గంటలకల్లా ఆమెకు వాంతులు మొదలయ్యాయి. ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఖారిబారి బ్లాక్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అటునుంచి నార్త్ ‌బెంగాల్‌ ‌మెడికల్‌ ‌కాలేజీ హాస్పిటల్‌ ‌కి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9.30 గంటలకు వృద్ధురాలు మృతిచెందింది. గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవడం ద్వారా ఆమె మృతి చెందారని పోస్టుమార్టం నివేదికలో తేలింది. మరో ఘటనలో జల్పారుగురి జిల్లా ధూప్‌గురికి చెందిన క్రిష్ట దత్తా (65) అనే వృద్ధుడు కూడా ఈ నెల 8 న ఉదయం 10.50 గంటలకు కొవిషీల్డ్ ‌వ్యాక్సిన్‌ ‌తీసుకున్నాడు. వ్యాక్సిన్‌ ‌తీసుకున్న తర్వాత ఎలాంటి అవలక్షణాలు లేకుండా సజావుగానే ఇంటికి చేరుకున్న వృద్ధుడికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో వాంతులయ్యాయి. ఆ తర్వాత బాగానే ఉండటంతో ఎప్పటిలాగే ఆ రాత్రికి నిద్ర పోయాడు.

కానీ తెల్లవారుజామున 5 గంటలకు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి విలవిల్లాడుతూ అరగంట వ్యవధిలోనే ప్రాణాలు విడిచాడు. రెండు కేసుల్లోనూ బాధితులు కొంతకాలంగా హృదయ సంబంధ రోగాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. పారుల్‌ ‌దత్తా కొన్నిరోజులుగా హృద్రోగానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారని, క్రిష్ణదత్తా ఐదేండ్లుగా హై బిపితో బాధపడుతు న్నాడని చెప్పారు. టీకా తీసుకున్న అనంతరం వారు మృతి చెందడానికి కచ్చితంగా టీకానే కారణమా..? వారి అనారోగ్యాలే కారణమా..? అనే దానిపై దర్యాప్తు జరుగుతుందని, ఆ దర్యాప్తు లో అసలు వాస్తవాలు తెలుస్తాయని పశ్చిమ బెంగాల్‌ ఆరోగ్య సేవల డైరెక్టర్‌ అజరు చక్రవర్తి పేర్కొన్నారు.

Leave a Reply