- మహిళా దినోత్సవాన మహిళకు అవమానం
- కెసిఆర్‌ను ఎదుర్కునలేకే కవితకు నోటీసులు
- దిల్లీ ధర్నాను భగ్నం చేసేందుకే ఎత్తులు
- కవితకు ఇడి నోటీసులపై భగ్గుమన్న మంత్రులు, బిర్‌ఎస్ నేతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8 : ఎమ్మెల్సీ కవితకు ఇడి నోటీసులపై బిఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజుకావాలనే నోటీసులు ఇచ్చారని విమర్శించారు. కెసిఆర్‌తో తమకు ముప్పు తప్పదనే బిజెపి ఇలా డ్రామాలకు తెరతీసిందన్నారు. కవితకు నోటీసులు ఇస్తారని, అరెస్ట్ చేస్తారని బిజెపి నేతలకు ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌ను ఎదుర్కునే ధైర్యం లేక ఇలా వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కవిత దిల్లీలో ధర్నాకు దిగడంతో వణుకుతో ముందే నోటీసులు ఇచ్చారని మంత్రులు, నేతలు విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై కుట్రలో భాగమే కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత ధోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. సూర్యాపేటలో తన నివాసంలో మంత్రి జగదీశ్ రెడ్డి వి•డియాతో మాట్లాడారు. కవితకు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. ప్రజల కోసం పని చేసే నేతలకు కేసులు, జైళ్లు కొత్త కాదన్నారు. నియంతలు నిలబడిన చరిత్ర ఏనాడూ లేదన్నారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజా క్షేత్రంలో బట్టబయలు చేస్తామని వెల్లడించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఢిల్లీలో ఆప్ ఇక్కడ బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే కుట్రలో భాగగానే నోటీలు, అరెస్టులని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తున్నదని, ఇలాంటి పప్పులు సీఎం కెసిఆర్ ముందు ఉడకవని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ను నిలువరించ గలం అనుకుంటున్న వారిది మూర్ఖత్వమేనని స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం రోజే కవితకు నోటీసులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం కక్ష పూరిత ధోరణిని తెలియజేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
కేంద్రం విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొగందీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై మరింతగా పోరాడుతామని స్పష్టం చేశారు. కవితకు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వదుర్మార్గాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. మోదీ దురాగతాలను బయటపెడుతున్న కేసీఆర్ పై కుట్రలో భాగమే కవితకు నోటీసులు అని అన్నారు. అణచివేత దోరణితోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్యలు చేశారు. కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యే అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందన్నారు. కేంద్ర విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులతో లొంగదీసుకోవాలని చూస్తున్నారని చెప్పారు. కేంద్రం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా భయపడం..మరింతగా పోరాడుతామని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
ఇలాంటి కక్షపూరిత చర్యలు బీజేపీ పతనానికి నాంది అని మంత్రి పేర్కొన్నారు. దేశమంతా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే ఒక మహిళ పట్ల ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఆమె మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత దిల్లీలో ఆందోళనకు సిద్ధమవడంతో బీజేపీకి భయం పట్టుకుంది. మహిళలంతా తిరుగుబాటు చేస్తారనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఈడీ బోడిలను అడ్డుపెట్టుకుని ఎన్ని వేషాలు వేసినా భయపడేదే లేదు అని సత్యవతి రాథోడ్ తేల్చిచెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడంలో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విమర్శించారు.
జాగృతి ద్వారా తెలంగాణ ప్రజలను చైత్యవంతులను చేసిన కవిత ఇప్పుడు దేశ ప్రజలను జాగృతి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటే అడ్డుకోవడానికి కేంద్రం ఈడీ ద్వారా నోటీస్ ఇప్పించింది అని క్రాంతి కిరణ్ ఆరోపించారు. ఈడీ నోటీసులతో కవితను బెదిరించినా, వేధింపులకు గురి చేసినా ఆమె ప్రజాక్షేత్రాన్ని వదలరని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అదానీకి లక్షల కోట్ల లబ్ది చేకూర్చుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న మోదీకి, అమిత్ షాకు ఈడీ, సీబీఐ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వాన్ని, మరోవైపు కవితను టార్గెట్ చేస్తుంటే తెలంగాణ ప్రజలు సహించరు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి తగి బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే కాంత్రి స్పష్టం చేశారు.