వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బిజెపిలో చేరిన రేవూరి ప్రకాష్‌రెడ్డి

September 4, 2019

-ఉమ్మడి జిల్లాలో టిడిపికి నేతలు కరువు
-ఆందోళనలో కార్యకర్తలు: రేవూరి

ఫోటో: న్యూఢిల్లీలో బిజెపి కార్యాలయంలో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డ సమక్షంలో బిజెపిలో చేరిన టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి. చిత్రంలో లక్ష్మణ్‌, ‌మురళీధరరావు, కిషన్‌రెడ్డి ఉన్నారు.

టిడిపి సీనియర్‌ ‌నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి బుధవారం బిజెపిలో చేరారు. గత కొంతకాలంగా ఆయన బిజెపిలో చేరుతాడని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తాను టిడిపిని వీడేది లేదంటూ పలుసార్లు రేవూరి స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో అనేకమంది నేతలు, చంద్రబాబునాడుకు అతి సన్నిహితుడైన గరికపాటి మోహన్‌రావు, పెద్దిరెడ్డి వంటి అగ్రనేతలు కూడా బిజెపిలో చేరడంతో రేవూరి కలత చెందారు. దీంతో ఆయన బిజెపిలో చేరడానికి సిద్ధమైపోయినట్లు తెలుస్తున్నది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో బిజెపి జాతీయ నేత నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ‌కె.లక్ష్మణ్‌, ‌జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఇతర బిజెపి నేతలు ప్రేమేందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, మార్తినేని ధర్మారావుల సమక్షంలో బిజెపిలోకి చేరారు. అనంతరం వారు ఆయనకు బిజెపి కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తన పాత్ర ఉన్నందుకు గర్విస్తున్నానన్నారు. పార్టీలకు, వర్గాలకు సంబంధం లేకుండా అనేకమంది తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నారని, ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో టిఆర్‌ఎస్‌ ‌పాలనలో ఆ లక్ష్యాలు నెరవేరలేదని వాపోయారు. ఆరేళ్ళు గడుస్తున్నా ఫలితాలు ప్రజల ముందు ఉంచడంలో కెసిఆర్‌ ‌విఫలమయ్యాడని, విభజించు పాలించు తరహా పాలన చేస్తూ కెసిఆర్‌ ‌కుటుంబం తెలంగాణ వనరులను దోచుకుతింటున్నారని ఆరోపించారు. కెసిఆర్‌ ‌తన

వాక్‌చాతుర్యంతో టిడిపిని ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేయగలిగాడని, కాంగ్రెస్‌ ‌రోజు రోజుకు దిగజారుతోందని, నాయకత్వలేమి కాంగ్రెస్‌ను వెంటాడుతోందని, తెలంగాణలో బిజెపి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. టిడిపి చంద్రబాబులపై నాకెలాంటి వ్యతిరేకత లేదని తెలిపారు. బంగారు తెలంగాణ అనే నినాదం మాటలకే పరిమితం అయ్యిందని, తెలంగాణకు అన్ని విధాలా న్యాయం చేసిన పార్టీ టిడిపియేనన్నారు. తెలంగాణ ప్రజలకు టిడిపిని కెసిఆర్‌ ‌దూరం చేయగలిగాడని, రాజకీయ పునరేకీకరణ కోసమే బిజెపిలో అంతర్భాగమయ్యానని తెలిపారు. చంద్రబాబే బిజెపిలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో టిడిపి నేతలు కరువు

సీనియర్‌ ‌నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి కూడా బిజెపిలో చేరడంతో ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో టిడిపికి నేతలు కరువయ్యారు. గత ఐదారు సంవత్సరాల నుంచి టిడిపి నేతలందరూ టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలో చేరుతున్నారు. దీంతో ఆ పార్టీలో తీవ్ర సంక్షోభం నెలకొన్నది. ఇప్పటి వరకు టిడిపిలో కీలకంగా ఉన్న రేవూరి ప్రకాష్‌రెడ్డి చివరకు బిజెపిలో చేరడంతో ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి ఇక నేతలే లేకుండా పోయారు. దీంతో గత మూడు దశాబ్దాలకు పైగా టిడిపిని నమ్ముకొని ఉన్న కార్యకర్తలందరూ ఆందోళన చెందుతున్నారు.