Take a fresh look at your lifestyle.

బాబు కనుసన్నల్లో ఆంధ్రప్రదేశ్‌ ‌బిజెపి?

ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అదుపాజ్ఞలలో రాష్ట్ర బిజెపి శాఖ పని చేస్తోందా అన్న అనుమానం కలుగుతున్నది. కారణం బీజేపీ సిద్ధాంతాల గురించి రాష్ట్ర నాయకులకు తెలియదు. కొంతమంది మేధావులు రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌)‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ బీజేపీ క్రియాశీల సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ సమావేశానికి హాజరయ్యేందుకు వీరు ఇటీవల నిరాకరించారు. ఇది ఇంక మా బీజేపీ ఎప్పటికీ కాదు, ఇది ఇప్పుడు చంద్రబాబునాయుడు బీజేపీ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సభ్యుడు అన్నారు. పార్టీతో చాలాకాలంగా విధేయులుగా ఉన్నా ఇతర సభ్యులు బీజేపీ రాష్ట్ర శాఖపై నారా చంద్రబాబునాయుడు పరోక్షంగా పెత్తనం చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత బీజేపీని రాష్ట్ర శాఖపై పట్టుకోసం చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. అంతకుముందు ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని ప్రచార సభల్లో తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు నాయుడు నేరుగా మోడీని కలుసుకునేందుకు బిడియ పడుతున్నారో, ఏమో తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు నలుగురిని బీజేపీలోకి పంపి ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో సామరస్య సాధన కోసం బాటలు వేసుకున్నారు. ఇది వ్యూహాత్మకంగా జరిగిందేనని పరిశీలకుల అభిప్రాయం. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సిఎం రమేష్‌, ‌టిజి వెంకటేష్‌, ‌జి మోహన్‌ ‌రావులు నలుగురూ చంద్రబాబునాయుడుకు అత్యంత ఆప్తులు, వారు తెలుగు దేశంలో ఉన్నప్పుడు చంద్రబాబుకూ, పార్టీకీ ఏ అవసరం వచ్చినా ఆగమేఘాలపై స్పందించేవారని ప్రతీతి. వీరు నలుగురూ పారిశ్రామిక వేత్తలు. వీరు కేవలం తమ వ్యాపార ప్రయోజనాల కోసమే బీజేపీలోకి ఫిరాయించారని తెలుగుదేశం క్షేత్ర స్థాయి నాయకులు ఆరోపించినా, చంద్రబాబు నాయడు కనుసైగలతోనే వారు పార్టీ ఫిరాయించారన్నది ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికైనా ఇట్టే అర్థం అవుతుంది. వీరు రెండు నెలల క్రితం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. అయినప్పటికీ, వీరు ఆంతర్గత వైరాల్లో చంద్రబాబునాయుడు వెంటే ఉంటున్నారు. వీరికి బీజేపీ సిద్ధాంతాల గురించి కనీస అవగాహన లేదు. అంతేకాక, వీరికి ప్రజా బలం లేదు. అయినప్పటికీ పార్టీలో పలుకుబడి గల నాయకులుగా చలామణి అవుతున్నారు. వారు వేదికలపై కూర్చుని పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్ళాలో ఆదేశాలు ఇస్తుంటారు. వీరికి పార్టీ కార్యకర్తలతో ఏమాత్రం సంబంధం లేదు. కొద్ది నెలల క్రితం వారిని వీరు విమర్శించారని ఉత్తరాంధ్రకి చెందిన పార్టీ నాయకుడు ఒకరు అన్నారు. ఆయన అసెంబ్లీకి పోటీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ‌లో బీజీపి ఏ విధంగా వ్యవహరిస్తోందో పరిశీలిస్తే కొత్తగా చేరిన నాయకులు చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారని ఎంతో కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న వారు అభిప్రాయ పడుతున్నారు. కొత్తగా బీజేపీలో చేరిన వారు అమరావతి. పోలవరం విషయాల్లో నాయుడును ఇంతవరకూ కనీసం పల్లెత్తు మాట అనలేదు. చంద్రబాబునాయుడు ప్రారంభించిన పనులు కొనసాగాలన్నదే తమ అభిప్రాయమన్నట్టుగా వీరి ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ఈ మధ్య ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పుడు బీజేపీలో చేరిన నాయకులు మళ్ళీ ఎన్నికల తర్వాత తెలుగుదేశంలో చేరుతారన్నది బహిరంగ రహస్యమని కృష్ణా జిల్లాకి చెందిన బీజేపీ నాయకుడు ఒకరు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ పటిష్టం కావడానికి తోడ్పడటానికి బదులు ఈ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు. చంద్రబాబునాయుడు సొంత మనుషులు బీజేపీలోకి చాపకింద నీరులా చేరిపోయారనీ, వచ్చే ఎన్నికల్లోగా రెండు పార్టీల మధ్య తిరిగి పొత్తు కోసం వీరు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారని రాజకీయవిశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీని రీమోట్‌ ‌కంట్రోల్‌ ‌చేయడం చంద్రబాబునాయుడుకు ఇది మొదటి సారి కాదు., చంద్రబాబునాయుడుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్నిహితుడు. ఆయన పార్టీ తరఫున నిర్ణయాలు తీసుకుని గతంలో చంద్రబాబునాయుడుకూ, టిడిపికీ తోడ్పడ్డారన్నది అందరికి తెలిసిన విషయమే.

– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy