Take a fresh look at your lifestyle.

బలం పుంజుకునేలా బిజెపి యత్నం

త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బలం పుంజుకోవాలని భారతీయ జనతాపార్టీ ప్రయత్నిస్తున్నది. ప్రధానంగా పట్టణాల్లో పట్టుసాధించడం ద్వారా వచ్చే శాసనసభ ఎన్నికలనాటికి ఎదురులేని శక్తిగా నిలువాకుంటున్నది. తెరాస ఆకర్ష్ ‌పథకం కింద ఇప్పటికే కారు ఓవర్‌లోడ్‌ అవడంతో రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఆశవహుల సంఖ్యకూడా పెద్దగానే ఉంది. అయితే అందరికి అవకాశాలు ఎలాగూ లభ్యంకావు కాబట్టి, అవకాశం కోల్పోతున్నవారు తమ రాజకీయ భవిష్యత్‌ ‌కోసం ఎదుటి పార్టీ వైపు చూసే అవకాశాలు లేకపోలేదు. అందులో బలమైన నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీని బలోపేతం చేసుకోవాలని బిజెపి ఆలోచిస్తున్నట్లు ఆ వర్గాలద్వారా తెలుస్తున్నది. మొదటి నుండి నగరాలకే పరిమితమైన పార్టీగా బిజెపికి పేరుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా నగరాలకు సంబంధించినవే కాబట్టి బిజెపికి ఏమాత్రం ఆవకాశం ఇవ్వకూడదని టిఆర్‌ఎస్‌ ‌కూడా ప్రతివ్యూహం రచిస్తున్నది. అందుకు రాష్ట్రంలోని వివిధ మున్సిపల్‌ ఎన్నికలతోపాటు గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలను కూడా సత్వరం జరుపాలని ఆలోచిస్తున్నది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంఐఎం తప్ప అన్ని సీట్లను తామే గెలుస్తామని ఢంకా బజాయించి చెప్పిన టిఆర్‌ఎస్‌కు నాలుగు స్థానాల్లో బిజెపి గెలవడం పెద్ద షాక్‌ ఇచ్చినట్లు అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్‌ ఎన్నికలను కూడా శాసనసభ ఎన్నికల మాదిరిగా ముందస్తుగా నిర్వహించే వ్యూహ రచన తెరాస సర్కార్‌ ‌చేస్తున్నట్లు అర్థమవుతున్నది. ఎవరూ ఊహించని విధంగా బిజెపి నాలుగు పార్లమెంటు స్థానాలు గెలిచినా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఆ పార్టీ క్యాడర్‌ ‌రాష్ట్రమంతా పటిష్టంగాలేదు. ప్రధానంగా రాష్ట్ర రాజధానిలో ఇప్పుడిప్పుడే ఆ పార్టీ పుంజుకుంటోంది. అయితే బిజెపి బలాన్ని పుంజుకునే అవకాశం ఇవ్వకుంగా గ్రేటర్‌ ఎన్నికలు కూడా మున్సిపల్‌ ఎన్నికలతో జరుపడం ద్వారా గతంలో లాగా భారీ సంఖ్యలో తమ అభ్యర్ధులను గెలిపించుకోవచ్చని తెరాస ప్రణాళిక రూపొందిస్తోంది. గ్రేటర్‌ ‌పరిధిలో ఎంపిగా గెలిచిన కిషన్‌రెడ్డికి కేంద్రంలో కీలక పద•వి లభించిన ప్రభావం తప్ప•• ఉంటుందన్నది టిఆర్‌ఎస్‌ ఆలోచనగా కనిపిస్తున్నది. అందుకే ఇంకా ఏడాదిన్నర సమయం పాలక వర్గానికి ఉన్నా శాసనసభలాగే ముందస్తుకు వెళ్ళాలనుకుంటున్నది టిఆర్‌ఎస్‌. 2015‌లో జరిగిన జిహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో 150 డివిజన్‌లకు గాను టిఆర్‌ఎస్‌ 99 ‌స్థానాలను గెలుచుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. నాటి మున్సిపల్‌ ‌శాఖమంత్రి కెటిఆర్‌ ‌వ్యూహం ఫలించింది. ఈసారి కూడా అంతే భారీ సంఖ్యలో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలంటే శాసనసభ ఎన్నికల సూత్రానికి పోకతప్పదని టిఆర్‌ఎస్‌ ‌భావిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఇతర పార్టీలు ముఖ్యంగా దూసుకువస్తున్న బిజెపి బలపడే వ్యవధిని ఇవ్వకుండా అవుతుందన్నది టిఆర్‌ఎస్‌ ఆలోచనగా తెలుస్తున్నది. అందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే సంకేతాలనిచ్చింది. ఇప్పటినుండే ప్రజలతో సంబంధాలను బాగా పెంచుకోవాలని కూడా ఆదేశించినట్లు తెలుస్తున్నది. ప్రధానంగా రాష్ట్ర రాజధానిలోని మంత్రులు అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు వెళ్ళాయి. జూలై చివరివారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్‌ ఎన్నికలు జరుగే అవకాశాలున్నాయి. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మున్సిపల్‌ ‌చట్టాన్ని తీసుకురావాలనుకుంటోంది. అందుకోసం ఈ నెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌మార్గదర్శకంలో రూపొందించిన ఈ బిల్లు శాసనసభ ఆమోదం పొందగానే ఎన్నికల నగారా మోగుతుందంటున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం సంబంధిత మునిసిపల్‌ ‌కమిషనర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు సమాయత్తం కావాలని సూచించింది. వీటన్నిటి దృష్ట్యా ఎన్నికలు త్వరగానే వస్తున్నాయన్నది అర్థమవుతున్నది. అందుకే తమ పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని కూడా ఈ నెల 20వ తేదీలోగా పూర్తిచేయాలని పార్టీ ఆదేశించింది. ఇదిలా ఉండగా సిట్టింగ్‌లకే మరో అవకాశం ఇవ్వాలని తెరాస ఆలోచిస్తుండగా, అవకాశాల కోసం ఆశతో ఇంతకాలం పార్టీని అంటిపెట్టుకున్న అసంతృప్తికి గురయ్యేవారిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా గ్రేటర్‌లో పట్టు సాధించాలని బిజెపి కాపుకాస్తున్నది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy