Take a fresh look at your lifestyle.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో….

నేటి నుంచి బతుకమ్మ పండుగ సంబురాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం
బతుకుసారాన్ని తెలియజేస్తూ సాగిపోయే బతుకమ్మ…
ఎంగిలిపూలతో మొదలు…
9వ రోజు సద్దులతో ముగింపు
ఒక్కేసి పువ్వేసి చందమామా..ఒక్క జాములాయే చందమామ..బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు గౌరమ్మ ఉయ్యాలో…అంటూ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతిని,సంప్రదాయాన్ని ప్రతిబింబించేది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడుచుల్లో లెక్కలేనంతగా సంతోషం. పట్టరాని ఆనందం. బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. వెలకట్టలేని ఆత్మీయత అల్లుకుని ఉంది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన ఆడపడుచులు అత్తారింటి నుంచి తల్లిగారి ఇంటికి వెయ్యి కళ్లతో ఎదురుచూసే పండుగ బతుకమ్మ పండుగ. అందరి ఆడవారిని ఒకచోట గుంపుగా చేర్చే పండుగ బతుకమ్మ. మారుతున్న నాగరికతను పుణికిపుచ్చుకుంటున్నా…అనాదిగా వస్తున్న వారసత్వ సంస్కృతి, సంప్రదాయాల్ని పండుగల్ని రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటున్నాం. అయితే, ప్రతి తెలంగాణ ఆడపడుచు ఆనందంగా ఎదురుచూసే పండుగ ఈ పండుగ. ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ మహిళలు అతి సంబురంగా, ఆడంబరంగా జరుపుకుంటారు. తరతరాల సజీవ సంస్కృతులకు ప్రతీకలు పండుగలు. సంప్రదాయాల పట్టుగొమ్మలు పల్లెలు. వీరు జరుపుకునే సంబురాలకు ఆచారాలు తప్ప ఆర్భాటాలుండవు. సంస్కృతిని వారు ఎంత మాత్రం విస్మరించరు. సంస్కారం వికటించరు. కుల, మత, వర్గ, ప్రాంతం, పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ కలిసి ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జరుపుకునే పండుగ ఇది. పడతులు తమ పసుపు కుంకుమను పది కాలాల పాటు పదిలపరచమని కోరుతూ కోలాటాలు వేసేదే బతుకమ్మ పండుగ. సంప్రదాయబద్దంగా ఆనందోత్సవాల మేళవింపుగా 9రోజుల పాటు బతుకమ్మ పండుగ కళాత్మకంగా జరగడం ప్రసిద్ధం. ఈ పండుగ ప్రతియేటా మహాలయ అమావాస్య మొదలుకుని మహానవమి వరకు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వేళల్లో సాయంత్రంగా కాగానే మహిళలంతా ‘తంగేడు’ పువ్వులతో పేర్చిన బతుకమ్మలను తీసుకుని ఒక దగ్గర గుమికూడి ఒకరిప్రక్కన ఒక్కరు నిలబడి గుండ్రంగా తిరుగుతూ ఈ ఆటను ఆడుతారు. వీరు పాడే పాటలు వినడానికి ఎంతో సొంపుగా ఉంటాయి. ఈ బతుకమ్మ పండుగ ఆచార వ్యవహారాలకు, కట్టుబాట్లకు అద్ధంపడుతుంది. 9రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే ఉత్సవాలు ఒక ఎత్తు కాగా చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగ మరో ఎత్తు. ఆఖరి రోజున అంటే సద్దుల బతుకమ్మ పండుగ రోజున మహిళలు పోటీపడి బతుకమ్మలను పేరుస్తారు. ఒకరి కంటే ఒకరు తమ బతుకమ్మ పెద్దగా ఉండాలంటే తమ బతుకమ్మనే పెద్దగా ఉండాలని పోటీపడి పేరుస్తారు. ఈ పెద్ద బతుకమ్మను పేర్చడంలో పలువురు మగవారి పాత్ర కూడా బాగానే ఉంటుంది. పెద్ద బతుకమ్మను పేర్చాలంటే మగవారి పాత్ర, వారి సహకారం తప్పదు. ఇదే రోజున బతుకమ్మను చెరువులో కలపడంతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. పురిటి బిబ్బ పురిటిలోనే చనిపోతుంటే ‘బతుకు అమ్మ’ అని పూలతో కొలిచి మహిళలందరూ ఆరోగ్యంతో జీవించాలన్న దీవనెలతో ప్రారంభమైన ఈ పండుగ తెలంగాణ మహిళా సమాజమంతా జరుపుకునే ఎంగిలి పూల బతుకమ్మ పండుగతో మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది.
నేటి నుంచి గ్రామీణుల బతుకమ్మ సంబురాలు..
బతుకునిచ్చేది బతుకమ్మ. కలిసి బతుమని చెప్పేదే బతుకమ్మ పండుగ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిచే ఈ బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ పల్లెలన్నీ పాటలతో మారుమ్రోగుతుంటాయి. శనివారం ఎంగిలి పూలతో ఈ బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్నది. 9రోజుల పాటు ఆటా, పాటలతో పల్లెలన్నీ కోలాహంగా కనిపించనున్నాయి. ఎన్ని కష్టాలున్నా ఈ బతుకమ్మ పండుగకు ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కుట్టించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలయితే తప్పకుండా ఈ పండుగకు కొత్త చీరలు తెచ్చుకుంటారు. గడిచిన ఏడాది పాటు పడ్డ కష్టాలన్నింటిని మరిచి మహిళలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగకు పల్లెలు ముస్తాబయ్యాయి. పల్లెలల్లోని ప్రధాన వీధులు, చావిడిల వద్ద వీధి దీపాలను ఏర్పాటు చేశారు. బతుకమ్మలను వేసే చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఏది ఏమైనా ఈ 9రోజుల పాటు బతుకమ్మ సంబురాలతో తెలంగాణ పల్లెలన్నీ కళకళలాడనున్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!