Take a fresh look at your lifestyle.

బంగారం ధరల పెరుగుదలకు కారణం?

రోజురోజుకు బంగారం, వెండి ధరలు  పెరుగుతున్నాయి. బుధవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39 వేల 780 రూపాయలు, 24 క్యారెట్లు బంగారం 42 వేల 630 ధరకు విక్రయం అయ్యింది. ఇక కిలో వెండి ధర రూ. 46,860కి చేరింది. వారం రోజుల్లోనే  బంగారం ధర 6 శాతం, వెండి  ధర 7.30 శాతం పెరిగింది. అలాగే నెలరోజుల్లో బంగారం 31.17 శాతం, వెండి ధర 26 శాతం పెరిగింది. బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ అని పై ధరలు స్పష్టం చేస్తున్నాయి.

బంగారం ధరలు పెరుగడానికి కారణాలు….
ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అమెరికా-చైనా వాణిజ్య యుద్దం, రూపాయి విలువ పతనం అవుతుండటం, సెంట్రల్‌ ‌బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తుండటం, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవడం వంటివి బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు. దీంతో అత్యవసరం అయితే తప్ప కొనుగోలుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.  అసలు బంగారం వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తున్నారు. చర్చిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి  ఆందోళనకరంగా ఉంది. దీంతో ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం కొనుగోలును పెట్టుబడికి ఒక మార్గంగా ప్రజలు ఎంచుకుంటున్నారు. చైనాలో దశాబ్దకాలంగా రెండంకెల కన్నా తక్కువగా వృద్ది ఉంటే ఈ రెండో త్రైమాసికంలో 6.2 శాతంగా ఉంది. గత 20 ఏళ్లలో ఇంత కనిష్ట పతనానికి ఆ దేశంలో ఆర్థిక వృద్ధి పడిపోవడం ఇదే మొదటిసారి. జపాన్‌లో ఎకానమీ గ్రోత్‌ ‌రేటు 1.5 శాతంగా ఉంటే అమెరికాలో 2.1 శాతంగా మాత్రమే ఉంది. అమెరికాలో గత ఏడాది జూలై నాటికి 3.1 శాతంగా వృద్ధి రేటు ఉండేది. ఇక ఆసియా దేశాల్లో పారిశ్రామిక ఉత్పత్తుల ద్వారా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించే జర్మనీ ఎకానమీ గ్రోత్‌ ‌రేటు 1.9 శాతానికి పడిపోవడం గమనార్హం.
ఈ మధ్య ప్రభుత్వాలు కూడా గోల్డ్ ‌బాండ్ల రూపంలో పెట్టుబడులను సమీకరిస్తున్నాయి. అమెరికా, జర్మనీ దేశాలు 10 ఏళ్ల వ్యవధి కలిగిన ట్రేడింగ్‌ ‌బాండ్లను జారీ చేస్తున్నాయి. అలాగే యూకే 10, 30 ఏళ్ల వ్యవధి బాండ్లను జారీ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం  అమరావతి బాండ్లను జారీ చేసిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌బాండ్ల రూపంలో నిధులను సమీకరించుకునే ప్రయత్నాన్ని కూడా చూశాం. షేర్‌ ‌మార్కెట్‌తో  పోల్చితే బాండ్లలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమే కాకుండా ఖచ్చితమైన ఆదాయం కూడా వస్తుంది. ఈ కారణంగా బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి కనుపరుస్తారు.
మరో వైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్‌ ‌బ్యాంకులు బంగారం పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. బంగారం ధరలు పెరుగుతుండటంతో పాత బంగారు ఆభరణాలు ఇచ్చి కొత్త బంగారు నగలు కొనే ఎక్షేంజ్‌ ‌పద్దతి ఇప్పుడు బాగా పెరిగింది. బడా జువెలర్‌ ‌సంస్థలు భారీ ప్రకటనలు కూడా ఇస్తున్నాయి.
బంగారంపై కేంద్రం బడ్జెట్‌లో భారీగా కస్టమ్స్ ‌సుంకాన్ని పెంచింది. బంగారం కొనుగోలు చేయటానికి ఆర్థికవేత్తలు డెడ్‌ ఇన్వెష్ట్‌మెంట్‌గా చెప్తుంటారు. అయినా సరే బంగారం బంగారమే. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలుకు మాత్రం బంగారం తప్పని సరి. అందుచేత ధర ఎంతయినా ..తక్కువ మొత్తంలో అయినా సరే బంగారం కొంటూ ఉంటాం. లేదంటే మన దగ్గర ఉన్న బంగారంతో కొత్తగా నగలు చేయిస్తుంటాం. ఈ రెండింటిలో దేన్నయినా ఎంచుకోవచ్చు. బంగారంపై పెట్టుబడి సురక్షితం అన్నది మరువకూడదు. ఆర్థిక స్థోమతను బట్టి బంగారం కొనుగోలు చేస్తే భవిష్యత్‌లో ధరలు బాగా పెరిగి నప్పుడు అయ్యో అప్పుడే కొని ఉంటే బాగుండేది అనుకో వాల్సి అవసరం రాదు.

వంగ మహేందర్‌ ‌రెడ్డి
జర్నలిస్ట్ – ‌వరంగల్‌
‌సెల్‌ :8096202751

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy