Take a fresh look at your lifestyle.

ప్రభంజనం

నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా…‌

హస్తినాపురా వీధులలో
అన్నదాత ఆక్రందన..
దృతరాష్ట్రుల పాలనలో
రైతన్నల అరణ్య రోదన..

‘స్వేచ్ఛావిపణి’ మాటున
‘బహుళ జాతి’ బానిసత్వం..
‘ఒప్పంద సాగు’ పేరుతో
‘కార్పొరేట్ల’ హస్తగతం..

అన్నం పెట్టే చెయ్యి
పిడికిలై బిగిసింది..
చెమటలు చిందే దేహం
ఎరుపురంగు పులుముకొంది..

మడిలో నడిచే పాదం
పోరుబాట పట్టింది..
బురద బట్టిన నేతల
నిగ్గదీయ కదిలింది..

ఏరువాక పాడే గళం
పోరు గానమెత్తింది..
ధిక్కార స్వరమై మోగి
దిక్కులన్నీ చుట్టింది..

మట్టి బిడ్డల కష్టానికి
జాతి తల్లడిల్లింది..
చేయి కలిపి ఊతమిచ్చి
మేము సైతం అంటూంది..

పదం కలిపి పోరు పథమై
కదం తొక్కి సాగింది..
కదనపథమున జతకూడి
ప్రభంజమై ఎగసింది..

నిప్పురవ్వయి వెలిగిన కణం
అగ్గిజ్వాలయి అలుముకుంది..
రక్కసి చట్టం అంతమొందగా
దవానలమై దహిస్తూంది..

నొసలు చిందిన స్వేదం
నుదుటి గీత గీస్తుంది..
శ్రమజీవుల చమట దేహం
దేశ చరితను రాస్తోంది..

– మధుర శ్రీ(మధుకర్‌ ‌రావు బోగెళ్లి)
హన్మకొండ. సెల్‌ : 8522000157

Leave a Reply