Take a fresh look at your lifestyle.

ప్రధాని మోడీ ప్రసంగం ఆద్యంతం.. టార్గెట్‌ ‌నారా లోకేష్‌..!

“‌లోకేష్‌ ‌ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు డీ- ఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి అమరావతిలో లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీలోనే కూర్చుంటున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధికార ప్రతినిధి బుద్ధా చంద్రశేఖర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రస్తుత పరిస్థితికి లోకేష్‌ ‌కారణమన్నది ప్రధానమంత్రి ఉద్దేశమో కాదో స్పష్టం కాలేదు. విశాఖలో మాజీ సైనికుల భూముల ఆక్రమణలతో సహా పలు కుంభకోణాలతో లోకేష్‌కు ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రమేయం ఉన్న కుంభకోణాలు చాలా తీవ్రమైనవి. ఇప్పుడు పేర్కొన్నవి కేవలం మచ్చుతునకలే ”
గత ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ ‌మంత్రి నారా లోకేష్‌ అరుదైన గౌరవాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేరు కన్నా, ఆయన కుమారుడు లోకేష్‌ ‌పేరును గుంటూరులో జరిగిన బీజేపీ ప్రజా చైతన్య సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్కువ సార్లు ప్రస్తావించారు. మోడీ తన వాగ్భాణాల లక్ష్యాన్ని మార్చుకున్న సంగతి ముఖ్యమైనదే కాదు, స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఢిల్లీలో రోజంతా దీక్ష చేసి మోడీపై నిప్పులు చెరిగారు. గుంటూరు సభలో మోడీ ప్రసంగం అంతా లోకేష్‌పైనే కేంద్రీకృతమైంది. సూర్యోదయ ఆంధ్రప్రదేశ్‌(‌సన్‌ ‌రైజ్‌ ఆం‌ధ్రప్రదేశ్‌) ‌కోసం తాను పాటుపడుతున్నట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవానికి ఆయన సన్‌(‌కుమారుని) కోసమే పాటుపడుతున్నారంటూ చలోక్తి విసిరారు. ఆ ఛలోక్తి నారా లోకేష్‌ను ఉద్దేశించేనని వేరే చెప్పనవసరంలేదు.
మోడీ ప్రసంగాన్ని విన్న వారికి ఆయన అలా లోకేష్‌ ‌పేరును పదే పదే ప్రస్తావించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చంద్రబాబు నాయుడు పేరెత్తాల్సినప్పుడల్లా లోకేష్‌కా పాపా అని ఆయన సంబోధించడం విడ్డూరంగా కనిపించింది. ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయని లోకేష్‌ ఎమ్మెల్సీ పదవి ద్వారా రెండేళ్ళ క్రితం మంత్రి అయ్యారు. దేశంలో అధికార పార్టీ అగ్రనాయకుడు, ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి కుమారుడ్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు? మోడీ వచ్చే నెలల్లో ఏం చెప్పదల్చుకున్నారో సంకేతమిచ్చారన్న మాట, బీజేపీ వచ్చే కొద్ది నెలల్లో లోకేష్‌నే లక్ష్యంగా చేసుకోనుంది.
లోకేష్‌ ‌ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు డీ- ఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి అమరావతిలో లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీలోనే కూర్చుంటున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధికార ప్రతినిధి బుద్ధా చంద్రశేఖర్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రస్తుత పరిస్థితికి లోకేష్‌ ‌కారణమన్నది ప్రధానమంత్రి ఉద్దేశమో కాదో స్పష్టం కాలేదు. విశాఖలో మాజీ సైనికుల భూముల ఆక్రమణలతో సహా పలు కుంభకోణాలతో లోకేష్‌కు ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రమేయం ఉన్న కుంభకోణాలు చాలా తీవ్రమైనవి. ఇప్పుడు పేర్కొన్నవి కేవలం మచ్చుతునకలే. లోకేష్‌ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. ఆయన రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. నిజం చెప్పాలంటే చంద్రబాబునాయుడు డమ్మీగా ఉన్నారు. ఆయన తన కుమారుణ్ణి రక్షిస్తున్నారని చంద్రశేఖర్‌ అన్నారు.
మోడీ గుంటూరు సభతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. చంద్రబాబునాయుడుకు, తెలుగుదేశం ప్రభుత్వానికీ వ్యతిరేకంగా మోడీ ఇంత బహిరంగంగా మాట్లాడటం ఇదే ప్రథమం. అమెరికాలో చదువుకుని వచ్చిన నారా లోకేష్‌ ‌మంత్రి కాక ముందు పార్టీ పటిష్ఠత కోసం కృషి చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం ఇది కొత్త కాదు. వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌, ‌జనసేన పార్టీల నాయకులు చంద్రబాబునాయుడు వారసుడు పాలనా వ్యవహార్లాలో జోక్యం చేసుకుంటున్నారని చాలా కాలంగా ఆరోపిస్తున్నారు.
కేవలం చంద్రబాబునాయుడు మీదే విమర్శలు చేస్తే ఆయన్నే బాధ్యుణ్ణి చేసినట్టు అవుతుందనీ, లోకేష్‌ ‌పైన కూడా ఆరోపణలను సంధించడం ద్వారా చంద్రబాబునాయుడు కుటుంబం అక్రమ పాలన గురించి జనానికి తెలియజేయడమే ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చునని బిజేపీ నాయకులు పేర్కొంటున్నారు. దీంతో చంద్రబాబు ప్రతిష్ఠ మరింత దెబ్బతినగలదని వారు అభిప్రాయ పడుతున్నారు. అదే రోజు సాయంత్రం చంద్రబాబునాయుడు మోడీపై విమర్శ చేస్తూ ఆయనకు(మోడీకి) కుటుంబం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ తెలుగుదేశం పార్టీ కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని వెచ్చించి ఢిల్లీలో సభ నిర్వహించడం వల్ల ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఏమైనా కలిసొస్తుందా? రాజకీయ విశ్లేషకుల నుంచి లేదు అని సమాధానం వస్తోంది.
సోమవారం రోజంతా ధర్మపోరాట దీక్ష జరిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న యూపీఏ ప్రభుత్వ వాగ్దానాన్ని అమలు జరుపుతామని మాటిచ్చిన మోడీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ చంద్రబాబునాయుడు ఆరోపించారు. చంద్రబాబునాయుడు ఢిల్లీలో నిర్వహించిన దీక్షకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ, ప్రాంతీయ పార్టీల నాయకులు ములాయం సింగ్‌ ‌యాదవ్‌, ‌ఫరూక్‌ అబ్దుల్లా ప్రభృతులు హాజరయ్యారు. వీరంతా బీజేపీ వ్యతిరేక మహాకూటమిలో భాగస్వాములు కానున్నారు. అందువల్ల ఇప్పుడు జరగనున్నది మోడీ వర్సెస్‌ ‌చంద్రబాబు పోరు. ఢిల్లీకి చెందిన సీనియర్‌ ‌రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు చంద్రబాబునాయుడు మోడీపై వ్యక్తిగతంగా దాడి చేయడం ప్రారంభించడం వల్ల తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. ప్రస్తుత వాతావరణంలో ప్రధానమంత్రి తిరిగి సమాధానం ఇవ్వకపోతే చంద్రబాబునాయుడు చేసిన ఆరోపణలు నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. బీజేపీ ముందు ప్రస్తుతం రెండు ప్రత్యామ్నాయాలున్నాయనీ, ప్రధానమంత్రి నేరుగా ఇప్పుడే ఈ ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించవచ్చనీ, లేదా తిరిగి అధికారంలోకి వచ్చే వరకూ ఆగవచ్చని పుల్లారావు అభిప్రాయ పడ్డారు.
మోడీకి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రారంభించిన పోరు ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని తెస్తుందని పుల్లారావు అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి బలం లేదు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినా పోయేదేమి లేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష ద్వారా చంద్రబాబు తన వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారనీ, మీరెందుకు(చంద్రబాబునాయుడు) విఫలమయ్యారో ప్రజలకు అవసరం లేదని మీరు ఒక నాయకునిగా విఫలమయ్యారా? విజయం సాధించారా..? అనేది చూస్తారని రావు అన్నారు.

– రాహుల్‌ ‌దేవులపల్లి
‘ద వీక్‌’ ‌సౌజన్యం•

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy