వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సన్నాసులెవ్వరు..?

August 13, 2019

నిజాలు జెప్తె సన్నాసు లెట్లయితరు ? గిదేనా దొర రాజీరికం ! గిట్లే వుంటాదుల్లా !? అనడిగటోళ్ళు సూత ఏం తక్కువ ..మాంచి కాక మీదున్నరు..వాళ్ళింకెక్కువ గుస్స జేత్తాండ్లు !…గీ లొల్లిల సన్నాసు లేవరు ? సన్యాసు లేవరు ? జెప్పాలె…అని భేతాళుడడిగె….ఔరా! వారీ..భేతాళ్‌..‌నోరిప్పి మాట్లాడుతననుకున్నవా! ఛల్‌! ఇం‌కా మాటలేందిరా. బేకూఫ్‌! ఇక నుంచి అన్ని చేసి సూపుడే.!. అని మనుసులనుకుంట.. ఆలోచించుకుంట.. భేతాళుని శవాన్ని భుజాన ఏసుకోని నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు‘గీ మద్దెన సన్నాసులు మాగనే మోపయ్యిండ్లు. లేనిపోని కతలు బడుకుంట తెలంగాణ ఆగం గాబట్టెనని సోషల్‌ ‌మీడియాల తెలిసీ తెల్వని లెక్కలు చెప్పుకుంట పబ్లిక్‌ను పరేశాన్‌ ‌చేత్తాండ్లు…వీళ్ళకేమవన్న ధిమాకున్నదా అసలు!? ‘‘అని ధర్మపురి నర్సన్న గుడికాడి పెస్‌ ‌మీట్ల సన్నాసుల మీద దొర మస్తుగ గరమయిండు కద..అదేందో సమజ్‌ ‌కాక సాములందరికి గుబులు బుట్టబట్టె. అగ్వ సగ్వకు కోకాపేటల జాగ తీసుకున్న శారద పీఠం సామి రేపోమాపో దొర తోని యాద్గిరి గుట్ట మీద యజ్ఞం జేయించే సామి దాక శానమంది సాములకు దొర ఎవరినంటాండో తెల్వక కిందికి మీదికి పరేషాన్‌ ‌కాబట్టె. సన్నాసులంటె కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకునే దొర సన్నాసులను తిట్టుడేంది ? ..ఇంటె ఇచ్చంతరం గాదా ఏంది ? దొరకు సన్నాసులంటె కొత్తగచ్చిన గుబులేంది.! అని పబ్లిక్‌ ‌సూత అనుకోబట్టిరి.అసలీ సన్నాసులు, సాము లెన్నితీర్లని లెక్కలేత్తె..బొచ్చెడు తీర్లుండె.బట్టలేసుకునేటోళ్ళుండె..అసలేం ఏసుకోనోళ్ళుండె…ఎమ్మెల్లే సాములుండె..ఎంపి సాములుండె..మినిస్టర్‌ ‌సాములుండె..సిఎం సామి సూత వుండె. యోగ సాములుండె..ధ్యాన సాములుండె..కామ సాములుండె.మంచం సాములుండె..గివీళ్ళంత మనకు ఎరుకున్నొళ్ళేనాయె…మరి కొత్తగ ఎవలచ్చెనో యేమో ! దొర మనాది మొత్తం మొకం మీద కొట్టచ్చి కనబడ్తాంది. మెల్ల మెల్లంగ గిట్ల బయటికి జెప్ప బట్టిండు.. ‘‘బంగారు తెలంగాణ బహ్మాండంగ దగ్గరికత్తాంటె కాళ్ళడ్డం బెట్టెటోళ్ళు, అద్భుతమైన
అభివుద్దిని చూసి ఓర్వలేనోళ్ళు, సోషల్మీడియాల పరాగత్‌గ కారెడ్డాలాడటోళ్ళు ..వాళ్ళకు వాళ్ళే మేధావులనుకొనెటోళ్ళు ఎక్కువైండ్లు. దేశంల ఎక్కడలేని సంక్షేమపథకాలు మనకాడున్నయి..మానిపెస్టోల జెప్పినయి..చెప్పనియి ఎన్ని తెచ్చినా సూత ఈ ఏడుపులేందో ! ఏమో! పిల్ల కడుపులున్నప్పుడు ఓటి,,పుట్టంగనె ఓటి, బడికి పోయెటప్పుడోటి, ఆఖరికి పెండ్లికి సూతకల్యాణలచ్చిమి ఇయ్యబడితిని, పెద్దోళ్ళకు పింఛన్లూ, మూడు గుంటలున్న రైతన్నకు రైతు బీమా, రైతుబంధు, రైతన్నల లచ్చ రూపాల అప్పు మాఫ్‌ ఎప్పుడో చేత్తిని, పాత పట్టాలల్ల కిరికిర్లున్నయని కొత్త పట్టాదార్‌ ‌పాస్‌ ‌పుస్తకాలిత్తిని. కోటి ఎకరాలకు నీల్లు పారిత్తనన్ననా! మాట మీద నిలబడ్తాన.
గోదారి మీద కాళేశ్వరం ఎత్తి పోసుడు షురువాయెనా లేదా! వందలాది టిఎంసిల నీల్లు పదమూడు జిల్లాలు పారిచ్చే బహ్మాండమైన ప్రాజెక్ట్ ఇప్పటికే ఎత్తిపోసుడు పనులు షురువాయెనా లేదా! …హెలికాప్టర్ల కెల్లి సూత్తే చెప్పరాని ఆనందమాయె. గోదారిని సూడంగనె ‘‘థమ్స్ అప్‌’’ ‌చెప్పిన్నాలేదా…మన రాజ్జెంల వున్నన్ని అద్భుతమైన సంక్షేమ పథకాలు దేశంల ఎడన్నున్నయా! అని సుట్టు పక్కల అన్ని రాజ్జాలు చిత్రంగ జూడబట్టె. ఇన్నేల్లు మన తాన రాజ్యం చేసినోళ్ళు గివన్నెందుకు చేయలేదో ?’’(నర్సన్న ఎట్ల జేసి రాతి ఇగ్రహమేనాయె..ఇనెటోడా ! కండ్లు సారిచ్చి చూసెటోడా!) గింతగనం రాత్రింబగళ్ళు అభివృద్ధి కోసం పనులు జేయబట్టిన్నా లేదా! కొత్త పాసు పుస్తకాలాల్ల అనుభవదారుల ఊసే ఊషిపోయి ఒక్క దెబ్బతోని లచ్చలాది మంది బక్క రైతుల ఎకరాల కొద్ది భూములు మళ్ళా పాత భూసాముల పాలైనయని చిత్రకతలు చెప్పబడితిరి. కొట్టాడి తెచ్చుకున్న రాజ్జెంల ఇప్పటికే మూడు వేలమంది రైతులు జీవిడిసిరి. మంచినీళ్ళ లాగ మందుతాగితిరి..చెట్లకు కొమ్మలోలె తాడేసుకుంటిరి. పొత్తిళ్ళల్ల బిడ్డనెడబాపినట్టు భూములు గుంజుకున్న రాజ్జెంల ఇంకెంత మంది రైతన్నల ఉసురు బోసుకుంటరని సోషల్‌ ‌మీడియాల అరికతలు చెప్పబడితిరి. వారం రోజులన్న తిరిగీ తిరగని కాళేశ్వరం ఎత్తిపోతల నాలుగు మోటార్లకు లచ్చలల్ల కరంటు బిల్లచ్చె..వరద నీళ్ళను ముందుకు ఉరికిత్తిరి, ఉరికిన నీళ్ళను మల్ల కిందికిడిసి పెడితిరి. సముద్ర మట్టానికి ఆరువందల అడుగులకన్న పైకెగబాకిచ్చుడు ఇచిత్రమని పిత్తలేదా? ఈ ఎత్తిపోతల కోసం ఎన్ని మోటర్లు తిరుగాలె ! ఎంత కరంటు కాలాలె! దొర చెప్సబట్టినన్ని టిఎంసిల నీళ్ళెత్తిపోత్తె (మహారాష్టల వానలు ఇరుగ దంచితె అచ్చే వరద నీళ్ళత్తనే ఎత్తి పోతల సిన్మా! లేకుంటె ఒల్లెక్కాల ముచ్చటే అని చెప్పే సన్నాసుల మాటలినకుండ్రి). ఎన్ని కోట్లల్ల కరంటుబిల్లు రావాలె? దొర ఎంబడుండే సారొకాయన కరంటు బిల్లు లచ్చలు దాటుతదని వాళ్ళ పేపర్లనే రాసె! అయినా సూత దొర ఈ కరంటు బిల్లు వేలల్లనే వుంటదని పిట్ట కతలు చెప్పబట్టెనని గిట్ల పబ్లిక్‌ల ప్రచారమైతె మస్తుగైతాంది. బిడ్డ పెండ్లికన్న అప్పు జేయని సర్పంచ్‌ ‌లీనడుమ అప్పులు జేసి మరీ ఊర్లల్ల పనులు జేయించబట్టె. లేకుంటె ఊర్లె ఇజ్జత్‌ ‌తక్కువ బతుకైతాందని అని గుబులు పడ్తాంటిరి. ఉప సర్పంచ్‌ ‌తోని కలిపి చెక్కు పవరు ఇచ్చుడే ధోకాబాజి యవ్వారమంటె, ఒకేళ ఇచ్చినా కూసునే బల్ల, కుర్సీ లేక, రూపాయి సూత నిధులు రాని పంచాయితిల మోరీలు తీసె సఫాయోల్లకు, సూత రూపాయి జీతం లేదు. మొక్కలు బతుకకుంటె నౌఖర్లూడుతయని ఫర్మానా జేసె. యాడాదిన్నర్ధం నుంచి దొర పంచాయితిలకు రూపాయి ఇచ్చింది లేదు. పైపులు తప్ప తాగేనీళ్ళే కరువయితాంటె మొక్కలకేడి నుంచి నీళ్ళు తాపియ్యాల్నో! ఊర్లకూర్లు జరాలు, రోగాలతోని పిడాత సచ్చేందుకేనా! తెలంగాణ తెచ్చుకున్నదని లొల్లినబడబట్టె.
ఇక రెవెన్యూ శాఖను కడిగిడిషిపెట్టేందుకు మూర్తం బెట్టె. వీఆర్వో నుంచి ఎమ్మార్వో దాక అందర్ని గాయ్‌ ‌పట్టియ్యబట్టె. తెత్తనన్న పిఆర్‌సి అటేబాయె..ఇత్తనన్న ఇంటీరం ఇటే బాయె..జీతాలు పెరుగక పాయె..పదన్నొతుల్లేవాయె. తబాదలల్లేవాయె! సర్కారుద్యోగం చేసెటోళ్ళను దొర అరగోస బుచ్చుకోబట్టె. నౌఖరు దిగుడు ఇంక మూడేండ్లు పెంచమని ఎవరన్న అడిగిండ్లానుల్ల..దొర జెప్పిన ముచ్చటేనా అది…దొర జెప్పిండు కదాని ‘‘చెట్టు మీది లొట్టికి నక్కాశ పడ్డట్టు’’ ఎదురు చూసినోళ్ళందరిని పిస్సోల్లను చేసె. ఈ ఐదేండ్లల్ల దగ్గరదగ్గర లచ్చమంది దాంక నౌఖరి దిగి ఇంటిమొగం బట్టె.యాష్టచ్చిన ఉద్యోగ సంఘాలు ధర్నాల మీద ధర్నాలకు దిగబట్టె. అద్భుతమైన పాలన ఇస్తమని చెప్పిన మాట ఒకటాయె, చేషేదింకొకటాయె! గీ బాధలన్ని ఏందని జనం గోస జెప్పుకుంటె దొర అయిందాకుల బెట్టి కాంది కంచాల బెడ్తాండని ఒగరి కొగరు గోస చెప్పుకోబట్టిండ్లు. చెప్పుకునెటోళ్ళంత ఏకం గాబట్టె! ‘‘చెప్పెటోళ్ళకు చెవిటయితె ఇనెటోళ్ళకన్న ఇజ్జతుండాలె’’ అని పుల్లిరిచినట్లు మాటలిడ్వబట్టె. కొట్లాడి తెచ్చుకున్న రాజ్జెంల బతుకింత ఈనమైతాది? దొరింట్ల నవ్వులు పూయంగనె సరిపోతదా ఏంది ? దొరా! గిట్ల జేయబడితిరేంది? మా ఉసురు పోసుకోబడ్తిరని అడిగితె దొర కళ్ళల్ల నిప్పులు గురిపియ్యబట్టె. జనం ఓర్సుకునుడుకు కాలం జెల్లింది. గిట్ల కాదుగని మళ్ళా ఏకం అవుడే…ఇగ రాజ్జెమంత సలసల కాగబట్టె. ‘‘సన్నాసులం, అభివృధ్ధి నిరోధకులమా ?‘‘ అని ప్రశ్నించుడు! సబ్బండ వర్ణాలు ఏకమగుడు! జెండాలు..ఎజెండాలు బాజున బెట్టి చేతులు కలుపుడు కానత్తాంది. రాజ్జెమంతా గత్తర లేషినట్టు గాయ్‌..‌గాయ్‌..ఐతాన్నట్టు పరెషాన్‌ ‌కొడ్తాంది..
సూడ్రా బయ్‌…ఇ‌క్రమార్క్….‘‘‌లచ్చల కోట్ల రూపాలతోని అద్భుతమైన సంక్షేమ పథకాలు తెచ్చిన.. మన రాజ్జెంల వున్నన్ని యేడసూత లేవు..మనంత తోపు రాజ్జెం దేశంల్నే కాన్రాదని ‘‘దొర ధర్మపురి నర్సన్న సాచ్చిగ జెప్పబట్టె..అభివృధ్ధికి కాలడ్డం బెట్టినోళ్ళను సన్నాసులనబట్టె… గుస్స జేయబట్టె…నిజాలు జెప్తె సన్నాసు లెట్లయితరు ? గిదేనా దొర రాజీరికం ! గిట్లే వుంటాదుల్లా !? అనడిగటోళ్ళు సూత ఏం తక్కువ ..మాంచి కాక మీదున్నరు..వాళ్ళింకెక్కువ గుస్స జేత్తాండ్లు !…గీ లొల్లిల సన్నాసు లేవరు ? సన్యాసు లేవరు ? జెప్పాలె…అని భేతాళుడడిగె….ఔరా! వారీ..భేతాళ్‌..‌నోరిప్పి మాట్లాడుతననుకున్నవా! ఛల్‌! ఇం‌కా మాటలేందిరా. బేకూఫ్‌! ఇక నుంచి అన్ని చేసి సూపుడే.!. అని మనుసులనుకుంట.. ఆలోచించుకుంట.. భేతాళుని శవాన్ని భుజాన ఏసుకోని నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు

– ఎలమంద, తెలంగాణ