Take a fresh look at your lifestyle.

ప్రజా రవాణా ‘బాధ్యత’ ప్రభుత్వానిదే..!

ఆర్టీసీ ఏటా 25 కోట్ల లీటర్ల డీజిల్‌ ‌వాడుతుంది. ఉదాహరణకు డీజిల్‌ ‌ధర ఒక్క రూపాయి పెరిగితే ఆర్టీసీపై రూ.25 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రైవేటు బస్సుల అక్రమ రవాణా పై కొరడా ఝళిపిస్తే ఆ మేరకు ఆర్టీసీకి లబ్ది చేకూరుతుంది. వివిధ వర్గాల వారికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ఉచిత ప్రయాణాల సొమ్ము ఎప్పటికప్పుడు ఇస్తే ఆర్టీసీ పై భారం తగ్గుతుంది. ఆర్టీసీకి ఉన్న భూములను వాణిజ్యపరంగా ఉపయోగించే ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి. ఆర్టీసీని అర్బన్‌, ‌రూరల్‌, ఇం‌టర్‌ ‌స్టేట్‌గా విభజన చేసే అంశం కూడా పరిగణలోకి తీసుకోతగిందే. సమ్మె చేస్తే ఉద్యోగాల్లో నుంచి తీసేస్తాం అన్న బెదిరింపు ధోరణి సరైంది కాదు. ప్రజా రవాణా వ్వవస్థను సమర్ధవంతంగా నడిపించటానికి కష్ట నష్టాలను, ఆర్ధిక భారాన్ని మోయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

తెలంగాణాలో ఇప్పుడు ప్రజలను గందరగోళ పరుస్తున్న అంశం ఆర్టీసీ సమ్మె. నిత్యం లక్షలాది మంది ఆర్టీసీ బస్సులనే నమ్ముకుని వెళుతుంటారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతికి స్టీరింగ్‌ ఇచ్చింది. పదవ తరగతి పాస్‌ అయిన వారు కండక్టర్లుగా మారారు. టికెట్ల జారీ వ్యవహారాన్ని వీరికి ఇవ్వకపోవటంతో ప్రయాణికులకు, కండక్టర్లకు మధ్య వివాదాలు, గొడవలు జరుగుతున్నాయి. తీసుకోవాల్సిన ఛార్జీ కంటే ఎక్కువ తీసుకోవటం, టికెట్‌ ‌లేని ప్రయాణాలు యధేచ్ఛగా సాగుతున్నాయి. బస్సు పాస్‌ల అనుమతి కూడా కండక్టర్‌ ‌విచక్షణ పై ఆధారపడిపోయింది. కొన్ని బస్సుల్లో పాస్‌లను అనుమతిస్తుంటే కొన్ని చోట్ల ఇది ప్రైవేటు బస్సు అని గదమాయించటం జరుగుతోంది. అసలు వసూలైన ఛార్జీల మొత్తం కూడా ప్రభుత్వానికి నిజాయితీగా సమర్పిస్తున్నారా అంటే లేదనే చెప్పొచ్చు. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. కండక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ఓ వ్యక్తి వసూలు అయిన డబ్బులు మొత్తం తీసుకుని ప్రయాణం మధ్యలోనే బస్సు దిగి ఉడాయించాడట. ఈ పరిస్థితులను ఇంకా ఎన్ని రోజుల పాటు ఎదుర్కోవాలో తెలియక, ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఇంత భారీ సంఘర్షణ పూరిత వాతావరణం నెలకొనటం ఇదే మొదటిసారి. ఏకంగా యాభై వేల మంది ఉద్యోగులను ఉద్యోగాలను నుంచి తొలగిస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఓ సంచలం. సమ్మె చేయటాన్ని ప్రభుత్వం అంగీకరించే పరిస్థితుల్లో లేదు. ఎస్మా చట్టం ప్రకారం ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం నిరసన వ్యక్తం చేయటం, సమ్మెలో పాల్గొనటం చట్ట విరుద్ధంగా ప్రభుత్వం పరిగణిస్తోంది. సమ్మెలో ఉన్న కార్మికుల ఘర్షణకు దిగకుండా డిపోలను పోలీసు పహారాలో పెట్టింది. కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకునేటప్పుడు సమ్మె చేయబోం అని అండర్‌ ‌టేకింగ్‌లో తీసుకోనుంది. మరోవైపు ఆర్టీసీలోకి ప్రైవేటు వ్యక్తుల ప్రవేశానికి తరుపులు తెరవనుంది. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారం ఇకపై ఆర్టీసీలో మూడు రకాల బస్సులు ఉండనున్నాయి. ఆర్టీసీకి ఉన్న10, 400 బస్సుల్లో 50% బస్సులు అంటే 5200 పూర్తిగా ఆర్టీసీ యాజమాన్యంలో ఉంటాయి. 30% బస్సులు, అంటే 3100 బస్సులు అద్దెకు తీసుకుని వాటిని ఆర్టీసీ పర్యవేక్షణలో నడుపుతారు. 20% బస్సులు అంటే 2100 బస్సులు పూర్తిగా ప్రైవేటువి అప్పగిస్తారు. ప్రైవేటు బస్సులు పల్లెవెలుగు, సిటీ సర్వీసులు కూడా నడపాలి. చార్జీలు మాత్రం ఆర్టీసీ చెప్పినట్టే ఉంటాయి అంటున్నారు. ఆర్టీసీలో ఇప్పటికే 21 శాతం అద్దె బస్సులున్నాయి కనుక కొత్తగా మరో 9 శాతం అద్దె బస్సులు తీసుకోవాల్సి ఉంటుంది. అటు వివిధ వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు కొనసాగుతాయి. వాటికి బడ్జెట్‌ ‌కేటాయిస్తామన్నది ప్రభుత్వం చెప్పిన మాట. దీని పై ఆర్టీసీ కార్మిక సంఘాలు మండిపడటం, ప్రభుత్వ తీరుకు నిరసనగా వివిధ పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయటం జరుగుతోంది. రౌండ్‌ ‌టేబుల్‌ ‌కాన్ఫరెన్స్‌ను కూడా కార్మిక సంఘాలు నిర్వహించాయి. విపక్షాలన్నీ హాజరై సమ్మెకు తమ సంఘీభావాన్ని తెలిపాయి.

అసలు సమస్య ఏమిటి?
ఆర్టీసికి వందల కోట్లలో నష్టం ఉందన్నది ఎప్పుడూ చెప్పే మాట. అయితే ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయి? దీనిలో ప్రభుత్వం బాధ్యత ఎంత? నష్టాలు తగ్గించుకోవటానికి ఇటు ప్రభుత్వం కాని, ఆర్టీసీ యాజమాన్యం కాని చేస్తున్న ప్రయత్నాలేమిటో చర్చించాల్సిన సమయం ఇది. సగటు వ్యక్తి ఎవరైనా ఆర్టీసీ అంటే ప్రభుత్వంగానే భావిస్తారు. కాని ప్రజా రవాణా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నా…సర్కార్‌ ‌మాత్రం ఆర్టీసీ నుంచి ఏటా పన్నుల రూపంలో వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఆర్టీసీ వినియోగిస్తున్న డీజీల్‌పై ఏటా విధిస్తున్న పన్ను రూ.516 కోట్లు. కేంద్ర ఎక్సైజ్‌, ‌వ్యాట్‌ ‌కలుపుకొని ఈ మొత్తం రూ.590 కోట్లు అవుతోంది. మోటార్‌ ‌వెహికల్‌ ‌ట్యాక్స్ 240 ‌కోట్లు, ఇంధన ట్యాక్స్ 590 ‌కోట్ల అంటే సుమారుగా ఏడెనిమిది వందల కోట్ల భారం ఆర్టీసీ పై లేకపోతే నష్టం మాట అటుంచి ఒకటి రెండేళ్ళల్లో లాభాల బాటలో వెళ్లే అవకాశం దక్కుతుంది.
ప్రజా వైద్యం, ప్రజా విద్య పై పన్ను వేయరు.
అంతెందుకు కీలక రవాణా వ్యవస్థ అయిన రైల్వేల పైనే పన్ను లేదు. కాని ఒక్క ఆర్టీసీ మాత్రం పన్ను భారాన్ని మోయాల్సి వస్తోంది. ఇక వివిధ వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీసొమ్ములను కూడా ప్రభుత్వం సకాలంలో ఆర్టీసీకి చెల్లించదు. ఆ భారాన్ని ముందు ఆర్టీసీనే భరించి, తర్వాత ప్రభుత్వం నుంచి వసూలు చేసుకునేందుకు చెప్పులరిగేలా తిరగాల్సి ఉంటుంది. తెలంగాణ ఆవిర్భవించిన సమయంలో 40 రూపాయలున్న డీజిల్‌ ‌ధర ఇప్పుడు రూ.70 పైనే చేరింది. అంటే పెరిగిన ఇంధన ధరల వల్ల ఆర్టీసీకి కిలోమీటర్‌కు 5 రూపాయల చొప్పున అదనంగా ఖర్చవుతోంది. ఆర్టీసీ బస్సులు రోజుకు సరాసరి 36 లక్షల కి.మీ. తిరుగుతున్నాయి. అంటే రోజుకు కోటీ 80 లక్షల రూపాయల నష్టాన్ని ఆర్టీసి చవి చూడాల్సి వస్తోంది. పెరిగిన డీజిల్‌ ‌ధరకు కారణం ప్రభుత్వాలే. మన దగ్గర డీజిల్‌, ‌పెట్రోలు ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ ‌రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏటా కొనుగోలు చేసే విడి భాగాల పైనే జీఏస్టీ రూపంలో రూ.100 కోట్లను ఆర్టీసి చెల్లించాల్సి వస్తోంది. ఒక ముక్కలో చెప్పాలంటే బాధ్యతల దగ్గరకు వచ్చే సరికి ప్రభుత్వ సంస్థగాను, హక్కుల దగ్గరకు వచ్చే సరికి ప్రైవేటు సంస్థగాను ప్రభుత్వం చూస్తోంది.
టికెట్ల అమ్మకాల ద్వారా ఆర్టీసీకి రోజుకు 11 కోట్ల రూపాయల వరకు వస్తుంది. 2018-19 ఏడాదికి వచ్చిన ఆదాయం రూ.3,976 కోట్లు. టికెట్‌ అమ్మకాలే కాకుండా ఇతర మార్గాల నుంచి అంటే షాపుల అద్దెలు, ప్రకటనలు, పార్శిళ్లు లాంటి వాటి నుంచి సుమారు రూ.వెయ్యి కోట్లు వస్తుంది. అన్నీ కలిపితే 2018-19లో ఆర్టీసీ స్థూల ఆదాయం రూ.4,882 కోట్లు. ఇక ఖర్చు సంగతికి వస్తే ఆదాయం కంటే ఏటా వెయ్యి కోట్ల రూపాయల వరకు అదనపు వ్యయం ఉంటుంది. ఆర్టీసీ ఖర్చులో ఎక్కువ భాగం జీతాలు, డీజిల్‌, ‌పన్నులకే పోతుంది. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం వల్ల ఆర్టీసీ ఏటా నష్టాల బారిన పడుతోంది. 2018-19లో ఆర్టీసీ స్థూల నష్టం రూ.928 కోట్లు. ప్రైవేటు సంస్థలయితే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటే టికెట్‌ ‌రేట్లు పెంచడం ద్వారా ఆదాయం పెంచుకుంటాయి. లేదా నష్టాలు వచ్చే మార్గాలు రద్దుచేస్తాయి. కాని ఆర్టీసీకి ఆ అవకాశం లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఛార్జీలు పెంచటానికి లేదు. అదే విధంగా ఆదాయం తక్కువగా ఉండే గ్రామీణ, పట్టణ మార్గాల్లో బస్సు సర్వీసులు రద్దు చేయటమూ కుదరదు. తమ ఉద్యోగుల జీతాల విషయంలోనూ ఆర్టీసీ ప్రభుత్వ సంస్థగానే అన్ని రకాల సౌకర్యాలు కార్మిక చట్టాల ప్రకారం ఇవ్వాలి. ప్రైవేటు సంస్థ అయితే అవసరం, అవకాశాన్ని బట్టి జీతాల భారం తగ్గించుకుంటాయి.
విలీనం సాధ్యమేనా?
ఈ అన్ని రకాల తలనొప్పులకు ఏకైక పరిష్కారంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ప్రధాన డిమాండ్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం. ఆర్టీసీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ. 1950 నాటి ప్రజా రవాణా సంస్థల చట్టం కింద ఇది ఏర్పడింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది టీఎస్‌ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌. ‌విలీనం కోసం కార్మికులు పట్టుపట్టడానికి ముఖ్యకారణం అప్పులు, సమస్యలే. బకాయిల కోసం, నిధుల కోసం, ఉద్యోగ భద్రత కోసం ప్రతి సారి ప్రభుత్వాన్ని అభ్యర్ధించుకుంటూ ఉండాల్సి వస్తుందన్నది వీరి వాదన. అయితే ఈ డిమాండ్‌ను అంగీకరించటానికి తెలంగాణా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే డిమాండ్‌ను అటు ఏపీలో కార్మిక సంఘాలు ప్రతిపక్ష నేతగా జగన్‌ ‌పాదయాత్ర చేస్తున్నసమయంలో ఆయన ముందు పెట్టాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ ‌ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటం. అలా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వం పట్ల సంతోషంతో ఉన్నాయి. ఒక సమస్యను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చూస్తున్న ధృక్కోణం, తీసుకుంటున్న విధాన నిర్ణయాలు తూర్పు, పడమరగా ఉండటం ఆశ్చర్యం కలిగించేదే.
పరిష్కారాలేమిటి?
ప్రభుత్వం విలీనం జోలికి వెళ్ళకపోయినా వెంటనే ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి బయటకు పడేయాలంటే యుద్ధ ప్రాతిపదికన కొన్ని చర్యలు తీసుకోకతప్పదు. అన్నింటి కంటే ముఖ్యమైంది పన్నుల భారం తగ్గించడం. ప్రభుత్వం ఆర్టీసీ పై విధిస్తున్న అన్ని రకాల పన్నుల నుంచి మినహాయింపు అయినా ఇవ్వాలి లేదా కొంత రాయితీ అని కల్పించాలి. ఆర్టీసీ వ్యవయంలో దాదాపు మూడో వంతు డీజిల్‌కే వెళ్తుంది. డీజిల్‌ ‌కంటే విమానాల ఇంధనం పైనే జీఎస్టీ తక్కువగా ఉందంటే పాలక విధానాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రైల్వేలకు డీజిల్‌ను కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకే సరఫరా చేస్తుంది. కేరళ, తమిళనాడు ఆర్టీసీలకు డీజిల్‌ ‌సబ్సిడీపై దొరుకుతోంది. ఇక్కడ కూడా అలా చేయాలి. ఆర్టీసీ ఏటా 25 కోట్ల లీటర్ల డీజిల్‌ ‌వాడుతుంది. ఉదాహరణకు డీజిల్‌ ‌ధర ఒక్క రూపాయి పెరిగితే ఆర్టీసీపై రూ.25 కోట్ల అదనపు భారం పడుతుంది. ప్రైవేటు బస్సుల అక్రమ రవాణా పై కొరడా ఝళిపిస్తే ఆ మేరకు ఆర్టీసీకి లబ్ది చేకూరుతుంది. వివిధ వర్గాల వారికి ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, ఉచిత ప్రయాణాల సొమ్ము ఎప్పటికప్పుడు ఇస్తే ఆర్టీసీ పై భారం తగ్గుతుంది. ఆర్టీసీకి ఉన్న భూములను వాణిజ్యపరంగా ఉపయోగించే ప్రణాళికను రూపొందించి అమలు చేయాలి. ఆర్టీసీని అర్బన్‌, ‌రూరల్‌, ఇం‌టర్‌ ‌స్టేట్‌గా విభజన చేసే అంశం కూడా పరిగణలోకి తీసుకోతగిందే. సమ్మె చేస్తే ఉద్యోగాల్లో నుంచి తీసేస్తాం అన్న బెదిరింపు ధోరణి సరైంది కాదు. ప్రజా రవాణా వ్వవస్థను సమర్ధవంతంగా నడిపించటానికి కష్ట నష్టాలను, ఆర్ధిక భారాన్ని మోయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
రెహాన ,
సీనియర్ జర్నలిస్ట్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy