Take a fresh look at your lifestyle.

పౌరచట్టంపై కేంద్రానికి సుప్రీమ్‌కోర్టులో ఊరట

  • చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
  • ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు ‘సుప్రీమ్‌’ ‌నిర్ణయం
  • కేంద్రానికి నోటీసులు జారీ
  • ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదని హైకోర్టులకు ఆదేశం
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్పీఆర్‌)‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వీటి అమలుపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత ధర్మాసనం నిరాకరించింది.  సీఏఏకి సంబంధించిన పిటిషన్లను విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఐదు వారాల తర్వాత రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యవహారంపై మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ ‌బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ చట్టాన్ని సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కేంద్రం వాదనను వినకుండా సీఏఏపై స్టే ఉత్తర్వులు ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన 140 పిటిషన్లపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని కోర్టు తెలిపింది. సీఏఏ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన 143 పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ ‌బాబ్డే నేతృత్వంలోని బెంచ్‌ ‌విచారణకు స్వీకరించింది. సీఏఏపై విచారణ నేపథ్యంలో పెద్దసంఖ్యలో ప్రజలు తరలివస్తున్న క్రమంలో తాము ఛాంబర్స్‌లో వాదనలు వింటామని, న్యాయవాదులు ఛాంబర్లకు రావచ్చని ప్రధాన న్యాయమూర్తి బాబ్డే సూచించారు. కాగా కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్‌ ‌కేకే వేణుగోపాల్‌ ‌తన వాదనలను వినిపిస్తూ సీఏఏపపై దాఖలైన 143 పిటిషన్లలో 60 పిటిషన్‌లకు సంబందించిన కాపీలను ప్రభుత్వానికి అందించారని, తమకు కాపీలు ఇవ్వని పిటిషన్లపై స్పందించేందుకు ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని కోరారు. మరోవైపు సీఏఏపై నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వాలని, జాతీయ జనాభా రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌)‌లను కొంతకాలం పాటు వాయిదా వేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్‌ ‌సిబల్‌ ‌కోర్టును కోరారు.  కేంద్రం తరపు న్యాయవాది వేణుగోపాల్‌ ఆరు వారాల సమయం కోరడంతో న్యాయవాది కపిల్‌ ‌సిబల్‌ అభ్యంతరం తెలిపారు. అసోం, త్రిపుర పిటిషన్లను కలిపి వింటామన్న ధర్మాసనం.. వీటిపై సహకరించాల్సిందిగా కపిల్‌ ‌సిబల్‌ను కోరింది. కాగా కేంద్ర ప్రభుత్వంతో పాటు మొత్తం పిటిషనర్లందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఏఏపై మున్ముందు సుప్రీంకోర్టులో విచారణ కోరదల్చుకున్న అన్ని అంశాలను సమర్పించాలని ఆదేశించింది. కాగా సీఏఏపై  ప్రస్తుతం ఎలాంటి ఆదేశాలూ జారీ చేయరాదంటూ ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు సూచించింది.

Leave a Reply