Take a fresh look at your lifestyle.

పోలీసులూ.. చట్టం తెలుసుకోండి

ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటూ ప్రియాంక తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్న తీరు పోలీసు వ్యవస్థపై వేలెత్తి చూపుతున్నట్లుంది. తమ కూతురును బూడిద రూపంలో కాకుండా కనీసం ప్రాణాలతోనైనా చూసేవారమంటున్న వారి ఆవేదన వెనుక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతున్నట్లుంది. ఫిర్యాదు అందిన ఇరవై నాలుగు గంటల్లోనే నేరస్తులను పట్టుకున్నామని గొప్పగా చెప్పుకుంటున్న పోలీసులకు ఫిర్యాదు అందిన మరుక్షణం నుండి చేసిందేమిటన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాలిబూడిదైన శవాన్ని కనుక్కున్నట్లు మరుసటి రోజు తెల్లవారుజామున తమకు సమాచారమిచ్చిన పోలీసులు, ఆ రాత్రే స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదేమోనన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, చాలా సమయం వృథా చేశారన్నది ప్రియాంక తండ్రి శ్రీధర్‌రెడ్డి, తల్లి విజయమ్మ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇదే ఇప్పుడు పలువురిని ఆలోచింపజేసేదిగాఉంది. రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాత తమకూతురుతో కమ్యూనికేషన్‌ ‌లేకపోవడంతో కొంతసేపు ప్రయత్నించి, అపదను శంఖించి సమీపంలోని ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడ వారికి ఎదురైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆడవాళ్ళ వైపు చూస్తేనే గుడ్లు పీకేస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పాలనాతీరిదేనా అన్న విమర్శలు వేనోళ్ళ వినిపిస్తున్నాయి. రాత్రి పదకొండు గంటల వేళ తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ ఎంతో ఆవేదనతో ఫిర్యాదు చేయడానికి వొస్తే మనం చెప్పుకునే ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ ఎంత చులకన భావంతో చూస్తారనడానికి ప్రియాంక తల్లి మాటలే ప్రత్యక్ష నిదర్శనం. ఆమె మాటల్లోనే చెప్పాలంటే పోలీసులు తనను మానసికంగా వేధించారని, ఒక విధంగా అవహేళన చేశారంటూ అమె వ్యథ చెందినతీరు పలువురిని కలిచివేసింది. లవర్‌తో పోయిందో, మరెవరితో పోయిందోనంటూ చాలా నిర్లక్ష్యంగా, చులకనగా అక్కడి సిబ్బంది మాట్లాడారంటూ మీడియా ముందు అమె బోరున విలపించిన తీరు చూస్తుంటే, ఈ వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని పాలకులు చెబుతున్నది ఇదేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఫ్రెండ్లీ పోలీసు అన్నది కేవలం నినాదమేనా అనిపిస్తున్నది. ఎక్కడైనా, ఏ పోలీస్‌ ‌స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసేందుకు ఫిర్యాదుదారు వొస్తే అతన్ని సాదరంగా ఆహ్వానించి, వారి ఇబ్బందిని తెలుసుకుని న్యాయం చేయాలన్నది ఈ ఫ్రెడ్లీ పోలీస్‌ ఉద్దేశ్యంగా చెబుతున్న క్రమంలో, అర్ధరాత్రి తమ కూతురు కనిపించకుండా పోయిందంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్తే అక్కడి సిబ్బంది ప్రవర్తన తమను మానసిక వ్యథ•కు గురిచేసిందని ప్రియాంక తల్లిదండ్రులు ఆవేదన చెందిన తీరు రాష్ట్ర పాలనా వ్యవస్థనే దిగ్భ్రాంతిని కలిగించేదిగా ఉంది. పైగా తమకిచ్చిన ఫిర్యాదు తమ పరిధిలోకి రాదని, మరో పిఎస్‌లో ఫిర్యాదు చేసుకొమ్మని తిప్పి పంపిన తీరు, బాధ్యతారాహిత్యాన్ని, పోలీసులకు చట్టాలపై సమగ్ర అవగాహన అవసరమన్న విషయాన్ని నొక్కి చెబుతోంది. తమ పరిధిలోది కాకపోయినా ఆపత్తుతో వచ్చిన వారి ఫిర్యాదు తీసుకుని దాన్ని సంబంధిత జూరిస్‌డిక్షన్‌ ‌పిఎస్‌కు బదిలీ చేయాల్సిన కనీస బాధ్యతను నిర్వహించాలంటూ గతంలో ప్రభుత్వం చేసిన సూచనలను కూడా ప్రియాంక విషయంలో మరిచిపోయినట్లు కనిపిస్తున్నది. కేవలం ప్రియాంకరెడ్డి విషయంలోనే కాదు.. అనేక సందర్భాల్లో ఈ మాటలు తరుచూ వినిపిస్తూనే ఉంటాయి. తమ పరిధిలోనిది కాదని తిప్పిపంపేకన్నా, ఫిర్యాదు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్య తీసుకుని ఉంటే నేరాల సంఖ్య తగ్గటంతోపాటు, బాధితుల మాన, ప్రాణాలు నిలబడుతాయని న్యాయకోవిదులు అభిప్రాయపడు తున్నారు. తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మరో నిర్భయ కేసుగా దేశప్రజలందరినీ కలవరపెడుతున్న ప్రియాంకరెడ్డి హత్యోదంతాన్ని పరిశీలిస్తున్న ఓ ప్రముఖ న్యాయకోవిదుడు చెబుతున్నదాని ప్రకారం అటు ప్రజలకు, ఇటు పోలీసుకు చట్టాలపై సరైన అవగాహన అవసరమన్నది గమనార్హం. ఏ పోలీస్‌ ‌స్టేషన్‌కైనా ఏ ఫిర్యాదుదారైనా వెళ్ళి ఫిర్యాదు చేసుకోవచ్చు, పోలీసులు దాన్ని తీసుకోవచ్చని చెబుతున్నారు. ఇంకా ఇలా వివరిస్తున్నారు.. చాలామందికి జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌గురించి అవగాహనలేదు. ప్రియాంక విషయంలో వారి తల్లిదండ్రులు శంషాబాద్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు వెళ్తే, ఇది తమపరిధిలోనిది కాదని శంషాబాద్‌ ‌రూరల్‌ ‌పిఎస్‌కు వెళ్ళాలని చెప్పినట్లు వొచ్చిన వార్తలపై తాను స్పందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. పోలీసులకు చట్టాలపై అవగాహన లేకపోకుండానైనా ఉండాలి లేదా బాధ్యతల నుండి తప్పించుకునే ప్రయత్నమైనా అయి ఉండాలి. కాని, అది తప్పు అంటారాయన. ఫిర్యాదుతో ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళినా తీసుకోవాల్సిందే. తమ పరిధిలోది కాదంటే ఫిర్యాదు దారు జీరో ఎఫ్‌ఐఆర్‌ను గుర్తుచేయాల్సి ఉంటుంది. జీరో ఎఫ్‌ఐఆర్‌ అం‌టే సంబందిత కేసు ఏ స్టేషన్‌ ‌పరిధిలోదన్నది తేలకపోయినా ఎక్కడ ఫిర్యాదు చేస్తే అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌కింద నమోదుచేసుకోవచ్చు. ఆ తర్వాత సంబంధిత స్టేషన్‌కు దాన్ని బదిలీచేయాల్సి ఉంటుంది. ఇతర పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోనిదని తెలిసినప్పటికీ, ఫిర్యాదుదారు పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ తిరుగాల్సిన అవసరం లేకుండా ఫిర్యాదును జీరో ఎఫ్‌ఐఆర్‌ ‌కింద నమోదు చేసుకోవాల్సిందే. మా పరిధికాదని తప్పించురోవడానికి వీలులేదన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంత్తైనా ఉందంటారాయన. అప్పుడే ప్రియాంక లాంటి కేసుల్లో విచారణకు జాప్యం జరుగకుండా, సత్వరం చర్యలు చేపట్టేందుకు అవకాశముటుందన్నది ఆ న్యాయకోవిదుడు చెబుతున్నమాట. ప్రియాంక తల్లిదండ్రుల వాదన కూడా అదే. తమను పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ తిప్పటం, రాత్రంతా కేవలం సిసి కెమరాలను చూస్తూ అనవసర కాలయాపన చేయడంవల్లే తమ కూతురు బూడిదగా మిగిలిందన్నది వారి వాదన. ఈ విషయంలో రాష్ట్ర హోమంత్రి మాటలను కూడా విద్యార్థులు, ప్రజాసంఘాలు తప్పు పట్టాయి. ఒక పక్క భయాందోళనలో ఉన్న అమ్మాయి పోలీసులకు ఫోన్‌చేయలేదనడాన్ని వారు తప్పుపడుతున్నారు. నేరుగా పోలీస్‌ ‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుకే దిక్కులేదు. తప్పు అమ్మాయిపై నెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. చట్టాలు, కోర్టులంటూ జాప్యం చేయకుండా రెండు నిమిషాలు తమకు వొదిలేస్తే ఆ నలుగురి సంగతేమిటో తేలుస్తామని వేలాది ప్రజలు ఉదయం నుండి మధ్యాహ్నం మూడింటి వరకు షాద్‌నగర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ముందు గుమిగూడి బహిరంగ ఉరికి డిమాండ్‌చేశారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌ ‌దాటిపోనివ్వమంటూ యుద్ధవాతావరణాన్ని సృష్టించడంతో చేసేదేమీలేక జ్యుడిషియల్‌ అధికారినే పిఎస్‌కు తీసుకురావాల్సి వొచ్చింది. నిందితుడిని తల్లి కూడా ఉరిశిక్ష వేయమంటున్న పరిస్థితిలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది వేచి చూడాల్సిందే.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy