Take a fresh look at your lifestyle.

పెరిగిన అమ్మకాలు కొత్త మద్యం పాలసీ పై సర్కార్‌ ‌దృష్టి

ఆదాయం పెంచే దిశగా అడుగులు.. గ్రేటర్‌పై ప్రత్యేక దృష్టి
సెప్టెంబర్‌తో పూర్తికానున్న పాత గడువు… లైసెన్స్ ‌ఫీజు పెంచే అవకాశంతెలంగాణలో మద్యం అమ్మకాల జోరు పెరగడంతో ప్రభుత్వం కొత్త మద్యం పాలసీపై దృష్టి సారించింది. ఇప్పటికే కేవలం హైదరాబాద్‌ ‌నగరంలోనే ప్రతిరోజూ 25 నుంచి 30 కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను మరింత పెంచడంతో పాటు, భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్‌ ‌నెలతో రెండేళ్ల ఎక్సైజ్‌ ‌పాలసీ పూర్తి కావస్తున్నది. ఈ క్రమంలోనే కొత్త పాలసీని తీసుకువస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వున్న షాపులకు తోడు మరిన్ని కొత్త దుకాణాల కేటాయింపుల కోసం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దానికి అనుగుణంగా కొత్త పాలసీని ప్రకటించే అవకాశం వుంది. నగర శివారు ప్రాంతాల్లో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎక్సైజ్‌ ‌పాలసీలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా కొన్ని మున్సిపా లిటీలు కార్పొరేషన్‌లుగా ప్రకటించిన నేపథ్యంలో పాలసీలో మార్పులు వచ్చే అవకాశం ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఈసారి ఎక్సైజ్‌ ‌పాలసీ ఏ విధంగా ఉంటుందన్న దానిపై మద్యం వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. లైసెన్స్ ‌ఫీజు పెంచే అవకాశం ఉందన్న విషయమై వ్యాపారులకు సమాచారం అందింది. గతంలో ఏడాదికోసారి కొత్త లైసెన్స్ ఇచ్చే విధానం ఉండేది. షాపులను వేలం వేసేవారు. ఎక్కువ ధర కోట్‌ ‌చేసిన వారికి దుకాణాలను కేటాయించేవారు. ఈ పద్ధతిలో చాలామంది వ్యాపారులు రింగ్‌ అయి తమకు నచ్చిన చోట దుకాణాలను దక్కించుకునే వారు. దీంతో మద్యం వ్యాపారుల మధ్య గొడవలకు ఆస్కారం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం పాలసీలో మార్పులు తీసుకొచ్చింది. 2016-17, 2018-19 సంబంధించి రెండేళ్లకు లైసెన్స్ ‌ఫీజు వసూలు విధానం అమలు చేస్తోంది. జంటనగరాల్లో హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌ ‌జోన్‌లకు కలిపి హైదరాబాద్‌ ‌జోన్‌లో 6, సికింద్రాబాద్‌ ‌జోన్‌లో 5 ఎక్సైజ్‌ ‌పోలీసుస్టేషన్ల పరిధుల్లో 199 మద్యం షాపులు ఉన్నాయి. 250 వరకు బార్‌లు ఉన్నాయి. కొత్త పాలసీలో భాగంగా ముందుగా మద్యం దుకాణాలు కేటాయించేందుకు ఎక్సైజ్‌ అధికారులు సన్నద్ధమవుతున్నారు. కొత్త ఎక్సైజ్‌ ‌పాలసీలో భాగంగా లైసెన్స్ ‌కేటాయింపులో ఈసారి కూడా పారదర్శకంగానే వ్యవహరించనున్నారు. గతంలో మాదిరిగా వేలం విధానం కాకుండా జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని దుకాణాలన్నింటికీ ఒకే ధరను నిర్ణయిస్తారు. రెండేళ్ల క్రితం ఒక్కో దుకాణానికి 1.8 కోట్ల రూపాయలు నిర్ణయించి రెండేళ్లకు 2.16 కోట్ల రూపాయలు వసూలు చేశారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో లైసెన్స్ ‌ఫీజుల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని ఎక్సైజ్‌శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి గతంలో కంటే ఈ రెండేళ్లలో మద్యంపై పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. జంటనగరాల్లో రోజుకు 25 నుంచి 30 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం. అంటే
నెలకు 75 కోట్ల రూపాయలు వ్యాపారం, ఏడాదికి దాదాపు 900 కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా మద్యం వ్యాపారుల నుంచి వసూలుచేసే లైసెన్స్ ‌పీజుల నుంచి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఈసారి కూడా షాపుల కేటాయింపు, లైసెన్స్ ‌ఫీజులను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉండడంతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. జంటనగరాల్లో మద్యం దుకాణాల కోసం ఈసారి పోటీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. ఒక్కో దుకాణానికి ఇద్దరు నుంచి ముగ్గురు పోటీపడుతున్నారు. బాగా వ్యాపారం జరిగే ప్రాంతాల్లో పోటీ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. గతంలో వేలం వేస్తే ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి షాపులను కేటాయించేవారు. మారిన విధానంలో ఒక దుకాణానికి ముందే ధర నిర్ణయిస్తారు. ఈ ధరకు లైసెన్స్ ‌తీసుకునే వారు ఎక్కువమంది ఉంటే లాటరీ పద్ధతిలో వారికి షాపు కేటాయిస్తారు. గతంలో వేలం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తే ఈసారి లైసెన్స్ ‌ఫీజును పెంచడం ద్వారా మరింత అధిక ఆదాయాన్ని పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. శివారులోని పంచాయతీలు, మునిసిపాలిటీల పరిధిలో లైసెన్స్ ‌ఫీజును ఏడాదికి 45 లక్షలు రూపాయలుగా నిర్ణయించారు. తాజాగా శివారు ప్రాంతాల్లోని మునిసిపాలిటీలు, పంచాయతీలను కార్పొరేషన్‌లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మద్యం దుకాణాల లైసెన్స్ ‌ఫీజులు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీటితోపాటు దుకాణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగానే శివారు ప్రాంతాలు, జీహెచ్‌ఎం‌సీ పరిధిలో మద్యం దుకాణాల లైసెన్స్ ‌ఫీజులు పెరుగుతాయని కూడా చర్చ జరుగుతోంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy