Take a fresh look at your lifestyle.

పీవీగారంటేనే ఒక కౌస్తుభం ! ఎన్ని రత్నాలైతే దానికి సమం?

పాఠశాల విద్యార్థి దశ నుండే ప్రకాశించిన సకలరంగ జ్ఞాన విన్యాసం
శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి,  పాములపర్తి నిరంజన్‌ ‌రావు

ఆదివారం సంచిక తరువాయి (Click here )
ఈ విషయంలో అలనాటి ప్రత్యక్ష సాక్షి కాళోజీ గారు ఏమన్నారంటే : ‘‘దాదాపు 600 మంది విద్యార్థులు నాగ్‌ ‌పూర్‌ ‌యూనివర్సిటీలో చేరారు. ఈ సందర్భంలో ఓ విషయం జ్ఞాపకం వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి తరిమివేయబడ్డ విద్యార్థులకు మద్రాసు యూనివర్సిటీవారు గానీ, ఆంధ్రా యూనివర్సిటీవారు గానీ చేర్చుకునే అవకాశం కల్గించలేదు. ‘యూనివర్సిటీని గుర్తించం..కాబట్టి చేర్చుకోం’ అన్నారు. అప్పటి నాగ్‌పూర్‌ ‌యూనివర్సిటీ వైస్‌ ‌చాన్సలర్‌ ‌కేదార్‌, ‌యూనివర్సిటీ సెనేట్‌లో, ఉస్మానియా యూనివర్సిటీని గుర్తింపు చేయించి ఉస్మానియా విద్యార్థులకు అడ్మిషన్‌ ‌కల్పించినారు. ఆ 600 మంది విద్యార్థుల చదువు ముగించుకున్న తర్వాత నిజాం రాజ్యంలో జరిగిన ప్రజాస్వామ్య ఉద్యమాల్లో పాల్గొన్న వారు దాదాపు 150 మంది. పీవీ నరసింహారావు, సదాశివరావు ఆ గుంపునకు చెందిన వారే.’’ ఈ విధంగా బహిష్కృతులైన  విద్యార్థుల్లో  చాలా మంది నాగపూర్‌ ‌యూనివర్సిటీలో చేరారు.  వారిలో జూనియర్‌ ఇం‌టర్మీడియేట్‌ ‌చదువుతున్న పీవీ కూడా ఒకరు.

ఉత్తేజ పరచిన నాగపూర్‌ అనుభవాలు :
ఇంటర్మీడియేట్‌లో చేరడానికి పిల్లలు తీరా నాగ్‌పూర్‌ ‌చేరేసరికి వీళ్ళకు తరగతులు నిర్వహించడానికి తరగతి గదులు ఖాళీ లేవు, తగు ఉపాధ్యాయులకు ఫ్రీ టైం కూడ లేదు. కాబట్టి అక్కడి విద్యార్థులకు వేసవి సెలవులిచ్చినప్పుడు వీరికి తరగతులను ప్రారంభింప నిర్ణయించారు, కాబట్టి తరలివచ్చిన కాందిశీక ఉస్మానియా విద్యార్ఠులకు రెండు మూడు నెలలు చదువు కార్యక్రమం లేదు. అసలే తిరగడం, నూతనత్వాన్ని పరిశీలించడమంటే ఎంతో ఆసక్తి వున్న పీవీకి ఈ వెసులుబాటు వరమే అయింది.

మొదటిసారిగా నాగ్‌ ‌పూర్‌ ‌చేరిన పీవీకి వింత ప్రపంచం, క్రొత్త వాతావరణం కనబడింది. బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకొనడం ప్రారంభమైన ఆ నూనూగు మీసాల వయస్సులో మొదటి సారిగా చూస్తున్న ఈ నూతన జీవన శైలికీ, తానిప్పటి వరకు మెలిగిన నైజాం రాష్ట్ర ప్రజా జీవనానికీ గల వ్యత్యాసం  పీవీని అబ్బుర పరచడమే కాకుండా ఆయనలో ఆలోచనా శక్తిని ఇనుమడింప జేసింది.  అక్కడి స్వేచ్చా వాతావరణాన్ని – ముఖ్యంగా బురఖా లేని స్త్రీలు వీధుల్లో తిరగడం, విద్యార్థినులు సైకిళ్ళ పైన కాలేజీలకు రావడం, విద్యార్థులతో సమంగా ఆట పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం చూసి ఆనందించాడు. ఛత్రపతి శివాజీ, బాలగంగాధర తిలక్‌ ‌లపట్ల ప్రజలకున్న అభిమానాన్ని, హిందూ మత సంస్కృతి, ఆచార వ్యవహారాలపై వున్న ఆదరణను గాంచాడు.

వైవిధ్యంతో కూడిన ఈ క్రొత్త స్వేచ్ఛాయుత వాతావరణంతో  పీవీ ఎంతో ఉత్తేజం పొందాడు. ఆ కౌమార ప్రాయ పీవీ జాతీయ విలోకనలో విస్తృతి పెరిగింది. ఆ నూతన సమాజాన్ని మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి మరాఠీ భాషను నేర్చుకోవడం మొదలు పెట్టాడు. మరాఠీ నాటకాలను, సినిమాలను పరిశీలనాత్మకంగా చూచేవాడు. అసలే మంచి సినిమాలపై మక్కువ గల పీవీ అక్కడి మరాఠీ సినిమాలను చూసి వాటి స్థాయి తెలుగు సినిమాల కంటే ఎంతో ఆధిక్యమని గ్రహించాడు. అక్కడి నటీనటులను అభిమానించాడు. ‘ప్రహ్లాద్‌ ‌కేషవ్‌ ఆ‌త్రే’ అనే  గొప్ప రచయిత అలనాటి నాటకాలలో, సినిమాలలో తన రచనల ద్వారా గుప్పించిన హాస్యం పీవీకి అమితంగా నచ్చింది. తరవాత మనం పీవీలో గాంచిన హాస్య సంభాషణా చాతుర్యం ఆత్రే ద్వారా సంక్రమించిందేమో?  ఇదే సమయంలో ‘‘యూ కాంట్‌ ‌టేక్‌ ఇట్‌ ‌విత్‌ ‌యు’’ అనే  హాస్యంతో కూడిన ఒక ప్రసిద్ధ ఆంగ్ల శృంగార చిత్రాన్ని చూసి ఆంగ్ల  చిత్రాల పట్ల మక్కువ పెంచుకున్నాడు. ఈ చిత్ర దర్శకుడిని మెచ్చుకునేవాడు.

(ఈ సినిమా 1938 లో ఉత్తమ చిత్రం, దర్శకుడు ఫ్రాంక్‌ ‌కాప్రా ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అవార్డులు పొందటం జరిగింది)
మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే పీవీకి కుస్తీ పోటీలంటే కూడా ఇష్టమేనని నాగపూర్‌ ‌మనకు తెలుపుతుంది. ఆ రోజుల్లో నాగపూర్‌లో ప్రపంచ స్థాయి ఫ్రీ స్టైల్‌ ‌కుస్తీ పోటీలు జరిగి ఆ పోటీలో అలనాటి మేటి వస్తాదులు హర్బన్‌ ‌సింగ్‌, ‌కింగ్‌ ‌కాంగ్‌, ‌జెబిస్కో, అర్జున్‌ ‌సింగ్‌ ‌మొదలగు వారు పాల్గొన్నారట! అవి అత్యంత జనాకర్షణ కలిగి ఎంతో అద్భుతంగా వుండేవట! ఇక పీవీ యువక రక్తం ఊరుకుంటుందా? ఊరికే ఆ కుస్తీ పోటీలను చూసి ఆనందిస్తే ఆయన పీవీ ఎందుకవుతాడు? ఆ కుస్తీల్లో ప్రయోగించే అనేక రకాల ‘లాక్స్’ (‌పట్లు) నిశితంగా గమనించడమే కాకుండా వాటి గురించి మిత్రులతో అనేక విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తుండే వాడు. ఇకపోతే ఆ సంవత్సరం పోటీల్లో గెలుపొందిన హర్బన్‌ ‌సింగ్‌పై మోజు పెంచుకున్న పీవీ ఆ వస్తాదు శక్తియుక్తుల గురించి మిత్రులకు లెక్చర్లు గొట్టే వాడట !
ఇక పీవీకి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం కదా ! నాగ్‌పూర్‌లో కొన్ని మ్యూజిక్‌ ‌సర్కిళ్ళు ప్రతి ఆదివారం సంగీత సభలు నిర్వహించేవారు. ఇక మన పీవీ అక్కడ క్రమం తప్పని ముఖ్య శ్రోత. ఆ రోజుల్లో కరీంనగర్‌కు చెందిన పీవీ మిత్రుడు నారాయణ రావు అనే అతను హిందూస్థానీ సంగీత గాయకుడు. మంచి పేరున్న వాడు, ఆయన కచేరీలు కూడా సాగేవట, ఇక పీవీ హాజర్‌ ‌కాకుండా వుంటాడా? వీటితో బాటు మామూలు తిరుగుళ్ళు ఎలాగూ వున్నాయి. ప్రతి వారం జరిగే సంతలకు హాజరు కావడం, అక్కడ దొరికే అన్ని రకాల తినుబండారాల రుచి చూడటం, కారు చౌకగా దొరికే నాణ్యమైన సంత్రా పండ్ల నాస్వాదించడం మామూలే.

ఆ రోజుల్లో నాగ్‌ ‌పూర్‌లో హిందూ మహాసభ వార్షిక సమావేశాలు జరిగితే పీవీ హాజరై వీర సావర్కర్‌ను చూడటం, ఆయన భాషణ వినడం జరిగింది. ఇంకో సందర్భంలో అప్పటి అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుభాష్‌ ‌చంద్ర బోస్‌ ‌నాగ్‌ ‌పూర్‌ ‌మీదుగా ట్రైన్‌లో వెళుతున్నారని విని పీవీ మిత్రబృందంతో కలిసి ఆయన్ను ప్లాట్‌ ‌ఫారంపై ప్రత్యేకంగా సందర్శించడమే కాకుండా పీవీ ఆయన ఆటోగ్రాఫ్‌ ‌కూడా తీసుకున్నాడు. ఆ రోజుల్లో నాగ్‌ ‌పూర్‌లో జరిగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌ ‌కార్యకలాపాలను గూడా గమనించాడు. నాగ్‌పూర్‌ ‌విశ్వ విద్యాలయం జిడ్డు కృష్ణమూర్తి గారి తాత్వికోపన్యాసాలు కొన్ని రోజుల పాటు నిర్వహిస్తే పీవీ తన ముఖ్య సహచరులతో అన్ని రోజులూ హాజర్‌. ‌కృష్ణమూర్తి గారి భావాలు పూర్తిగా అర్థం కాకున్నా ఆయన భాషావైదుష్యానికి అబ్బుర పడ్డాడు పీవీ.

పీవీ  నాగ్‌పూర్‌లో వున్నప్పుడే మధ్యప్రదేశ్‌లో ‘‘త్రిపురి’’ కాంగ్రెస్‌ ‌మహా సభలు జరిగాయి. జబల్పూర్‌ ‌దగ్గరి త్రిపురిలొ జరిగిన ఆ మహాసభలకు గాంధీజీ, సుభాష్‌ ‌బాబు, పండిట్‌ ‌నెహ్రూ మున్నగు ప్రముఖ నాయకులు వస్తున్నారని ప్రచారం జరిగి ఆ సభలకు దేశం నలుమూలల నుండి లక్షలమంది అరుదెంచారు. పీవీ కూడా ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు.

దాదాపు 300 కిలోమీటర్ల దూరం వున్న జబల్పూర్‌ ‌దగ్గరి త్రిపురికి తన సన్నిహిత మిత్రులతో చేరాడు. లక్షలాది జనాలను జూచి అచ్చెరువందాడు.  ఇంకా ఆ సభల్లో నాయకుల మధ్య జరిగిన తీవ్ర భావ సంఘర్షణ, ఉద్రేకపూరిత చర్చలు, స్లోగన్లతో ప్రచారాలు, వాలంటీర్ల కవాతులు, ఆటల పోటీలు, కోలాటాలు చూచిన పీవీ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ‘భారత దేశమే ఇక్కడ ప్రత్యక్షమయిందా!’ అని మిత్రులతో తన మనస్సులోని భావాలను పంచుకున్నాడు. అక్కడ పంచిపెట్టిన అనేక కరపత్రాలను, రక రకాల ప్రచార ప్రకటన పేపర్లను ఉత్సాహంగా సేకరించాడు. ఐతే ఆ సమావేశానికి గాంధీజీ రాక పోవడం, సుభాష్‌ ‌బాబు అస్వస్థతగా వుండటం కొంత నిరుత్సాహాన్ని కలుగజేసినా ఆ మహాసభలకు హాజరవడం ఒక మధురానుభూతిగా భావించాడు పీవీ.
సభలు ముగిసాక, త్రిపురి నుండి నాగ్‌పూర్‌ ‌తిరుగు ప్రయాణంలో జబల్పూర్‌లో నాలుగు రోజుల మకాం వేశాడు పీవీ.  సమీపంలోని ‘‘భేడాఘాట్‌’’‌ను సందర్శించాడు. అక్కడి పాలరాతి కొండలూ, వాటి మధ్యగా ప్రవహించే నర్మదా నది సొంపులూ తిలకించి తన్మయం చెందాడు. జబల్పూర్‌ ‌పట్టణం వెనుకబడినదనం, అక్కడి మురికి వాడలు గమనించాడు.  పీవీ జబల్పూర్‌లో వున్నప్పుడే అక్కడ మతకలహాలు జరిగి దాని చేదు అనుభవం కొంత పీవీకి కూడా తగిలినట్లు  తెలిసింది.

నాగ్‌పూర్‌ ‌చేరగానే క్లాసులు ప్రారంభమయ్యాయి. చదువుల్లో ఎప్పుడూ పీవీ ప్రథ•ముల్లో ప్రథ•ముడు. మొత్తానికి ఇంటర్మీడియేట్‌ ‌పూర్తయింది. తరువాత బిఎస్‌సి చదవడానికి పీవీ పూనా పయనం. ఐతే మరో విశేషమేమంటే నాగ్‌పూర్‌ ‌వదిలేనాటికి పీవీలో బాల్యచేష్ట లంతరించి పెద్దమనిషి పోకడలు మొదలయ్యాయి. ఆలోచనా ధోరణి కూడా కొత్త రూపు దిద్దుకోసాగింది.

పూనా అనుభవాలు :
పీవీ పూనా చేరి ఫర్గూసన్‌  ‌కాలేజీలో బీ ఎస్‌ ‌సీ కోర్సులో చేరాడు.  పూనా కూడా నాగ్‌ ‌పూర్‌ ‌వలె మహారాష్ట్ర సంస్కృతికి కేంద్రం. అంతే కాకుండా బొంబాయి పాశ్చాత్య నాగరికత ప్రభావం నాగ్‌ ‌పూర్‌ ‌కంటే పూనా మీద అధికం.
పూనా లోని దక్కన్‌ ‌యెడ్యుకేషనల్‌ ‌సొసైటీ, భండార్కర్‌ ‌రిసెర్చ్ ఇన్‌ ‌స్టిట్యూట్‌ ‌మొదలగు  ప్రతిష్ఠాత్మక సంస్థల పనితీరును, అక్కడ సాగే నిరంతర నిర్మాణాత్మక పనులను అధ్యయనం చేసాడు. ఇక సాహిత్య, సంగీత కళా రంగాల మీద మక్కువ గల పీవీ పూనాలోని ప్రముఖ రచయితలు, పాత్రికేయులు, కవులు, కళాకారులు, సంగీత విద్వాంసులు, చిత్ర నిర్మాతల పేర్లను సంపాదించి జాబితా తయారు చేసుకున్నాడు.  ప్రముఖ కవుల, రచయితల, పాత్రికేయుల రచనలను చదవడమే కాకుండా వాటిపై పరిశీలనాత్మక, విమర్శనాత్మక అభిప్రాయాలు వెలిబుచ్చేవాడు. ఇక ప్రముఖ కళాకారుల మరాఠీ నాటకాలను, చిత్ర నిర్మాతల సినిమాలను చూసి మెచ్చుకోవడం, కొన్ని సందర్భాలలో వ్యంగ్యాత్మక వ్యాఖ్యలు చేసేవాడు. ఇక హిందూస్థానీ సంగీతమంటే అతి మక్కువ గల పీవీ పూనాలో ఎన్నో సంతృప్తికర సంగీత కార్యక్రమాలు హాజరు కాగలిగాడు.
పీవీ పూనా చేరిన సమయం లోనే రెండవ ప్రపంచ యుద్ధం మొదలయింది. జాతీయ నాయకుల ప్రసంగాలలో యుద్ధ వ్యతిరేక వైఖరి ప్రస్ఫుట మయ్యేది. అదే సమయంలో సుభాష్‌ ‌చంద్ర బోసు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ప్రజల మధ్య చర్చనీయాంశం ఐంది. అప్పుడే ‘పీపుల్స్ ఏజ్‌’ అనే వార పత్రిక ప్రారంభమైంది. దాని కొన్ని సంచికలను చదివిన పీవీలో పత్రికా రచన, పత్రిక ప్రచురణ మీద మక్కువ పెంచుకొని వివిధ పత్రికలను విమర్శనాత్మక దృష్టితో చదవడం సాగించాడు. ప్రఖ్యాత ఆంగ్ల విమర్శకుల, నాటకకర్తల, ఇతర మేధావుల రచనలను చదివాడు. చార్లీ చాప్లిన్‌, ‌వాల్ట్ ‌డిస్నీ, పికాసో, ఐన్‌ ‌స్టీన్‌, ‌సీ వీ రామన్‌ ‌లాంటి మహోన్నత మేధావుల గురించి అధ్యయనం చేసాడు.
బాల్య చాపల్యం తొలగిపోతూ మేధస్సు నిర్ణయాత్మక ఆలోచనా ధోరణులను స్థిరీకరించే ఆ కౌమార వయస్సులో పూనాలో పీవీ చేసిన వివిధ అధ్యయనాలు ఆయన జ్ఞాన సంపత్తి పెరుగుదలకు బాటలు వేసాయి అని అనుకోవచ్చు. సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ భావ ప్రకటనలో, అనుసరించవలసిన పద్ధతిలో స్వీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన మెలకువలను పీవీ నేర్చుకొనడం అప్పుడే మొదలైంది. అనేక వైరుధ్యాలతో కూడిన సమస్యలను అవగాహన చేసుకొనడం, ఆ సమస్యల పరిష్కార విధానం స్వంతంగా రూపొందించడం మెల్లిమెల్లిగా నేర్చుకొనడం ఆరంభమయింది. ఒక విధంగా చెప్పాలంటే అతిగా మాట్లాడే, తిరుగుళ్ళ అమాయకపు పీవీ ప్రవర్తన, వ్యక్తిత్వం అదృశ్యమవుతూ తక్కువ మాట, గంభీర ఆలోచనా ధోరణి, అంటీముట్టని నడవడి రూపుదిద్దుకోవడం  మొదలైంది పూనాలోనే. ఇక పీవీ పూనాలో తిరుగని వీధి లేదు, హాజరు కాని సినిమా హాలు లేదు. ‘టీ’ సేవింపని హోటలు లేదు. పూనా చుట్టు ప్రక్కల గల చూడ తగిన ప్రదేశాలన్నీ చూడటం జరిగింది.

మిగతా రేపటి సంచికలో..

Leave a Reply