వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పిల్లల్లో ఫోబియా పోవాలంటే .. భయాన్ని భయ పెడుదామా..

September 11, 2019

పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తున్నప్పుడు బూచోడు వస్తాడు నిన్ను ఎత్తుకెళతాడు అంటూ చీకటిని చూపించి పిల్లలను భయపెట్టడం అందరి ఇంట్లో ఎవ్వరైనా సాధారణంగా చేసేదే. పిల్లలు సాధారణంగా చీకటికి భయపడుతుంటారు. మరికొందరు అపరిచితులూ, నీళ్లూ, బొమ్మలూ, ఎత్తైన ప్రదేశాలూ, బల్లులు, బొద్దింకలు, కుక్కలకు భయపడుతుంటారు. అలానే ఒంటరిగా ఉండటానికి, నలుగురిలో కలవడానికీ. ఒకవేళ కలిసినా మాట్లాడటానికి కంగారు పడుతుంటారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు వారిని చూసి భయపడటం, అమ్మనాన్నలు దూరంగా ఉంటే భయపడటం, ఎక్కువగా వినికిడి చేసే శబ్దాలు, క్రిమికీటకాలు, లాంటివి చూసినప్పుడు పిల్లలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అలాగే పాఠశాలలో ఎవరైనా నువ్వు పొట్టిగా ఉన్నావ్‌ అని ఏడిపిస్తున్నా కూడా భయపడుతూ ఉంటారు. కొన్ని భయాలు కాస్త ఫోబియాగా మారే ప్రమాదం ఉంది. జీవితాంతం ఆ భయాలు వారిని వెంటాడుతూనే ఉంటాయి. బాల్యదశలోనే ఆ భయాలను పోగొట్టేలా తల్లిదండ్రులు కృషి చేయాలి.

పిల్లల పనులలలో సహకారం అందించాలి: పిల్లలకు  ఏమైనా పని చేయమనప్పుడు పిల్లలు ఉత్సాహంగా వెళ్లకుండా వెనకడుగు వేస్తున్నారంటే  ఆ పని చేయడం ఆపమని చెప్పాలి. పిల్లలపై  కోపగించుకుని బలవంతంగా ఆ పని చేయడానికి వెళ్ళమనకూడదు. ఇలా చేయడం వలన వారికి పిల్లల్లో భయం ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. మీకు ఆ పని సులువుగా అనిపించవచ్చు, కానీ మీ పిల్లలకు మాత్రం అదే పెద్ద భయం. అందుకని ఎక్కువగా బలవంతం చేయకండి. పిల్లలు ఏదైనా చేయలేనప్పుడు, ఆ పని చేయడానికి  భయపడుతూ ఉంటే మీరే దగ్గరుండి అక్కడికి వారిని తీసుకెళ్లి మీ సహకారం తో పిల్లలు ఆ పని చేసేలా వారిలోధైర్యాన్ని నింపాలి. మరో సారి అదే పనిని పిల్లలు ఒంటరిగా వెళ్ళి చేసుకుని వస్తారు. పిల్లల భయాల గురించి తరచూ విమర్శించడం, విసుక్కోవడం చేయకుండా ప్రేమగా వాటిని దూరం చేయడం మీద దృష్టి పెట్టాలి. వారి భయాలను అడ్డుపెట్టుకుని అన్నం తిననప్పుడూ, పుస్తకాలు చదవనప్పుడూ, చెప్పిన మాట విననప్పుడు చీకటి గదిలో ఉంచుతాను, దొంగోడికి అప్ప చెపుతాను వంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు. తల్లిదండ్రులు ఇలానే దీర్ఘకాలం చేస్తే ఆ భయం వారిని జీవితాంతం వెంటాడుతుంది.
పిల్లలను హార్రర్‌ ‌సినిమాలకు దూరంగా ఉంచాలి: హారర్‌ ‌సినిమాలు, ఫ్రాంక్‌ ‌వీడియోస్‌, ‌దెయ్యం సినిమాలు మీతో పాటు చిన్నపిల్లలు చూస్తున్నప్పుడు నిజంగా చీకట్లో మన గదిలోకి వస్తాయేమో అని పిల్లలు భయపడుతూ ఉంటారు. అవి అసలు నిజం కాదని పిల్లలకు అర్థం అయ్యేలా చెప్పాలి . చిన్న పిల్లలకు ఈ విషయాలు అర్థం కాకపోవచ్చు గానీ ఎదుగుతున్న పిల్లలకు నిజ జీవితానికి, సినిమాలలో చూపిస్తున్న దానికి మధ్య ఉన్న తేడాను వివరించి అర్థం అయ్యేలా చెప్పాలి. సినిమాలకు, నిజ జీవితం మధ్య తేడా గుర్తించెంత వరకు హార్రర్‌ ‌సినిమాలకు దూరంగా ఉండే విధంగా జాగ్రత్తలు పాటించాలి.

అతి జాగ్రత్తతో పిల్లల్లో భయాలు : అభద్రతా భావం వల్ల కొన్ని సార్లు తల్లి దండ్రులు చూపే అతి జాగ్రత్త కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. చీకట్లోకి వెళ్లకూ, మేడ ఎక్కకూ, వీధిలోకి వెళ్ళకు అంటూ ఇలా చెబుతుంటారు. క్రమంగా పిల్లలు అలా చేయకూడదనీ, చేయడానికి భయపడే ఆస్కారముంటుంది. అప్పుడప్పుడు ఈ భయాలు పిల్లలను  కలల రూపంలోనూ వెంటాడతాయి. పిల్లలు భయాన్ని సృస్టించే ప్రయత్నం చేయకూడదు. పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్లకూడదు: భయపడే విషయాలను పిల్లలు ఎక్కువగా గుర్తు చేసుకోవడం వలన, వారు విన్న కథలు లేదా చూసిన వీడియోలు తమ కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా ఉంటాయి. అలా గుర్తొచ్చినప్పుడు భయంతో వణికిపోతుంటారు. అలాంటప్పుడు పిల్లలను ఒంటరిగా వదిలి పెట్టి వెళ్లకూడదు. ప్రశాంతంగా ఉండమని కూర్చోబెట్టి కొద్ది సేపు రిలాక్స్ అవ్వమని చెప్పాలి. ఇలా టెన్షన్‌ ‌పడటం వలన వారిలో మానసిక దైర్యం కొరవడే ప్రమాదం ఉండవచ్చు. పిల్లలకు నచ్చిన విషయాలు చెప్పడం, ఫన్నీగా ఉండే జోక్‌ ‌లు వేయడం, తీపి స్మృతులను  గుర్తుచేయడం చేయాలి.
సున్నితంగా చెప్పాలి: చాలామంది పిల్లలు టీవీలలో వచ్చే కార్టూన్స్ ‌చూసి భయపడుతూ ఉంటారు. రాత్రి పడుకున్నప్పుడు లేదా గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు కార్టూన్స్‌లో ఉండే విలన్‌ ‌లేదా రాక్షసుడు తమ దగ్గరకు వస్తున్నాడనే భయం ఎక్కువగా ఉంటుంది. ఆ క్షణం వరకు భయపడినా కూడా, మళ్ళీ మరుసటి రోజు కార్టూన్స్ ‌చూడటం మాత్రం వదిలిపెట్టరు. అమ్మను అడిగిమరీ ఆ కార్టూన్స్ ‌పెట్టించుకుంటారు. ఈవిధంగా భయ పడుతున్నప్పుడు అందులో హీరో ఏం చేస్తాడో, వాటితో ఎలా ఫైట్‌ ‌చేస్తాడో నువ్వు కూడా అలా చేయాలి. ఇలా భయపడకూడదు అంటూ సున్నితంగా చెప్పాలి. పిల్లల భయం అందరితో పంచుకోరు: పిల్లలు వారు భయపడే విషయాలను ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ధైర్యం లేని పిరికివాళ్ళుగా చూస్తారని, ఆటపట్టిస్తారని తమ భయాలను అందరితో పంచుకోరు. అమ్మనాన్నలే అడిగిమరీ తెలుసుకోవాలి. పిల్లలను దగ్గరకు తీసుకుని నీకు ఏదైనా భయం ఉంటే నేను ఆ భయాన్ని పోగొడుతాను అని  ధైర్యం చెప్పాలి. వాళ్ళు చెప్పే విషయాలు సావధానంగా వినాలే తప్ప నవ్వడం చేయకూడదు. ఆ భయాన్ని పోగెట్టే మార్గం ఆలోచించాలి. చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల భయాల్ని తేలిగ్గా తీసుకుంటారు. ఒకవేళ  చిన్నారులు ఏదైనా చెప్పినప్పుడు దానికి భయమెందుకు అంటూ కొట్టిపారేస్తుంటారు.

అలా చేస్తే అమ్మానాన్నలు తమని అర్థం చేసుకోవడం లేదనుకుంటారు. క్రమంగా చెప్పడం మానేసి, లోలోపల భయపడుతుంటారు. ఒత్తిడికి లోనవుతారు. ఇలా ఎక్కువకాలం కొనసాగితే భయం కాస్తా ఫోబియాగా మారే ప్రమాదం ఉంటుంది. సానుకూల దృక్పథం పెంపొందించాలి: పిల్లలు భయపడేదాని గురించి వారికి సానుకూలంగా (పాజిటివ్‌ ‌గా) తల్లిదండ్రులు చెప్పాలి. భయాల గురించి తెలిశాక తేలిగ్గా తీసుకోకుండా దూరం చేసే ప్రయత్నం చేయాలి. చీకటికి భయపడుతుంటే రాత్రి సమయంలో ఆరుబయటకు తీసుకొచ్చి నక్షత్రాలు చూపించాలి. కథలు చెప్పాలి. చిన్నతనంలో రాత్రిపూట చందమామని చూస్తూ ఎలా అన్నం తినేవారో వివరించాలి. అలానే వెన్నెల్లో వారితో కలిసి చిన్న చిన్న ఆటలు ఆడాలి. వెలుతురూ, చీకటి అనేవి ప్రకృతి అని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. మొదట గదిలో కాస్త వెలుతురును తగ్గించి వారితో కలిసి మీరుండాలి.

అలా తరచూ చేస్తుంటే పిల్లల మానసిక స్థితి చీకటికి అలవాటు పడుతుంది. అలా ప్రతి విషయం గురించి క్రమేపీ చెబుతూ వారిని మానసికంగా సన్నద్దుల్ని చేస్తుంటే అలవాటు  పడతారు. భయాన్ని దూరం చేసుకుంటారు. అలాకాకుండా ఒక్కసారిగా మారాలని మాత్రం వారిపై ఒత్తిడి తీసుకురాకూడదు. ఇలా చేస్తే ఇంకా సమస్య పెరుగుతుంది. పరిస్థితిని బట్టీ…సానుకూల దృక్పథం నేర్పించాలి. నేనున్నాను అనే ధైర్యం పిల్లల్లో  కల్పించాలి. తల్లిదండ్రులు అప్పుడప్పుడూ సైకాలజిస్ట్ ‌ల సలహాలు సూచనలు తీసుకుంటూ చిన్నారుల భయాల్ని తొలగించే ప్రయత్నం చేయాలి. పరిస్థితి బట్టీ కౌన్సెలింగ్‌, ‌సైకోథెరపీ కూడా ఉపయోగపడతుంది.

డా అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి కౌన్సెలింగ్‌ ‌సైకాలజిస్ట్ ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌ ‌చేతన సైకాలజికల్‌ ‌ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ ‌సెంటర్‌