వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పాలుగారే పాలమూరు..!

August 29, 2019

ప్రజల రుణం తీర్చుకుంటా
 పాలమూరు-రంగారెడ్డి పథకం పనుల పర్యవేక్షణ పర్యటనలో సిఎం కేసిఆర్‌ ‌వెల్లడి.

ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి జిల్లాకే వలసలు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తాననిపాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15 లక్షల ఎకరాల సాగుకు నీరందించి తీరుతామని, పాలమూరు జిల్లా అభివృద్ధి ఫలాల కోసమే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టామని, పాలుగారే పాలమూరుగా తయారు చేస్తామని వలసల జిల్లాగా పేరొందిన పాలమూరుకి వలసలు వచ్చే విధంగా నిర్మాణం చేసి పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపడుతున్నటువంటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులను పర్యవేక్షణలో భాగంగా మొదటగా భూత్పూర్‌ ‌మండలంలో కరివెన జలాశయం, నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా బిజినేపల్లి మండలంలో వట్టెం, కొల్లాపూర్‌లో నార్లాపూర్‌, ‌వనపర్తి జిల్లాలో గోపాలపేట మండలం ఏదుల జలాశయాల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో, ఇంజనీర్లతో సమీక్షించి అనంతరం ఏదుల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లా 14 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ రెండు ఎంపి స్థానాలను టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి ఓటు వేసి గెలిపించారని, పాలమూరు ప్రజలు టిఆర్‌ఎస్‌ ‌పార్టీని గుండెల్లో పెట్టుకుని చూపించినటువంటి తీర్పుకు పాలమూరు ప్రజల రుణం తీర్చుకుంటానని, ఆరునూరైనా.. రైతులకు ఉచిత కరెంట్‌ ఇచ్చి తీరుతానని, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి ప్రతి నియోజకవర్గంలోనూ లక్ష ఎకరాలకు సాగునీరు అందించే దిశగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రాబోయే 10 మాసాల్లో పూర్తి చేసి తీరుతానని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత పథకం చేపట్టి పాలమూరును అభివృద్ధి దిశలో చేపట్టి జిల్లాకు వలసలు వచ్చే విధంగా తయారు చేస్తానన్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 శాతం నిర్మాణం పనులు పూర్తయ్యాయని, మిగతా పెండింగ్‌ ‌నిర్మాణం పనులను మూడు షిఫ్ట్‌లుగా పనులు చేపట్టి యుద్ద ప్రాతిపాదికన అధికారులు, ఇంజనీర్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధితో ముందరకు వెళ్లే విధంగా ప్రభుత్వం ప్రణాళికతో వెళ్తుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుంచిత మనస్సుతో మాట్లాడుతున్నారని, ఆనాడు మహారాష్ట్ర బాబ్ల్లీ ప్రాజెక్టు గొడవతో చంద్రబాబు నాయుడు ఏం సాధించారని, పరవాడ ప్రాజెక్టుతో గొడవ పెట్టుకుని సాధించింది సున్నా అని అన్నారు. కలలు గన్న పాలమూరును అతి త్వరలోనే కళ్ల చూస్తామన్నారు. గోదావరి, కృష్ణ అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్‌మెహన్‌రెడ్డి, నేను ఒక అభిప్రాయానికి వచ్చామని, అతి త్వరలోనే గోదావరి, కృష్ణ అనుసంధానంపై ఒక నిర్ధిష్టమైన అభిప్రాయం ఏర్పడనుందున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అమెరికా దేశంలో న్యూయార్కు టైం సర్వే సెంటర్‌లో అద్భుతమని చూపిస్తున్నారన్నారు. కొందరు అర్భకులు అవాక్కులు, చెవాకులు పేలుస్తున్నారని, జూరాల ప్రాజెక్టు నుండి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలనడం సరికాదన్నారు. జూరాల ప్రాజెక్టులో 6 టిఎంసిల నీరు నిల్వ ఉండే ప్రాజెక్టు అని, శ్రీశైలంకు నీరొచ్చినా ఒక్కోసారి జూరాల ప్రాజెక్టులో నీరు ఉండదని, ఇటువంటి పరిణామాలను గతంలో అనేకమార్లు మనమందరం చవిచూశామన్నారు. నీరులేక పొరగు రాష్ట్రమైన కర్నాటకతో బతిమాలి నీటిని అడుక్కునేవారమన్నారు. అందుచేత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాలకు తీసుకెళ్లడమనేది సరైన అంశం కాదన్నారు. అదికాక జూరాల ప్రాజెక్టుకు లక్షా 20వేల సొంత ఆయకట్టు ఉందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగిందన్నారు. అంతేకా గత పాలకుల తెలివితక్కువ విధానం వల్ల తెలంగాణ రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌హయాంలో లక్షల పంప్‌సెట్లు వినియోగించారన్నారు. సుమారు 500నుండి700 ఫీట్ల లోతు బోర్లను వేసుకున్నారన్నారు. దీంతో భూగర్భ జలాశంయ కింది స్థాయి పడిపోయిందన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌కరివెన జలాశయం నిర్మాణ పనులను ఏరియల్‌ ‌సర్వే ద్వారా పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను చూసి ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం మ్యాప్‌ ‌ద్వారా సంబంధితశాఖ ఇంజనీర్లతో మాట్లాడుతూ.. వారికి తగు సూచనలు ముఖ్యమంత్రి ఇచ్చారు. వేగవంతంగా జలాశయ నిర్మాణ పనులను నిర్మించాలన్నారు. కోయిల్‌సాగర్‌కు, సంగంబండకు సాగునీరు వచ్చే ఏప్రిల్‌ ‌నాటికి అందించాలన్నారు. నారాయణపేట జిల్లాకు నీటిని కాల్వల ద్వారా పంపించేందుకు అవసరమైన కాల్వల తవ్వకాల పొడవులను పెంచుకోవాలన్నారు. అనంతరం ఏదుల వద్ద అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. వీరితో పాటు మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, ‌ప్రశాంత్‌, ‌సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సిఎంవో అధికారులు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, అబ్రహం, గువ్వల బాలరాజు, ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.