వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పారిశ్రామిక రంగానికి ఊతం లేదు… అందుకే ఉద్వాసనలు

September 5, 2019

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుసరిస్తున్న   ఆర్థిక విధానాల వల్ల పారిశ్రామికరంగం కుంటుబడి ఇప్పటికే  మూడు లక్షల ఏభైవేల ఉద్యోగాలు హూష్‌ ‌కాకి అయ్యాయి. ఇదేదో రాజకీయ నాయకుల నోటంట వెలువడిన మాట కాదు. మాజీ ప్రధాని మన్మోహన్‌ ‌సింగ్‌   ‌ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెల్లడించిన విషయాల్లోనివి. మన్మోహన్‌ ‌యూపీఏ ప్రధానిగా  పదేళ్ళ పాటు వ్యవహరించినా ఆయన ప్రధానంగా ఆర్థిక వేత్తే కానీ, రాజకీయవేత్త కాదు. అందువల్ల ఆయన చెప్పే విషయాలన్నీ ఆర్థిక రంగం దృష్టితోనే పరిశీలించాల్సి ఉంది. దేశ ఆర్థికాభివృద్ధి రేటు   5.7 శాతానికి తగ్గే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోవడమే ఇందుకు కారణం. ముఖ్యంగా, ఆటో రంగం వృద్ధి క్షీణత వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. జూన్‌ ఆఖరుకు అంతమైన త్రైమాసికంలో వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది. 2013  అక్టోబర్‌లో ఆగ్రాలో ఎన్నికల ప్రచార సభలో ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగిస్తూ ఏటా కోటి ఉద్యోగాలను  కొత్తగా సృష్టిస్తామన్నారు. మళ్ళీ ఆయనే ఇటీవల తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 40 లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక ఉత్పత్తుల్లో హెచ్చు తగ్గులు మామూలే అయినప్పటికీ వాతావరణం సజావుగా ఉన్నప్పుడు, ఎటువంటి కార్మిక సమస్యలూ లేనప్పడు ఉత్పత్తులు ఎందుకు తగ్గుతున్నాయన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సంతృప్తికరమైన సమాధానం లేదు. అయితే, ఇందుకు కారణాలను ఆర్థిక రంగంలో తలపండిన వ్యక్తిగా మన్మోహన్‌ ‌సింగ్‌ ‌చెబుతున్నారు. ఎవరినీ సంప్రదించకుండా పెద్ద నోట్లను రద్దు చేయడం, ప్రతిపక్షాల సూచనలను మొదట్లో పరిగణనలోకి తీసుకోకుండా వస్తు, సేవా పన్ను(జిఎస్‌ ‌టి)ను హడావుడిగా  ప్రవేశపెట్టడమే కారణమన్న మన్మోహన్‌ ‌వాదనను ఎవరూ తోసిపుచ్చలేరు. జిఎస్‌ ‌టి రేట్లలో ప్రభుత్వం మార్పులు చేసిన మాట వాస్తవమే కానీ, ఆ మార్పులేవో మొదటే చేసి ఉంటే ఆర్థికరంగం కుదేలు అయ్యే పరిస్థితి ఉత్పన్నం అయ్యేది కాదు. ప్రభుత్వం పంతానికి పోయి ప్రతిపక్షాల సూచనలను తోసిరాజంది. అదే మాదిరిగా పెద్ద నోట్ల రద్దు ప్రభావం మన ఆర్థిక వ్యవస్థను ఇంకా వెంటాడుతూనే ఉంది. పెద్ద పారిశ్రామిక సంస్థల సంగతి అటుంచితే, చిన్న పరిశ్రమలు వేల సంఖ్యలో మూతపడ్డాయి.    ఎంఎస్‌ఎంఈ (‌సూక్ష్మ, లఘు పరిశ్రమలకు)లకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు బ్యాంకుల వద్ద ప్రత్యేకంగా బ్యానర్లు, బోర్డులు వేలాడ తీశారు. అయితే, ఈ సంస్థలకు ఇచ్చిన రుణాలు కూడా నీరవ్‌ ‌మోడీ, మెహుల్‌ ‌చోక్సీ వంటి ఎగవేతదారులకు ఇచ్చిన రుణాలతో పోలిస్తే చాలా తక్కువ. పారిశ్రామిక సంస్థలకు మౌలిక  సదుపాయాలను కల్పించడంలో కూడా మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఇరవై నాలుగు గంటల విద్యుత్‌  ‌పథకాన్ని అమలు జేసింది తమ ప్రభుత్వమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ఘనంగా చెప్పుకున్నారు. అయితే, ఈ విద్యుత్‌ ‌పథకం పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితం అయింది. మౌలిక సదుపాయాల్లో మరో ముఖ్యమైన  నీటి సరఫరా విషయంలో కూడా  రాష్ట్రాలు వెనకబడ్డాయి. ఇది రాష్ట్రాల వైఫల్యమని కేంద్రం, కేంద్రం నుంచి తమకు తగిన నిధులు అందలేదని రాష్ట్రాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. తెలంగాణను ప్రస్తుతం కుదిపేస్తున్న యూరియా కొరత  ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్రానికి చాలినన్ని   యూరియా నిల్వలను కేంద్రం సరఫరా చేసిందని బీజేపీ ఎంపీ సంజయ్‌ ‌పేర్కొనగా, కేంద్రం యూరియా నిల్వలను విడుదల చేయడంలో జాప్యం వల్లనే కొరత ఏర్పడిందని తెరాస నాయకులు పరస్పరం నిందలు వేసుకుంటున్నారు. అలాగే, ఇతర పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల వల్లనే ఉత్పత్తులు జోరుగా  సాగడం లేదని ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర పార్టీలు పేర్కొంటున్నాయి. పారిశ్రామిక సంస్థలకు మౌలిక సదుపాయాలతో పాటు  రుణాలు విరివిగా  అందుబాటులోకి రావాలి. బ్యాంకుల్లో విలీనం సమస్యను కొత్తగా తెచ్చి పెట్టడం వల్ల అంతకుముందున్న ఆర్థిక లావాదేవీలు ఆగిపోయాయి. విలీన ప్రక్రియ పూర్తి అయ్యే వరకూ రుణాలు వచ్చే అవకాశాలు కల్పించడం లేదు. పారిశ్రామిక రంగం పాత సమస్యలు కాకుండా కొత్త సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ     ఐదు లక్షల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడం ఎంతవరకూ సాధ్యమో ఆర్థిక మంత్రే చెప్పాలి.