Take a fresh look at your lifestyle.

పాపికొండలు విహార యాత్రలో విషాదం

  • కన్నీటి సంద్రమైన కడిపికొండ
  • లాంచీలో 14మంది కడిపికొండ వాసులు
  • 7గురు గల్లంతు  ఐదుగురు సురక్షితం  ఇద్దరు మృతి

కడిపికొండ కన్నీటి కొండ అయింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో నిండిపోయింది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో ఆదివారం బోటు మునిగిన ప్రమాదంలో వరంగల్‌ ‌జిల్లా కడిపికొండకు చెందిన మొత్తం 14 మందిలో బస్కె రాజేందర్‌ (42), ‌డిగ్రీ విద్యార్థి బస్కె అవినాష్‌ (21)‌లు మృతి చెందినట్లు ఆదివారం రాత్రి అధికారులు ధృవీకరించారు. కాగా సివ్వి వెంకటస్వామి (62), బస్కె రాజేంద్రప్రసాద్‌ (50), ‌కొండూరు రాజ్‌కుమార్‌(40), ‌బస్కె ధర్మరాజు (42), గడ్డమీది సునిల్‌ (40), ‌కొమ్ముల రవి (43), గొర్రె రాజేంద్రప్రసాద్‌(55)‌ల ఆచూకీ ఇంకా తెలియలేదు. ఆచూకీ తెలిసిన వారిలో బస్కె దశరథం (54), బస్కె వెంకటస్వామి (58), దర్శనాల సురేష్‌(24), ‌గొర్రె ప్రభాకర్‌(54), ఆరెపల్లి ప్రభాకర్‌(35)‌లు ఉన్నారు. ఇందులో ఐదుగురు సురక్షితంగా బయట పడగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. 7గురు గల్లంతై వారి ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. టూర్‌కు వెళ్లిన వారంతా గ్రామంలోని మాదిగ మహారాజ్‌ ‌కుల సంక్షేమ సంఘం సభ్యులు. నిరుపేద కుటుంబాలకు చెందిన వీరంతా గణపతి నవరాత్రులు ముగించుకొని ఆనందంతో పాపికొండలు విహార యాత్రకు వెళ్లారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడం అందరినీ కలిచివేసింది. కాగా కడిపికొండ ఘటనతో జిల్లా వ్యాప్తంగా విషాధచాయలు అలుమున్నాయి. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కాగా ఘటనపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

మంత్రి ఎర్రబెల్లి పరామర్శ :
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లాంచీ ప్రమాద బాధితులను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌,
‌గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌లు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు లాంచీ ఘటన జరిగిన ప్రాంతాన్ని కూడా మంత్రి పర్యటించి పరిశీలించారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని ఎర్రబెల్లి తెలిపారు.

దాస్యం దిగ్భ్రాంతి:
పాపికొండలు లాంచీ ఘటనపై తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ ‌విప్‌ ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.  అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నామని మృతదేహాలను స్వస్థలాలకు తీసుకు వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ఎంపి దయాకర్‌ ‌పరామర్శ:
ప్రమాదంలో కడిపికొండ వాసులు చిక్కుకున్నారన్న విషయం తెలియగానే వరంగల్‌ ఎం‌పి పసునూరి దయాకర్‌ ‌కడిపికొండ చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వారికి ధైర్యం చెబుతూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేలా చూస్తాననన్నారు.

రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి : రావు పద్మ
దేవిపట్నం పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి,  గలంతైన వారి కుటుంబ సభ్యులను  బీజేపీ వరంగల్‌ అర్బన్‌ అధ్యక్షురాలు రావు పద్మ పరామర్శించారు. విహారయాత్రలో విషాదం జరగడం బాధాకరం, దురదృష్టకరమైన సంఘటన. మృతి చెందిన వారి మృతదేహాలను త్వరగా తీసుకొనివచ్చి, వారి దహన సంస్కార ఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలి. ప్రభుత్వం తక్షణమే ప్రతి బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి, ప్రతి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్‌ ‌చేశారు.

కాంగ్రెస్‌ ‌నేత నాయిని సంతాపం :
పాపికొండలు సమీపంలో విహారయాత్రకు వెళ్లి లాంచీ మునగడంతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు వరంగల్‌ అర్బన్‌, ‌రూరల్‌ ‌జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy