వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పసుపు బోర్డుకై పోరాటం చేస్తాం

April 1, 2019

నిజామాబాద్‌ ‌తెరాస ఎంపీ అభ్యర్థి కవితపసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశామని, కేంద్ర మంత్రులకు అనేక వినతిపత్రాలు సమర్పించామని నిజామాబాద్‌ ‌తెరాస లోక్‌సభ అభ్యర్థి కవిత అన్నారు. సోమవారం నిజామాబాద్‌ ‌జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పసుపు బోర్డుపై కేంద్ర మంత్రులకు అనేక వినతిపత్రాలు సమర్పించామని తెలిపారు. పసుపు బోర్డుపై లోక్‌సభలో ప్రైవేటు బిల్లు కూడా ప్రవేశ పెట్టామని చెప్పారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను నమ్మి ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 24గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలపై కేంద్రంతో పోరాడామన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతేడాది రూ.150కోట్లతో ఎర్రజొన్నను నష్టం ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేసిందని కవిత గుర్తు చేశారు. ఏర్గట్లలో ఇరిగేషన్‌ ‌కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. రూ.11 కోట్ల ఎర్రజొన్న రైతుల బకాయిలు తీర్చామన్నారు. ఇళ్లులేని పేదలందరికీ డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని, సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి దేశంలో కూడా జరగాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కవిత కోరారు. ఏర్గట్ల గ్రామాన్ని మండల కేంద్రంగా చేయడంలో ఎంతో కృషి చేశారు. గతంలో ఎంపీగా ఉన్న మధుయాష్కీ ఎంపీ నిధులు సైతం వెనక్కి వెళ్లాయని, పసుపు బోర్డు కోసం ఎంతో కృషి చేశామన్నారు. గతంలో నిర్మలా సీతారామన్‌ ‌పసుపు బోర్డు ఇవ్వమంటే ఇవ్వలేదని, ఇవాళ బీజేపీ వస్తే ఇస్తామంటున్నారు.. ఈ ఐదేళ్లు బీజేపీ నేతలు ఏం చేశారని కవిత ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ ‌సురేశ్‌రెడ్డి, రైతు ఉద్యమ నాయకుడు కె.నరసింహనాయుడు, డాక్టర్‌ ‌మధుశేఖర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.