Take a fresh look at your lifestyle.

పండుగల వేళ.. సమ్మెకు బ్రేక్‌ ‌వేయలేకపోయిన సర్కార్‌..!

‌తెలంగాణ ప్రాంత ప్రజలకు పెద్దపండుగలుగా భావించే సద్దుల బతుకమ్మ, దసరా రోజుల్లో ఆర్టీసి కార్మికులు సమ్మె చేపట్టడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారి డిమాండ్లు న్యాయపరమైనవే అయినప్పటికీ స్వరాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అసలే ఐటి ఉద్యోగాల కారణంగా సెలవులు దొరకడమే కష్టంగా ఉన్న పరిస్థితిలో తమ స్వగృహాలకు ఒకరోజు కోసం వచ్చిపోవాలనుకున్న వారికి ఇది తీరని ఆవేదనగా మారుతున్నది. సమ్మె లేని కాలంలోనే బస్సుల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆర్టీసి మొత్తానికే బస్సులను నిలిపివేస్తే సామాన్య ప్రయాణీకుల పరిస్థితి ఏమిటన్నది సమ్మెకారులు ఆలోచించాల్సి ఉందంటు న్నారు. ఈ విషయంలో కార్మికులు ముందస్తు హెచ్చరిక చేసినప్పటికీ ఆర్టీసి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం దానిపై సమగ్ర విచారణ జరిపి కార్మికులను సమ్మెవరకు రానీయకుండా నిరోధించే చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా వారు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఒక వైపు పలు కార్మిక యూనియన్‌లన్నీ కలిసి జాక్‌గా ఏర్పడి గత కొద్దిరోజులుగా యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నప్పటికీ ప్రకటించిన సమ్మె తేదీకి కొన్ని గంటల వ్యవధి వరకు దాన్ని సాగదీస్తున్న ప్రభుత్వ చర్యలను ప్రజలు తప్పుపడుతున్నారు. పైగా కార్మిక సంఘాలను రెచ్చగొట్టే విధంగా ప్రైవేటు బస్సులను నడుపుతామంటూ ప్రకటనలు చేయడాన్ని కూడా పలువురు ఆక్షేపిస్తున్నారు. ఈ విషయంలో గత సమ్మెకాలాల్లో ఏం జరిగిందన్నదాన్ని ఒకసారి ఆర్టీసి యాజమాన్యం పునరాలోచించుకోవాల్సి ఉంది. ఆర్టీసి రూట్లలో ప్రైవేటు బస్సులను నడుపడం ద్వారా ఎలాంటి ప్రమాదాలు జరిగాయన్నది తెలియంది కాదు. స్కూల్‌ ‌బస్సులనే సరిగా నడుపలేకపోతున్నవారు, సరైన శిక్షణలేని ఇతర ప్రైవేటు డ్రైవర్లతో ప్రమాదాలను కొనితెచ్చుకోవడం ఎంతవరకు సమంజసమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమ్మె హెచ్చరికతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నామనుకుంటున్నా కార్మిక సంఘాలు కూడా ఈ విషయాలపై దృష్టిసారించాల్సి ఉంది. ఎవరు పంతానికి పోయినా చివరగా నష్టపోయేది మాత్రం ప్రజలే అన్న విషయాన్ని గ్రహించాల్సి ఉంది. సమ్మెకు ముందు దాదాపు మూడు నెలలుగా యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే తాము చివరి అస్త్రంగా సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘ నాయకులు చెబుతున్నారు. ఇంత కాల వ్యవధిలో జరుపాల్సిన చర్చల పట్ల అటు యాజమాన్యం కాని, ఇటు ప్రభుత్వంగాని జాప్యం చేసి కేవలం ఒకటి రెండు రోజుల ముందు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీని చర్చల కోసం ప్రకటించడమేంటన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. త్రిసభ్య కమిటీతోపాటు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా చర్చల్లో భాగస్వామి కాకపోవడమేంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది కేవలం కాలయాపన కోసం ప్రభుత్వ ఎత్తుగడగా వారు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద సమస్య ముందు పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ఢిల్లీ వెళ్ళడం చూస్తుంటే ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారించే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనిపిస్తోందంటున్నారు కార్మికులు. పైగా సమ్మె చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే డిస్మిస్‌ ‌చేస్తామని, ఎస్మా ప్రయోగిస్తామంటూ యాజమాన్యం బెదిరిస్తున్నదని, తమ డిమాండ్ల సాధన కోసం తాము, దేనికైనా సిద్దంగానే ఉన్నామంటున్న కార్మికుల దృఢ సంకల్పం చూస్తుంటే సమ్మె అనివార్యమే కానుందనిపిస్తున్నది. ఐఏఎస్‌ అధికారల కమిటీ, కార్మిక సంఘాల మధ్య ఇప్పటికే నాలుగుసార్లు చర్చలు జరిగాయి. అయినా సమస్య ఇంకా ఓ కొలిక్కిరాలేదు. గతంలో కూడా కార్మికులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తెచ్చినప్పుడు వాటిల్లో కొన్నిటికైనా పరిష్కారం లభించేది. ఈసారి సుమారు ఇరవై అయిదు డిమాండ్లను అధికారుల ముందు పెట్టినా అందులో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌ ‌విషయంలోనే పీఠముడి పడింది. ఆర్టీసి నష్టాల్లో నడుస్తున్నా కార్మికులు ఉత్సాహంగా పనిచేయాలన్న ఉద్దేశ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారి వేతనాలను పెంచుతూపోయింది. అప్పుడు కార్మికులంతా సిఎం కెసిఆర్‌కు జైజైలు పలికారు. కాని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న నేటి కార్మికుల డిమాండ్‌ ‌నిజంగానే ప్రభుత్వానికి పెద్ద సమస్యగానే మారింది. అసలే నష్టాలతో నడుస్తున్న ఈ సంస్థను ఆర్థికంగా ఎలా ఆదుకోవాలన్న విషయంపైనే రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచిస్తోంది. రాష్ట్ర రాజధానిలో తిరిగే బస్సుల నిర్వహణ బాధ్యతను జిహెచ్‌ఎం‌సికి అప్పగించాలని ఆలోచిస్తున్న తరుణంలో ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలన్న డిమాండ్‌ ‌పిడుగులా మీదపడింది. ఈ విషయంలో ఖచ్చితమైన హామీ ఇచ్చేవరకు తాము సమ్మె విరమించేది లేదంటున్నాయి కార్యిక వర్గాలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో గణనీయమైన పాత్ర పోషించిన తాము ప్రత్యేక రాష్ట్రంలోనైనా బ్రతుకులు బాగుపడుతాయనుకున్నామని, కాని, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదనడానికి తాజా బడ్జెటే నిదర్శనమంటున్నాయి కార్మిక సంఘాలు. నష్టాలు, అప్పులతో రాష్ట్రాన్ని విడకొట్టారంటున్న ఏపిలో ఆర్టీసిని ప్రభుత్వంంలో విలీనం చేసుకుంటే, మన ధనిక రాష్ట్రం మాత్రం ఆ చర్యలు తీసుకోవడానికి వెనుకాడటం ఈ సంస్థ పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని చెప్పకనే చెబుతున్నదంటున్నారు కార్మిక నాయకులు. ఏది ఏమైనా తెలంగాణలో అత్యంత ఉత్సాహంగా జరుపుకునే రెండు అతిపెద్ద పండుగలకు కొద్ది గంటల వ్యవధిమాత్రమే ఉన్నా అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ప్రజాసేవను పట్టించుకునే పరిస్థితిలో లేనట్లు కనిపిస్తున్నది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy