Take a fresh look at your lifestyle.

పంచాయతీల పంచాయితీ ముగిసింది

రాష్ట్రంలో మూడు విడుతలుగా సాగిన పంచాయతీ ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వివిధ కారణలతో ఇంకా కొన్ని పంచాయతీల ఎన్నికలు వాయిదా పడినప్పటికీ మొత్తం మీద షెడ్యూల్‌ ‌సమయంలోపుగా ఎన్నికలు పూర్తి అయినాయి. ఈ సారి జరిగిన ఎన్నికల్లో కొత్త ట్రెండ్‌ ఏమిటంటే అత్యధిక పంచాయతీలు ఏకగ్రీవం కావడం, అది కూడా ఒకే పార్టీ వైపు మొగ్గడం ఈ ఎన్నికల్లో కనిపిస్తున్న కొత్త పరిణామం. పార్టీల ప్రమేయం లే••పోయినప్పటికీ అన్ని రాజకీయపార్టీలు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు తీవ్రతరంగానే చేశాయి. ఈ సందర్భంగా ఘర్షణలు, కొట్టుకోవడాలు, నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం లాంటివి కూడా ఎక్కువగానే జరిగాయి. ఎప్పటిలాగానే వోట్లు గల్లంతు కావడం, విచ్చల విడిగా డబ్బు, మద్యం పంచటం లాంటివి అనేకం చోటుచేసుకున్నాయి. ఓడిన అభ్యర్థులు వోటర్ల దగ్గరకు వెళ్ళి తామిచ్చిన డబ్బులు వసూలు చేయడం, దూషించడం. గోడున విలపించడం సంఘటనలతో ఇంకా గ్రామాల్లో వాడి వేడి వాతావరణం కొనసాగుతోంది. ఓడిన, గెలిచిన అభ్యర్థుల మధ్య వోట్ల తేడా పెద్దగా లేకపోవడం, కొన్ని బ్యాలెట్‌ ‌పేపర్లలో వోటర్లు గుర్తులపై సరిగా ముద్రవేయకపోవడం, లెక్కింపులో తేడాలున్నాయన్న ఆరోపణలు ఇంకా పలు గ్రామాల్లో చోటు చేసుకున్నాయి. మూడు విడుతలుగా సాగిన ఈ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీదే హవా కొనసాగింది. గతంలో ఏ ప్రభుత్వ పాలనలో లేని విధంగా అత్యధిక స్థానాలను టిఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుంది. విచిత్రమేమంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ ఎన్నికలు జరిగాయి. ఈ మొదటి ఎన్నికల్లోనే టిఆర్‌ఎస్‌ ‌ఘనవిజయాన్ని సాధించడం ద్వారా గ్రామీణ ప్రాంతంలో పార్టీ సంస్థాగతంగా బలంగా లేదన్న విమర్శకు తెరపడినట్లు అయింది. మూడు విడుతలు కలిపి 7వేల 731 పంచాయతీలను టిఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకోగా, కాంగ్రెస్‌ ‌పార్టీ 2వేల 698 పంచాయితీలకే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతంలో ఇంకా పట్టు ఉందనుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోయింది. మూడు విడుతలు కలిపి కేవలం రెండు అంకెలు దాటకపోవడం విచిత్ర పరిణామం. మొదటి విడుతలో 31 పంచాయతీలు రాగా, రెండవ విడుతలో 39, మూడవ విడుతలో కేవలం 12 పంచాయతీలనే ఆ పార్టీ గెలుచుకోగలిగింది. ఈ లెక్కన చూస్తే భారతీయ జనతాపార్టీయే గుడ్డిలో మెల్లగా ఉంది. ఆ పార్టీ మూడు విడుతలు కలిపి 163 పంచాయతీలను పట్టుకోగలిగింది. ఇక మొదటినుండి గ్రామీణ ప్రాంత ప్రజలతో మమేకమవుతూ వస్తున్న సిపిఐ, సిపిఎం పార్టీల పరిస్థితి కూడా పెద్ద మెరుగ్గా ఏమీ లేదు. సిపిఐకి మూడు విడుతల్లో 50 పంచాయతీలురాగా, సిపిఎంకు 77 పంచాయతీలు దక్కాయి. ఈ పరిణామం రానున్న ఎన్నికలపై తప్పకుండా పడుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో లోకసభ ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదల కావచ్చని తెలుస్తోంది. మే నెలలోగా ఈ ఎన్నికలు పూర్తికాగానే మున్సిపల్‌, ‌పరిషత్‌ ఎన్నికలు ఒకదానితో ఒకటిగా రానున్నాయి. ఎన్నికల కమిషన్‌ ఇప్పటికే ఈ ఎన్నికలపై కసరత్తు ప్రారంభిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో మండల, ప్రాదేశిక నియోజకవర్గాల హద్దుల్లో కూడా మార్పులు జరిగాయి. అన్ని కొత్తగా హంగులు దిద్దుకుంటున్నాయి. ఏదిమేమైనా టిఆర్‌ఎస్‌ ‌వర్గాల్లో ఇప్పుడున్న ఉత్సాహం ఇలానే కొనసాగితే త్వరలో జరుగబోయే ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ‌పార్టీయే విజయ ఢంకా మోగిస్తుందనుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 16 పార్లమెంటు స్థానాలన్నిటినీ తామే గెలుచుకుంటామని ఆ పార్టీ అధిష్టానం మొదలు నాయకులంతా ఘంటాపథంగా చెప్పడంతో పాటు ఆమేరకు కార్యకర్తలకు, నాయకులకు తగిన సూచనలిస్తున్నారు. ఏది ఏమైన ఫిబ్రవరి రెండు నుంచి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కొత్త పంచాయతీలు మొదలవనున్నాయి. దాదాపు ఆరునెలల విరామం తర్వాత మళ్ళీ గ్రామాల్లో స్వపరిపాలన రెక్కలు తొడుగుతోంది. రాష్ట్రంలో మొత్తంమీద పదివేల అయిదు వందల 72 మంది సర్పంచ్‌లు ఎన్నికకగా, వారిలో 2134 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఏకగ్రీవం అయ్యేందుకు అధికార పార్టీతో పాటుగా వివిధ రాజకీయ పార్టీలుకూడా తమ వంతు కృషి చేశాయి. ఏకగ్రీవం అవుతే తమ శాసనసభ నిధులనుండి ప్రత్యేక నిధులను కేటాయిస్తామని ఇప్పటికే పలువురు శాసనసభ్యులు ప్రకటించారు. వీరంతా ఫిబ్రవరి రెండవ తేదీ నుండి పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. అనంతరం గ్రామాలను తీర్చిదిద్దే విషయంలో వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

error: Content is protected !!