Take a fresh look at your lifestyle.

నేడు సద్దుల బతుకమ్మ

పోయిరా బతుకమ్మ..పోయిరావమ్మాతొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించిన గౌరీదేవిని సాగనంపే రోజు రానేవచ్చింది. అత్యంత వైభవోపేతంగా తమ శక్తికొలది బతుకమ్మను అలంకరించి, మనస్సు నిండా పూజించి, ఉల్లాస భరితంగా పాటలు పాడి అత్తవారింటికి సాగనంపే తంతులో భాగంగా తటాకాల్లో నిమజ్జనం చేసే చివరి రోజు కార్యక్రమాన్ని తెలంగాణ అంతటా మహిళలు మహా వేడుకగా నిర్వహించుకునేరోజిది. స్త్రీలకు సామాజిక జీవితాల్లో ఉండే ఆనందాన్ని తెలియజేసేందుకు వారికోసమే కొన్ని ప్రత్యేక పండుగలు, వేడుకలు నిర్దేశించబడ్డాయి. శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ పూజ, పొలాల అమావాస్య, ఆశ్వయుజ మాసంలో అట్లతదియ, దీపావళి మొదలు బాలికలు నోచుకునే మూగనోము, నాగుల చవితి, సంక్రాంతి సంబరాలు, బొమ్మలకొలువు, బొమ్మల నోములు లాంటివనేకమున్నాయి. అందులో సామూహికంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. మహాలయ అమావాస్య(ఆశ్వయుజ పాడ్యమి) నుండి దుర్గాష్టమి వరకు నిర్వహించే ఈ వేడుకలకు కరువు కాటకాలు, పాలకుల నిరాద•రణ కారణంగా కొంత వివక్షత ఏర్పడినా, తెలంగాణ ఉద్యమకాలం నుండీ బతుకమ్మకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. గత రెండు మూడేళ్ళతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు బాగా పడడంతో తెలంగాణలోని నీటివనరులన్నీ సమృద్ధిగా నిండుకున్నాయి. నీటి సమస్య లేకపోవడంతో ఈసారి పువ్వులన్నీ విరగపూసాయి. బతుకమ్మ అంటేనే ప్రకృతితో ముడివడిన పండుగ. ఏ దైవ సన్నిధిలోనైనా పూలతో ఇష్టదైవాన్ని పూజిస్తారు. కాని, పూలనే పూజించడమన్నది ఈ ఒక్క వేడుకలోనే చూస్తాం. ఈసారి బతుకమ్మను పేర్చేందుకు ప్రధానంగా వినియోగించే తంగేడు, గునుగు సమృద్ధిగా లభించడంతో మహిళల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. గ్రామాలన్నీ పచ్చని పంటపొలాలతో దర్శనమిస్తుండంతో ప్రజల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. వాస్తవంగా జలం, పుష్పాలతో సంబంధమైన పండుగ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఒక్క బతుకమ్మపండుగ మాత్రమే. ఈ రెండూ ప్రకృతితో ముడివడిఉన్నవే. ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటే మనస్సుకు అంత ఆనందాన్నిస్తుంది. అదే ఈ పండుగ విశిష్టత. పూలు కేవలం ఆనందాన్ని సువాసనలను వెదజల్లడమే కాకుండా వీటికి విశిష్టమైన గుణముంది. వీటికి పర్యావరణాన్ని కాపాడే విశేషగుణముంది. చెరువులు తటాకాల్లో నిమజ్జనం చేయడంవల్ల ఆ నీటిని శుద్ధి చేసి శ్రుభ్రపరిచే గుణం ఈ పూలకుంది. అందుకే రంగులద్దని పూలేవైనా నిత్యం వినియోగించుకునే జలాశయాల్లో వేయడాన్ని ఎవరూ కాదనరు.
గౌరీగా, పార్వతీ దేవిగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న బతుకమ్మను సాంప్రదాయాంగా అత్తవారింటికి సాగనంపే చివరి ఘట్టం ఎంతో ఆనందదాయకంగా కనిపిస్తుంది. ‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మ’ అంటూ లయబద్ధంగా పాటలు పాడుతూ అత్తవారింటికి పంపడంలో భాగంగా స్థానిక జలాశయాల్లో నిమజ్జనం చేసే కార్యక్రమం కనులకు విందు చేస్తుంది. స్త్రీలకు మాంగల్యబలాన్ని కలుగజేసి ‘బతుకును కూర్చే అమ్మ’గా పూజలందుకునే బతుకమ్మ కేవలం వేడుకగనే కాకుండా మన సంస్కృతి సంప్రదాయాలను, ఆచారాలను పాటల రూపంలో మహిళలకు తెలియజేసే ఒక పాఠశాలగానే భావించాలి. అందుకే నిమజ్జనం చేస్తూ ‘మా తల్లి పార్వతీ పోయిరావమ్మ- పోయిన చోట బుద్ది కలిగి ఉండు- ఎవరేమన్న ఎదురాడబోకు-’ అంటూ కొత్తగా అత్తవారింటికి వెళ్లే యువతులకు పాటల రూపంలో తెలియజెప్పారు. పూర్వం చిన్నప్పుడే వివాహాలు జరుగుతుండడంతో ఇలాంటి పాటలతో బోధించేవారు. అత్తగారింట్లో అంతా కొత్తదనంతో అమ్మాయిలు దిగాలు పడకుండా ఉండేందుకు వారికి మరోపాట రూపంలో ధైర్యాన్ని చెప్పారు. బతుకమ్మ పండుగ తర్వాత దీపావళి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ‘నేటికి దీపావళి పండుగ పదునాళ్ళున్నదనగా- నాటికే తోలుకు వత్తు, దిగనైనా కానుకలిస్తూ – కాటిక కాయాలిస్తూ – కనకంచు చీరాలిస్తూ అంటూ ఆనాడు మగువలు మురిపెంగా వాడుకునే, దరించే వస్తువులను పుట్టింటికి తీసుకువెళ్ళినప్పుడస్తానని అమ్మాయిని సంతోషపెట్టి ఊరడించే విధానాన్ని కూడా పాటల రూపంలో ఆనాడు మలిచారు. బెంగపెట్టుకున్న అమ్మాయిని తీసుకెళ్ళేందుకు పుట్టింటివారు వచ్చినప్పుడు వారితో వెళ్ళాలంటే పూర్వమైతే ఇంటిల్లిపాది అనుమతి కావల్సిందే. అది కూడా పాటల్లో మనవారు చెప్పారు. అత్త, మామ, బావ ఇలా అందరి అనుమతికోసం అందరిని అడగడం, అందరూ తప్పించుకోవడం చివరకు భర్త అనుమితించడం ఆనాటి వ్యవస్థ, కట్టుబాట్లను తెలియజేస్తుంది. బతుకమ్మపాటల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది ‘ధర్మాంగుడనురాజు…’అన్నపాట. ఈ పాటద్వారా బతుకమ్మ వృత్తాంతాన్నంత రచించిన వాడు వరంగల్‌ ‌జిల్లా మొగిలిచర్ల గ్రామానికి చెందిన భట్టు నరసింహకవి. ఆయన ఒక చందమామ పాటలో దీన్ని రాసినట్లు ప్రముఖ జానపద పరిశోధకుడు కీ.శే. ఆచార్య డాక్టర్‌ ‌బిరుదరాజు రామరాజు తన జానపద గేయాలు అన్న శీర్షికలో రాసాడు. మానవజన్మ ఎత్తినప్పటి నుండి జన్మాంతం వరకు జీవితంలో జరిగే అనేక సంఘటనలు, సన్నివేశాలు, పౌరాణిక ఇతివృత్తాల్లోని నీతిని పల్లె పదాల్లో తెలియచెప్పుతూ, మంచి ‘బతుకును’ ప్రసాదించే దేవతగా ఆరాధిస్తున్నారు కనుకనే ‘బతుకమ్మ’గా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.

– మండువ రవీందర్‌ ‌రావు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy