Take a fresh look at your lifestyle.

నేడు విముక్త జాతుల దినోత్సవం

శాశ్వత పరదేశీల్లా…
స్వాతంత్య్రం ఎరుగని ‘‘విముక్తి’’ జాతులు
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఈ సమాజంలో ఇంకా విముక్తి లభించని జీవులున్నారు. ఊరి చివర పాకలు, ఆధ్యాత్మిక ప్రచారం, సంస్కృతి పరిఢవిల్లిస్తూ ఉన్న ఊళ్లలోనే పరదేశీలుగా బతుకులీడుస్తున్నారు. కట్టు బొట్టు, సాంప్రదాయంతో అనాగరిక వాతావరణంలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ జాతుల్లో కొన్ని కులాలు యాచకం చేస్తుంటే ఇంకొన్ని కులాలు సంస్కృతి సాంప్రదాయాలను ప్రచారం చేస్తుండగా, మరికొన్ని కులాలు సంచార జీవనం సాగిస్తూ చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. సంచార జీవనం సాగిస్తున్న ఈ జాతుల సామూహాన్ని వారి పరిభాషలో పరదేశీ అంటారు. ఆగస్ట్ 31‌వ తేదీన విముక్తి జాతుల దినోత్సవం సందర్భంగా ఈ జాతుల (పరదేశీ) గురించి చర్చ జరుగవలసిన అవసరం ఉన్నది. నేరమయ జీవితం, బానిస బతుకుల ముద్ర పడిన సంచార జాతుల స్థితిగతులపై స్వాతంత్య్రం పూర్వం, అనంతరం అనేక కమిటీలు అధ్యయనం చేశాయి. వీరి బతుకులు మార్చండని నివేదికలూ ఇచ్చాయి. కాని ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ జాతుల నుండి డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌తరహాలో ఎవరూ ముందుకు రాలేదు. భారత దేశ వ్యాప్తంగా సంచార జాతుల్లోని సుమారు 500 సామాజిక కులాలు ఆగస్టు 31వ తేదీ రాగానే ఊపిరి పీల్చుకుంటాయి. 1952 ఆగస్టు 31 కేంద్రం ఆ జాతులను విముక్తి జాతులుగా ప్రకటిస్తూ డీ నోటిఫైడ్‌గా ప్రకటించిన రోజు. ఏళ్లుగా జైళ్లల్లో ఉండి, సంచార, బానిస బతుకుల నుండి విముక్తి చేసినట్టు ప్రకటించిన రోజు అని దేశ వ్యాప్తంగా ఆయా సామాజిక కులాలు కాస్త సంబరంగా ఉంటాయి. కాని చైతన్యం, అవగాహాన లేమి కారణంగా ఎక్కడా వేడుకలు కనిపించవు. ఎందుకంటే విముక్తి జాతులుగా అధికారికంగా ప్రకటించబడ్డా ఆ జాతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి విముక్తి లభించలేదు.
దేశ వ్యాప్తంగా ఉన్న బిసీలు, కుల గణన, జనాభా, రిజర్వేషన్ల మాట అటుంచి కనీసం తినేందుకు తిండి, కట్టుకునేందుకు బట్ట, ఉండడానికి ఇల్లు వంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని దీన జీవులు ఇంకా స్వర్ణోత్సవ భారతంలో ఉన్నారంటే ఏలుతున్న పాలకులు ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్‌ ‌పదాలంటేనే ఎరుగని సంచార జాతుల బిడ్డల సాక్షిగా ఒక్కసారి వారి జీవితాలను అపసోపానం పట్టాలి. అటు రాష్ట్రాలలో, ఇటు కేంద్రంలో సభలలో వారి ప్రాతినిధ్యం లేనందుకే వారి గురించి చర్చ జరుగడం లేదన్నది వాస్తవం. కులాల మధ్య అంతరాలు పోవాలని, సమాజం సమానంగా చూడాలని కోరుకున్నా అటు ప్రభుత్వాలు, ఇటు పార్టీలకు పట్టని అనాథ జాతుల చరిత్ర ఇంకా నేరగాళ్లుగానే చిత్రీకరిస్తుండడం బాధాకరం. సమస్త సబ్బండ కులాలకు సామాజిక న్యాయం కలుగాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కమిషన్లు, కమిటీలు వేసినా ఆయా కమిటీలు నివేదికలు సమర్పించినా కనీస చర్యలు లేకపోవడం ఏలిన నాటి పాలకుల సామాజిక బాద్యతను ఇవాళ గుర్తు చేస్తున్నది. కేంద్రంలో అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, ‌పదిహేనేండ్ల ప్రస్థానంలో ఉన్న బిజెపిలు ఒక్కసారి మననం చేసుకోవాల్సిన సందర్భమిది. భారత రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక స్థానం కల్పించినా ఆ తర్వాత ఎన్నో సవరణలు చేసినప్పటికీ సంచార జాతుల విషయంలో ఎందుకో కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడం ఆ జాతుల పట్ల ఆ ప్రభుత్వాలకు, పార్టీలకున్న వైఖరిని స్పష్టంచేస్తున్నాయి. ఎందుకంటే రాజులు పోయినా రాజ్యాలు పోయినా బ్రిటిష్‌ ‌కాలం నాటి చట్టాలకు ఇంకా బూజు దులుపుకపోవడం ఫలితంగా దశాబ్దాల తరబడి సమాజం సంచార జాతులను నేరగాళ్ల ముద్ర వేస్తూనే ఉంది. నేరగాళ్లుగా పుట్టకపోయినా, ఆ నేపథ్యంలో ఎరుగకపోయినా చేయని తప్పులకు వారిని ఇంకా బలిచేసే సాంప్రదాయం కొనసాగుతుండడం అవమానకరం. కేవలం బిచ్చగాళ్లనే నేరస్థులుగా ఎందుకు చూస్తున్నారనే సూదంటు ప్రశ్నలు సంధిస్తున్నా సూటి సమాధానాలు లేవు. సంచార జాతులపై అనేక అధ్యయనాలు, కమిషన్లు వేసి సానుకూల నివేదికలిచ్చినా ఏ ప్రభుత్వం వీరికి న్యాయం చేయలేదు. ఎందుకంటే వీరికి స్థిర నివాసాలు లేవు..ముఖ్యంగా వోటు బ్యాంకు లేదు. అందుకే ఏ రాజకీయ పార్టీ అంతగా పట్టించుకోవడం లేదన్నది నగ్నసత్యం. ప్రజలకోసం ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాప్రనిధులు చట్టాలు చేసే పరిస్థితి ఉన్నా ఈ సంచార జాతులకు విముక్తి కల్పించలేకపోతున్నారు. ప్రజల దైవంగా బావించే పార్లమెంట్‌లో రాజ్యంగసవరణలు చేసినా ఎందుకో ఏమో గాని సంచార జాతుల అంశం ఇంతవరకు సెకను కూడా చర్చకు రాలేదు. ఏలిన నాటి పాలకులు, ఏలుతున్న పార్టీలు సబ్బండవర్గాల మేలు కోరుతున్నాయా అంటే అదీ లేదు. ఈ సమాజంలో సంచార జాతులం అని సగర్వంగా చెప్పుకునే వీలు లేని ధై•న్య స్థితి ఇవాళ్ల కనపడుతున్నది. బ్రిటిష్‌ ‌పాలనకు ముందు ఆ తర్వాత సంచార జాతుల ఊసే లేదు. ఊసు లేకపోయినా ఆ జాతులను ఉద్దరించలేకపోయినా ఫర్వాలేదు కాని కనీసం జీవించే స్వేఛ్చ పాలకులు హరింపచేస్తున్నారంటే మనం ఎక్కడున్నామని ఒక్కసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది.
1947లో అనంతశయనం అయ్యంగార్‌ ‌చైర్మన్‌గా ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ విచారించి 1950లో తన నివేదిక కూడా సమర్పించింది. పోలీస్‌ ‌రికార్డుల ప్రకారం వీరు 47,32,000 మందిగా ఉన్నారు వారి భార్య/భర్త /పిల్లలు /తల్లి/తండ్రి/బందువులవు/స్నేహితులు కలుపుకుంటే దాదాపు 2 కోట్ల జనాభా. బహుషా ప్రపంచ చరిత్రలో ఏ దైశానికి ఇటువంటి దారుణ పరిస్థితి ఉండకపోవచ్చు. 500 కులాలు జాతులంటే ఆనాటి దేశ జనాభాలో 15 శాతం మందిని మొత్తానికి మొత్తం నేరస్తులుగా చూపడం ఈ జాతుల దురదృష్టం. అయ్యంగార్‌ ‌తన రిపోర్ట్ ‌లో 1871 నుండి 1924 వరకు ఉన్న చట్టాన్ని రద్దు చేయాలని, నేరమయ జీవితం ప్రతిపాదికగా నిర్దారించాలి గాని కులాలు, జాతులు, గుంపులు, కుటుంబాలు వారిగా నిర్ధారించరాదని సూచించారు. దాదాపు 100 సంవత్సరాల వీరికి చాలా అన్యాయం జరిగింది. కాబట్టి వారి స్థిర నివాసానికి, పునరావాసానికి, సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం బడ్జెట్‌ 10‌సంవత్సరాల వరకు కేటాయించి అభివృద్ది పరచాలని సూచించింది. ఈ నేపథ్యంలో 1952 ఆగస్టు 31 కేంద్రం ఆ జాతులను విముక్తి జాతులుగా ప్రకటిస్తూ డీ నోటిఫైడ్‌గా పరిగణిస్తున్నది. అయితే సంచార, అర్ధసంచార జాతులకు విద్యా ఉద్యోగ నియమాకాలలో ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని కమిటి సూచించింది. ఆ తర్వాత వచ్చిన కమిటీలూ సూచించాయి. కాని అధికారంలో ఏ కేంద్ర ప్రభుత్వం ఈ జాతుల పట్ల సానుకూలంగా స్పందించలేదు.
ఆ తర్వాత మారుతున్న క్రమంలో 1936 లో జవహార్‌ ‌లాల్‌ ‌నెహ్రూ నెల్లూరు బహిరంగ సభలో ఈ క్రిమినల్‌ ‌ట్రైబ్‌ ‌యాక్ట్ అనే పధాలు అన్ని గ్రంధాలనుంచి నుండి, పుస్తకాల నుండి తొలగించాలని, ఈ చట్ట పౌరస్వేచ్చను నిషేదించి, సంఘటితం కాకుండా చేసిందని ప్రసంగించారు. అనంతరం పట్టాభి సీతారమయ్య, వెన్నెలకంటి రాఘవయ్య, యంవి సుబ్బారావు, టక్కర్‌ ‌బాపా, కొండా వెంకట సుబ్బయ్య, యంజీ రంగా వెంకటసుబ్బారెడ్డి, పీ. ముత్తు రామలింగం దేవర్‌ ‌తదితర మేధావి, అధికార సభా సంఘాలు, కమిటీలు ఈ చట్టాన్ని రద్దు చేయలని అవిశ్రాంతంగా పోరాడారు. అయితే నోటిఫైడ్‌ అయిన కులాలను డినోటీఫైడ్‌ ‌గా పరిగణిస్తూ వారితో పాటు సంచార అర్దసంచార జాతులను కుడా కలిపి డీఎన్‌ ‌టీ,ఎన్‌ ‌టీ,ఎస్‌ఎస్‌ ‌టీ లో ఉన్న సర్టీఫికేట్‌ ‌ను ఇచ్చి విద్యలో అవకాశం కల్పిస్తూ ట్రైబల్‌ ‌వెల్ఫేర్‌ ‌నుండి బడ్జెట్‌ ఇచ్చారు. కొంత కాలం తరువాత ఎస్‌ ‌టీలు తమ బడ్జెట్‌ ‌ను డీఎన్‌ ‌టీలకు, ఎన్‌ ‌టీలకు, ఎస్‌ఎస్‌ ‌టీలకు ఎలా కేటాయిస్తారు అని రాజ్యాంగంలో ఎస్సీ,ఎస్టీల గురించి ఉంది. కాని డిఎన్‌ ‌టీల గురించి లేదు అని ఆందోళనలు చేయడం ప్రారంభించారు.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 1953లో బీసీకులాల అధ్యయనానికి కాకకాలెల్కర్‌ ‌కమిషన్‌ ‌వేసింది. ఈ క్రిమినల్‌ ‌ట్రైబ్స్ ‌యాక్ట్ ‌లోని కులాలను క్రిమినల్‌ ‌ట్రైబ్స్ అనిగాని ట్రైబ్స్ అనిగాని క్రిమినల్‌ అనిగాని యాక్ట్ ‌క్రిమినల్‌ అనిగాని పిలువరాదు అని సూచనలు చేసింది. ఈ కమిషన్‌ ‌రిపోర్ట్ ‌బుట్టదాఖలయింది. నేషనల్‌ అడ్వైజర్‌, ‌కౌన్సిల్‌, ఈడీఎన్‌టీ, ఎన్‌టీ, పీఎస్‌ ఎన్‌టీ, అభివృద్ధి గురించి ఎన్నో సుచనలు చేసినా వాటిని అమలు చేయలేదు. 1965లో బీఎన్‌ ‌లోకూర్‌ ‌కమిటీ ఎస్సీ,ఎస్టీ కులాలపై పునఃసమీక్ష చేసింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈడీఎన్‌ ‌టీ, ఎన్‌టీఎస్‌ ఎన్‌టీ కులాలను ఎస్సీఎస్టీ బీసీ జాబితాలో కలపడం వలన ఆయా తరగతులకు కేటాయించిన సంక్షేమ పథ•కాలను వీరు అందుకోలేక పోతున్నారని కాబట్టి వీరిని ఆయా జాబితాల నుంచి తీసి ప్రత్యేక జాబితాగా పరిగణించి రిజర్వేషన్‌ ‌కల్పించాలని సూచనలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక కమిషన్లు వేసుకుని ఈ సమస్యలకు పరిష్కారం చేసుకొమ్మని సలహా ఇవ్వగా ఆంద్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం 1968లో అనంతరామన్‌ ‌కమిషన్‌ ఏర్పాటు వేసింది. గతంలో ఉన్న ఈడీఎన్‌ ‌టీ, ఎన్‌ ‌టీ, ఎస్‌, ఎన్‌టీ కులాల సర్టిపికేట్లు రద్దు చేసి కొందరొని బీసీలో కలిపి ఏబీసిడీలుగా వర్గీకరించి విముక్త జాతులు, ఆదిమ జాతులు, సంచార, అర్ధసంచార జాతులను బీసీలో చేర్చారు. కొన్ని అభివృద్ధి చెందిన కులాలు బీసీఏలో చేరడం వల్ల ఈ సంచారజాతులు బీసీఏకు ఏర్పాటు చేసిన ఫలాలను అందుకోలేకపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీలో చేరిన వారికి వర్గీకరణ లేకపోవడం వల్ల అభివృద్ది ఫలాలు అందడంలేదు. 1980లో కేంద్ర ప్రభుత్వం బీసీ మండల్‌ ‌కమిషన్‌ ‌వేసింది. ఈ కమిషన్‌ ‌రిపోర్ట్ ‌పై 1993 నుండి కేంద్రప్రభుత్వ ఉద్యోగాలల్లో 27 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించడం జరిగింది. కాని వర్గీకరణ లేకపోవడం వల్ల ఈ రిజర్వేషన్‌ ‌ను అందుకోలేకపోతున్నారు. స్థానిక సంస్థలల్లో 33 శాతం రిజర్వేషన్‌ ఉన్నాగానీ వర్గీకరణ లేకపోవడం వలన ఈ ఫలాలను కూడా అందుకోలేక పోతున్నారు. జస్టిస్‌ ‌వెంకటాచలయ్య జాతీయ కమిషన్‌ను 2002లో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయగా ఈ కమిషన్‌ ‌డీఎన్‌టీ, ఎన్‌టీ, ఎస్‌, ఎన్‌టీలపై అధ్యయనానికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. 2006లో కేంద్ర ప్రభుత్వం బాలక్రిష్ణ రేణుకే కమిషన్‌ ‌వేసింది. 2008లో తన రిపోర్ట్ ‌కూడా ఇచ్చింది. రేణకే కమిషన్‌ 72 ‌ప్రతిపాదనలు చేసినా దాన్నీ పార్లమెంట్‌లో చర్చకు కూడా పెట్టకుండా అటకెక్కించారు. ఆ తర్వాత బిజెపి సర్కారు హాయాంలో వేసిన బిక్కురామ్‌ ఇదాటే కమిషన్‌ ‌తన నివేదిక సమర్పించినా ఎలాంటి చర్యలు లేకపోవడం దురదృష్టకరం.
ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే…సంచార జాతులు ఇప్పుడు సంఘర్షణలో పడాల్సిన పరిస్థితి. సమాజంలో అన్నార్థులు, అనాథ•లుగా మిగిలిపోతున్న ఈ జాతుల అభివృద్ధి ఓ మిథ్యగా మారుతున్నది. ఆంధ్రా తెలంగాణ కలిసున్నప్పుడు తెలంగాణపై ఎంత వివక్షత కనబరిచారో తెలంగాణ అభివృద్ధి ఎంత వెనుకబాటుకు గురైందో ఇప్పుడు ఎంబిసీల పేరుతో వేసిన కార్పొరేషన్‌ ‌ద్వారా కూడా సంచార జాతులు అంతే వివక్షకు లోనయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లు, కుల విభజన జాబితా చూసిన డీ నోటిఫైడ్‌ ‌ట్రైబ్స్‌కు చట్టబద్దమైన గుర్తింపు ఉన్నది. సంచార జాతులకు ఆ మేరకు గుర్తింపూ ఉంది. కాని కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఏరికోరి ఎన్నుకున్న ప్రభుత్వంలో సంచార జాతులకు సమన్యాయం జరుగుతుందని ఆ జాతులు ఆశపడ్డాయి. ఇందుకు కారణం కూడా ఉంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక చైతన్యలేమితో పాటు ఈ జాతుల్లో కులాలకు ఎక్కడా ప్రాధాన్యత లేదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న ప్రతి సందర్భంలో, సభలలో సంచార జాతులే ముందుండి ప్రదర్శనలు నిర్వహించాయి. అందుకే 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి సంచార జాతులకు న్యాయం చేస్తామని తన మ్యానిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నది. సంచార జాతుల సమస్యలను ఆలకిస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌కూడా పేర్కొన్నారు. దీంతో ఆ జాతులు తెగ సంబరపడిపోతున్న సందర్భంలోనే ఎంబిసి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసి కొత్తగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో అత్యంత వెనుకబడిన కులాలు హర్షం వెలిబుచ్చాయి. కాని ఎంబిసీ వల్ల సంచార జాతులకు ఏ ప్రయోజనం జరుగదని విస్పష్టమవుతున్నది. ఇంతకీ ఎంబిసీలో ఎన్ని కులాలున్నాయి. ఏ ప్రాతిపదికన కులాలను విభజిస్తారు….ఆ విభజన ప్రక్రియ బిసీ కమిషన్‌కు చేరినా సదరు కమిషన్‌ ‌వద్ద కూడా సరైన మార్గదర్శకాలు లేకపోవడం ఇత్యాది గందరగోళ అంశాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.
ఎంబిసీలకు, సంచార జాతులకు అన్ని అంశాలలో తేడా ఉంటుంది. ఆర్థిక, సామాజిక, రాజకీయ వెనుకబాటు విషయాలలో సంచార జాతులు నాగరిక ప్రపంచానికే దూరంగా ఉంటున్న కులాలున్నాయి. ఎంబిసిలకు వృత్తి ఉంటుంది…సంచార జాతులకు వృత్తి ఉండదు. సంచార జాతుల సంస్కృతి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఎంబిసిల కన్నా వైవిధ్యభరితంగా ఉంటాయి. ఎంబిసిలు గ్రామాల్లో ఉంటారు….సంచార జాతులు ఊరి బయట గుడారం వేసుకుని ఉంటారు. నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ కేవలం యాచక, ఇతరత్రా పొట్టపోసుకునే చిరు వృత్తులపై ఆధారపడుతుంటారు. కులాల ప్రాతిపదినక ఎక్కువ సంఖ్యలో వీరు బిసీ-ఏలో ఉన్నప్పటికీ ఏ న్యాయం జరుగలేదు. సంచార జాతుల్లోని దాదాపు 50 కి పైగా కులాల్లో కనీస విద్య లేదు. 70కి పైగా కులాల్లోని వారికి పక్కా ఇళ్లు లేవు. ఆధార్‌ ‌కార్డులు, వోటర్‌ ‌కార్డులు లేవు. తెలంగాణ రాష్ట్రంలో వైవిధ్యభరితంగా సాగుతున్న వారి జీవన ప్రమాణాలపై సమగ్ర అధ్యయనం జరుగాల్సిన అవసరం ఉన్నది. అందుకే తాత్కాలికంగా ఆర్థిక ఫెడరేషన్లు, లెక్కల చిట్టా పద్దులు కాకుండా బిసీ కమిషన్‌ ‌తరహాలో సంచార జాతుల కమిషన్‌ ‌వేస్తే ఆ జాతులకు గుర్తింపు ఉండడంతో ఆ జాతుల స్థితిగతులపై అధ్యయనం చేసే అవకాశముంటుంది. బిసి కమిషన్‌ ‌తరహాలో సంచార జాతులకు ప్రత్యేక కమిషన్‌ ‌లేదా కార్పొరేషన్‌ ‌వేయడం ద్వారా ఆ జాతులను ప్రభుత్వం గుర్తించినట్టవుతుంది. ఆ జాతుల జీవన స్థితిగతులపై అధ్యయనం జరిపే వీలుంటుంది. ముఖ్యంగా కొన్ని కులాలు ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేరాలనుకుంటున్నాయి కాబట్టి వాటి సామాజిక, ఆర్థిక కోణాలను పునపరిశీలించి ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వ పథకాల ప్రయోగశాలగా పేరున్న తెలంగాణ ప్రభుత్వం సంచార జాతుల కోసం ఓ ప్రత్యేక కార్పోరేషన్‌ ‌నియమిస్తే దాదాపు వందకు పైగా కులాలను ఒక చోట చేరదీసినట్లవుతుంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రాష్ట్ర అసెంబ్లీలో సంచార జాతుల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేయాల్సిన అవసరం ఉన్నది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌ ‌తదితర రాష్ట్రాలలో సంచార జాతులకు 11 శాతం రిజర్వేషన్లు కూడా అమలు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకుని పార్లమెంట్‌పై ఒత్తిడి పెంచింతే సబ్బండ సంచార జాతుల కులాలు ఆ ప్రభుత్వం వైపు ఉండే అవకాశం ఉన్నది.
గుంటిపల్లి వెంకట్‌,
‌సీనియర్‌ ‌జర్నలిస్ట్
‌సంచార జాతుల సంఘం జాతీయ కన్వీనర్‌
‌సెల్‌ :9494941001

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy