వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేడు రాజ్యసభకు పౌరసత్వ సవరణ బిల్లు

December 10, 2019

ఆమోదం పొందుతుందని బీజేపీ ధీమా
123 సభ్యుల మద్దతుకై ప్రయత్నాలు
బిల్లుకు మద్దతివ్వం..బిజెపికి శివసేన ఝలక్‌
వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు(2019)కు లోక్‌సభ ఆమోద ముద్ర వేయడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సమాయత్త మవుతోంది. రాజ్యసభలో ఈ బిల్లును బుధవారం ప్రవేశపెట్టనుంది. పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, ‌బంగ్లాదేశ్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొనే ముస్లిమేతరలు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటే ఆమోదించడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ మూడు దేశాలకు చెందిన హిందవులు, కైస్త్రవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఈ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన ట్రావెల్‌ ‌డాక్యుమెంట్లు, ఇతర పత్రాలు లేకపోయినా వీరు 2014 డిసెంబర్‌ 31‌లేదా అంతకు ముందు భారత్‌కు వొచ్చి ఉండాలి. బిల్లుపై సోమవారం లోక్‌సభలో సుమారు 12 గంటల పాటు వాదోపవాదాలు, విమర్శలు, ఆరోపణలతో జరిగిన చర్చానంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత వోటింగ్‌ ‌చేపట్టారు. బిల్లుకు అనుకూలంగా 311 వోట్లు పడగా, వ్యతిరేకంగా 80 మంది వోటేశారు. దీంతో బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది. కాగా ఈ బిల్లు రాజ్యసభలో సైతం ఆమోదం పొండాల్సి ఉంటుంది. బిల్లుకు ఆమోదం లభించాలంటే 245 మంది సభ్యుల రాజ్యసభలో కనీసం 123మంది సభ్యులు మద్దతివ్వాల్సిఉంటుంది. అయితే రాజ్యసభలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కన్పిస్తోంది. ఆర్టికల్‌ 370 ‌రద్దు మాదిరిగానే.. ఇప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల మద్దతుతో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసుకోవాలని భాజపా యోచనలో ఉంది.
ఎగువ సభలోనూ ఆమోదం పొందుతుంది : జీవీఎల్‌ ‌నరసింహారావు
దేశ ప్రజల హితం కోసం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు పెద్దల సభలోనూ ఆమోదం పొందుతుందని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ ‌నరసింహారావు విశ్వాసం వ్యక్తం చేశారు. పలు ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతిస్తున్నాయని తెలిపారు. అయితే కొన్ని పార్టీలు స్థానికంగా తమ వోటు బ్యాంకును కాపాడుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం బిల్లును వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చే ప్రతి బిల్లును కాంగ్రెస్‌ ‌వ్యతిరేకిస్తూనే ఉందని జీవీఎల్‌ ఆరోపించారు.
మద్దతివ్వం..బీజేపీకి శివసేన ఝలక్‌
‌మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి ఝలక్‌ ఇచ్చిన శివసేన మరోసారి రాజ్యసభలోనూ ఝలక్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఏడు గంటలపాటు సాగిన చర్చల అనంతరం సోమవారం అర్ధరాత్రి ఈ బిల్లుకు
లోక్‌ ‌సభ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్‌, అప్ఘానిస్థాన్‌, ‌బంగ్లాదేశ్‌లలో మతపరమైన దాడులకు గురై భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులను ఆదుకునేందుకే ఈ బిల్లుకు రూపకల్పన చేశామని అమిత్‌ ‌షా స్పష్టం చేశారు. బిల్లు పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పౌరసత్వ సవరణ బిల్లును భారత రాజ్యాంగంపై దాడిగా అభివర్ణిస్తూ.. రాహుల్‌ ‌ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును సమర్థిస్తున్న వారు భారత మూలాలను నాశనంచేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు శివసేనపైనా పరోక్షంగా రాహుల్‌ ‌విమర్శలు గుప్పించారు. కాకపోతే.. కొత్తగా పౌరసత్వం ఇచ్చిన వారికి 25 ఏళ్ల వరకు వోటు వేసే హక్కు ఇవ్వొద్దని డిమాండ్‌ ‌చేసింది. ఈ బిల్లు విషయమై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ‌థాక్రే స్పందిస్తూ.. పూర్తి స్పష్టత వచ్చే వరకు, అనుమానాలను నివృత్తి చేసేంత వరకు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వమని చెప్పడం గమనార్హం. తమ డిమాండ్లకు ఓకే చెబితేనే బిల్లుకు మద్దతిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు లోక్‌ ‌సభలో ఈ బిల్లుకు అనుకూలంగా వోటేశాం కానీ.. బుధవారం రాజ్యసభలో మాత్రం వ్యతిరేకంగా వోటేస్తామని శివసేన నేత సంజయ్‌ ‌రౌత్‌ ‌సంకేతాలిచ్చారు. దీంతో రాజ్యసభలో పౌరసత్వ బిల్లు ఆమోదంపై నీలినీడలు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది.