Take a fresh look at your lifestyle.

నేడు ప్రపంచ జంతువుల దినోత్సవం

తన జాతిని తానే నాశనం చేస్తున్న మానవుడుమన దైనందిన జీవితంలో జంతువులు ఒక బాగం. మనం వాటిపైన ఆధారపడి ఉన్నాము. భూమి మీద మనుషులతో పాటు ఎన్నో రకాల జీవాలు ఉన్నాయి. అంతెందుకు మానవుడు కూడా జంతువర్గానికి చెందినవాడే. కానీ ఆ విషయాన్ని మరిచి పోయిన తెలివైన జంతువైన మానవుడు తోటి జీవ జాతిని నాశనం చేస్తున్నాడు. దీనివలన పర్యావరణంలో సమతుల్యత దెబ్బ తింటున్నది. పర్యావరణ పరిరక్షకుడిగా పేరుగాంచిన ‘సెయింట్‌ ‌ఫ్రాన్సిస్‌ ఆఫ్‌ అసిసి’’ జ్ణాపకార్థం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 4‌వ తేదీన ప్రపంచ జంతు దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. మానవుడికి, జంతువులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ దినోత్సవం తెలియజేస్తుంది. ఈ రోజున జంతు సంక్షేమ ప్రచారాలతోపాటు జంతు పరిరక్షక శిబిరాలను, ప్రారంభించడం, జంతు సంరక్షణకు నిధులు సేకరించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటికే కొన్ని జంతు జాతులు కనుమరుగై పోయాయి. వాస్తవానికి మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని సైన్స్ ‌చెబుతోంది. అయితే భూమి ఆవిర్భవించిన తరవాత పుట్టిన చాలా జంతు జాతులు ఇప్పుడు లేవు. దానికి ప్రధాన కారణం మాత్రం మానవుని కార్యక్రమాలే. కొన్ని మాత్రం ప్రకృతి నిర్ణయం. రోజురోజుకు పెరుగుతున్న మన అవసరాలు, అవసరానికి మించిన వనరుల వాడకం ఇవన్నీ వన్య ప్రాణుల మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇది చివరికి కొన్ని జాతులు పూర్తిగా అంతరించే స్థాయికి తీసుకువచ్చింది. జాతులు ఇట్లా అంతరించిపోతూ ఉండడం అణు యుద్ధంతో వచ్చే నష్టంతో సమానం. ఒకసారి ఒక జాతి అంతరించి పోయింది అంటే ఎట్టి పరిస్థితులలో అట్లాంటి జాతిని పుట్టించడం అసాధ్యం. జాతులు అంతరించి పోవడానికి కారణాల్లో ముఖ్యమైంది వ్యాపారం కోసం, తినడానికి జంతువుల్ని వేటాడి చంపడం, అలంకరణ వస్తువుల కొరకు, ఇట్లా మన అవసరాలకి ఇష్టం వచ్చినట్లు చంపేస్తే అరుదైన జాతులు ఎప్పటికీ కనబడకుండా పోతాయి. ఏనుగుల్ని దంతాల కోసం వేటాడటం, సింహాలు, పులులను, పాములను చర్మం కోసం చంపేయడంతో వాటి సంఖ్య రోజురోజుకి తగ్గుతోంది. డోడో పక్షిని మాంసం కోసం విపరీతంగా చంపడంతో ఆ పక్షి జాతి పూర్తిగా అంతరించి పోయింది. మన పద్ధతులు, మన అలవాట్లు ఆలోచనలు, ఇలాగే ఉంటే ఈ రోజు మన చుట్టూ కనపడే జంతువులు, మొక్కలు కూడా కనబడకుండా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఆలోచనలో మార్పు రావాలి. జంతువులు లేనిదే ప్రకృతి లేదు. ప్రకృతి లేనిదే మానవుడు లేడు. కొన్ని జంతువులను పక్షులను పవిత్రమైనవిగా భావించి ఆరాధించడం మన సంప్రదాయం. మనతోపాటు భూమి మీద ఒకే కణం ఉన్న అమీబా నుంచి అతి పెద్ద శరీరం ఉన్న తిమింగలం వరకు రక రకాల జంతువులు, పక్షులు, పాములు, జంతువులు, ఎన్నో వేల జాతులు బతుకుతున్నాయి. ఇవన్నీ ప్రకృతిలో ఉంటేనే ప్రకృతి సమతుల్యత, జీవ వైవిద్యం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వాటిని వేరే ఏ జాతి కూడా భర్తి చేయలేదు. రకరకాల రంగులలో ఎన్నో లక్షల జాతులు మనతోపాటు బ్రతుకుతున్నాయి. ఇది ఒక అద్భుత ప్రపంచం. వాటి ఆవాస ప్రాంతాలకు, జీవనానికి భంగం వాటిల్లకుండా చూడాలి. అప్పుడే అది తన జాతిని పెంచుకోగలుగుతుంది. లేకపోతే మనం చేసే పనుల వల్ల అరుదైన జాతులు కూడా అతి కొద్ది కాలంలోనే అంతరించి పోయే ప్రమాదం ఉంది.
జంతు సంరక్షణ పరిశోధన మరియు చైతన్యాన్ని కలిగించడంతో పాటు జంతువులకు సంబంధించిన వివిధ రకాల సమాచారం ప్రజలకు తెలియజేయడం కొరకు, జంతుప్రదర్శనశాలలు ఏర్పాటు చేయబడినాయి. చాలా సందర్భాలలో కొన్ని రకాల జంతువులను వాటి సహజ వాతావరణంలో చూడటం ప్రమాదం కాబట్టి ప్రభుత్వం అటువంటి చర్యలను నిషేధించింది. మరికొన్ని సందర్భాలలో కొన్ని రకాల జంతువులు మన రాష్ట్రం లేదా మన దేశంలో ఉండకపోవచ్చు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే జంతువులను మనం జంతు ప్రదర్శనశాలలో మాత్రమే చూడవచ్చు. అయితే మనలో చాలామంది ముఖ్యంగా పిల్లలు జంతు ప్రదర్శనశాలను కాలక్షేపం, వినోదం, మరియు వేడుకగా భావిస్తున్నారు.
మన సంతోషం కోసం జంతుజాలాన్ని బంధించి ఉంచడం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం నేరం. జంతు ప్రదర్శనశాలలో జరుగుతున్న విషయం ఇందుకు భిన్నంగా లేనప్పటికీ అక్కడి ఉద్దేశ్యం ప్రదర్శించడం మాత్రం కాదు. అందువల్ల వాటిని జంతు సంరక్షణ శాలగా గుర్తింపు ఇవ్వవలసిన అవసరం ఉంది. మనం ఏదైనా జంతుప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణాన్ని ఆటంక పరచకాకూడదు. మనం తినే, పారవేసే ప్లాస్టిక్‌ ‌కవర్లు, గ్లాసులు, తప్పనిసరిగా ఏదో ఒక చెత్త డబ్బాలో మాత్రమే వేయాలి. జంతువులను దూరంగా ఉండి చూడాలే తప్ప వాటిని తాకడం, లాగడం, గేలి చేయడం వంటి పనులు చేయరాదు. క్రూరజంతువులకు దూరంగా ఉండడం మంచిది. జంతుశాలలోనే కాకుండా జంతువుల కాపాడడానికి మన ఊరు కూడా అనువైనదే. మన ఊరు చుట్టుపక్కల ఉన్న పంట పోలాల్లో తిరుగాడే పక్షులు, కుందేళ్లు, కప్పలు, పాములు, ఉడతలు, తొండలు, మొదలైన వాటిని చంపకుండా కాపాడుకోవడం మన అందరి బాధ్యత.
వన్యప్రాణి సంరక్షణకు 1972లో మనం ఒక చట్టం తయారు చేసుకున్నాం. ఇదే ‘వైల్డ్ ‌లైఫ్‌ ‌ప్రొటెక్షన్‌ ‌యాక్ట్ 1972’’ ఈ ‌చట్టం ప్రకారం వన్యప్రాణులు అంటే ప్రతి జంతువు, తేనెటీగలు, సీతాకోకచిలుకలు, చేపలు, నేల మీద పెరిగే రకరకాల మొక్కలు. జనభా పెరిగిపోవడం, ఇండ్లు పెరగడంతో ఈ వన్యప్రాణులు బతికే లేక అడవి తగ్గి రోజురోజుకు జంతువులు తగ్గిపోతున్నాయి. అంతేకాకుండా జంతువుల చర్మాలు. దంతాలు, అలంకరణ వస్తువులు, ఇతర శరీర భాగాల కోసం పనిగట్టుకొని జంతువులను నాశనం చేస్తున్నాం. ప్రతి రోజు పాఠశాలలో విద్యార్థులు చేసే ప్రతిజ్ణలో కూడా జంతువుల యందు దయ కలిగి ఉంటాను’’ అనే వాఖ్యాన్ని చేర్చడం జరిగింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టాలు ఉన్నప్పటికీ కేవలం ప్రభుత్వం ఒక్కటే ఈ పని చేయాలంటే సాధ్యం కాదు. సహజ పర్యావరణ అడవులు, సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, చుట్టూ ఉన్న పక్షులు, జంతువులు, చెట్లు, వీటి పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి బాధ్యత అని మన రాజ్యాంగంలో ఆర్టికల్‌ 51(ఎ) (‌జి)లో ఉంది. దీని ప్రకారం ఎవరైనా వన్య ప్రాణులకు హాని కలిగిస్తున్నారని తెలిస్తే ఫిర్యాదు చేసి రక్షించుకోవడానికి వీలవుతుంది ఇలా ఫిర్యాదు చేయడం మన బాధ్యత.
వాస్తవానికి మానవుడు జంతువుల ఆవాసాలైన గుట్టలు అడవులు నాశనం చేస్తున్నాం. విచక్షణారహితంగా అడవులు నరుకుతూ వాటి ఆవాసాలను, మంచినీటి వనరులను ధ్వంసం చేస్తున్నాం. వాటి నివాసాలు కోల్పోయి ఆహారం దొరకక రక్షణ లేక అడవి జంతువులు గ్రామాల్లొకీ, పట్టణాల్లోకి వస్తున్నాయి. ఆహారం కోసం మనుషులపై దాడులు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని మార్చడం కూడా ఈ జంతు దినోత్సవం లక్ష్యాల్లో ఒకటి. జంతువులకు సహజసిద్ధమైన ఆవాసాలను కల్పించడం, జంతు జాతులను రక్షించడం, వాటి సంక్షేమాన్ని కాపాడటం ఇవే ప్రధానం. ఈ రోజును జంతు ప్రేమికుల దినోత్సవంగా కూడా పిలుస్తారు.

నెరుపటి ఆనంద్‌
ఉపాధాయులు
టేకుర్తి
9989048428

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy