వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేడు జాతీయ చేనేత దినోత్సవం

August 6, 2019

చేనేతల బతుకులు బాగుపడేదెట్లా!వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధికులకు జీవనోపాధి కల్పిస్తున్న చేనేత భారతదేశంలోని అతిపెద్ద కుటీర పరిశ్రమగా వెలుగొందుతున్నది. దేశంలో కోటి 80 లక్షల మందికి ఈ రంగం ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నది. పరోక్షంగా మరో 9 కోట్ల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. దేశంలో తయారవుతున్న వస్త్రాల్లో చేనేత వాటా 28 శాతం.
మానవ పరిణామక్రమాన్ని పరిశీలిస్తే మానవుడు ఆదిమ కాలంలో చెట్ల యొక్క ఆకులను, బెరడులను అచ్ఛాదనములుగా తన శరీరాన్ని కప్పుకోవడానికి వాడుకొనేవాడు. ఆ తర్వాత నారను బట్టలుగా చేసుకుని చుట్టుకున్నారు. పక్షుల గూళ్ళ అల్లికల నుండి ఆదిమకాలంలో మానవుడు చేతితో వస్త్రాల తయారీకి, రూపకల్పనకు నాందీ పలికాడు. నూలు వడకడం, చక్రం కనిపెట్టడం ద్వారా చెక్క చట్రాలతో వస్త్రాలను నేయడం ప్రారంభించాడు. ఆ తదనంతరం మగ్గం వాడుకలోకి వచ్చి, రుగ్వేద కాలంలో కులవృత్తులు ఏర్పడ్డాయి. మలివేద కాలంలో కులవృత్తిగా చేనేత జీవం పోసుకుంది. నూలును మగ్గంపై అల్లుతూ వస్త్రం తయారు చేస్తారు. రాట్నం దారాన్ని క్రమ పద్ధతిలో మగ్గానికి అందించు సాధనం. చేనేత వస్త్రం తయారీ విధానములో పత్తిలో గల గింజలను తొలగించుట, ప్రత్తిలో గల మలినాలను చేప దంతముల ద్వారా శుభ్రం చేసి ఏకుట, స్థూపాకారంగా చుట్టుట, రాట్నం ఉపయోగించి ప్రత్తినుండి దారం తీయుట, పడుగుపేకలపై గట్టిదనం తెచ్చి సరిచేసి తదుపరి మగ్గంతో వస్త్రం నేయుట, వస్త్రము తయాగరుట లాంటి కొన్ని ముఖ్యమైన ప్రక్రియలు చేనేతలో ఉంటాయి. చేతితో ఒక చెక్కచట్రంపై నేయబడే వస్త్రాలను చేనేత వస్త్రాలు అంటారు.
•్ర ప్రాచీన కాలం నుండి 17 శతాబ్దం వరకు ప్రపంచానికి ముఖ్యంగా యూరప్‌ ‌దేశాలకు చేనేత వస్త్రాల ఎగుమతిలో భారతదేశం కీలక పాత్ర పోషించి ఆదాయాన్ని గడించింది. యూరప్‌కు భారతదేశానికి ప్రాచీన కాలం నుండి ఉన్నటువంటి భూమార్గం కాన్‌స్టాంటినోపిల్‌ ఆ‌క్రమణతో మూతపడడంతో యూరప్‌ ‌సుగంధద్రవ్యాలు మరియు వస్త్రాల విషయంలో సంక్షోభం నుండి యూరప్‌ ‌దేశాలు బయటపడడం కోసం యుద్ధప్రాతిపదికన భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి ప్రయత్నించాయంటే నాడు చేనేత వస్త్ర ఉత్పత్తిలో ప్రపంచ సమాజంలో భారతదేశం యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు.
పురాతన కాలం నుండే, భారతీయ చేనేత ఉత్పత్తుల అధిక నాణ్యత, మస్లిన్‌ ఆఫ్‌ ‌చందేరి, వారణాసి యొక్క సిల్క్ ‌బ్రోకేడ్లు, రాజస్థాన్‌ ‌మరియు ఒరిస్సా యొక్క టై మరియు డై ఉత్పత్తులు, మచ్లిపట్నం చింతాస్‌, ‌హైదరాబాద్‌ ‌హిరూస్‌, ‌పంజాబ్‌ ‌ఖేస్‌, ‌ప్రింట్లు ఫరూఖాబాద్‌, ‌ఫెనెక్‌ ‌మరియు టోంగం మరియు అస్సాం మరియు మణిపూర్‌ ‌బాటిల్‌ ‌డిజైన్లు, మధ్యప్రదేశ్‌ ‌మహేశ్వరి చీరలు మరియు బరోడా పటోలా చీరలు ప్రసిద్ధి చెందాయి. పాల్కురికి సోమన తన పండితారాధ్యచరిత్రలో 50 రకాలైన వస్త్రాలను ప్రస్తావించాడు. కుతుబ్‌షాహీ, నిజాం కాలంలో కూడా తెలంగాణలో నేత పరిశ్రమ విస్తరించింది.

చేనేత రంగానికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. భారతీయుల జీవితంతో పెనువేసుకొని భారతీయుల సంస్కృతికి అది అద్దం పడుతుంది. భారతీయ చేనేత కళాకారుల సృజన అద్భుతమైనది. వస్త్రాలు నేయడంలో వారి ప్రతిభ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరను నేసిన ఘనత భారత చేనేత కళాకారులది. జాతిపిత గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రాట్నం మన స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన భూమిక పోషించింది.
స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది. అందుకే 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్‌ ‌హాల్‌లో మొట్టమొదటగా స్వదేశీ ఉద్యమానికి అంకురార్పణ రోజును‘జాతీయ చేనేత దినోత్సవం’గా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చేనేత వస్త్రాలలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చిటికి, గద్వాల్‌, ‌నారాయణ్‌పేట, వరంగల్‌, ‌గొల్లభామ నేతలే కాక తేలియా, హిమ్రూ, మశ్రు తదితర నేత రకాలకు కూడా ప్రసిద్ధి. గద్వాల ఒక రకమైన నేతకు ప్రసిద్ధి. అట్లాగే పోచంపల్లి వెరైటీగా ప్రసిద్ధి చెందిన చిటికి/టై అండ్‌ ‌డై/ఇక్కత్‌ ‌చేనేత ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది. పోచంపల్లిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన నేతగాడు చిలువేరు రామలింగం. కుట్టులేకుండా ఆయన మూడు కొంగుల చీర నేసిన ప్రతిభావంతుడు. ఊళ్లో ఉత్సవాల సమయంలో అప్పటికప్పుడే చీరనేసి అమ్మవారికి సమర్పించిన సృజనశీలి. ఆ నేతన్న నైపుణ్యానికి ఆశ్చర్యపోయిన ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ‌స్విట్జర్‌లాండ్‌ ‌దేశస్తులు పోచంపల్లి ఇక్కత్‌పై అధ్యయనం చేశారు. తెలంగాణలో వేల కుటుంబాలు చేనేతపై ఆధారపడి బతుకుతున్నాయి. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ‌ఖమ్మం జిల్లాల్లో మిణుకు మిణుకుమంటున్న చేనేత మిగతా జిల్లాల్లో పూర్తిస్థాయిలో ఉంది. హైదరాబాద్‌లో ఓల్డ్‌సిటీ, కాటేదాన్‌ ‌ప్రాంతాల్లో చేనేత కుటుంబాలు చాలా ఉండేవి. తక్కువ సంఖ్యలో ఇప్పటికీ ఉన్నాయి. హైదరాబాద్‌ ‌శివారు ప్రాంతాల్లో ఆయా జిల్లాలకు వలస వచ్చిన కుటుంబాలు వృత్తిని కొనసాగిస్తున్నాయి. చేనేతలో ప్రత్యేకత చాటుతున్న పోచంపల్లి ఇక్కత్‌కు ఇండియా హ్యాండ్లూమ్‌ ‌బ్రాండ్‌గా గుర్తింపు లభించింది. తెలంగాణలో తివాచీలు, రగ్గులు, కంబళ్ల తయారీకి వరంగల్‌ ‌ప్రసిద్ధి చెందింది. మఖ్‌మల్‌, ‌సన్నటి వస్త్రాలకు నాటి కాలంలో గోల్కొండ ప్రాచుర్యం పొందింది. మెదక్‌ అద్దకం వస్త్రాలు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి.
ఈ బ్రాండ్‌తో అంతర్జాతీయ వస్త్ర మార్కెట్‌లో స్థూల జాతీయోత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నది. నైపుణ్యం, వాణిజ్య కార్యకలాపాల్లో నూతన ఒరవడి, సామాజిక విప్లవం సృష్టిస్తున్న తెలంగాణ చేనేత కళను గుర్తించిన ప్రతిష్టాత్మక మిచిగన్‌ ‌యూనివర్సిటీ గ్లోబలెన్స్‌గా ప్రత్యేక గుర్తింపునిచ్చింది. యూనివర్సిటీ ఆఫ్‌ ‌విలియమ్‌ ‌డేవిడ్సన్‌ ‌నిర్వహించిన 2015 నెక్టస్ ‌బిలియన్‌ ‌కేస్‌ ‌రైటింగ్‌ ‌కాంపిటీషన్‌లో సంస్థాన్‌ ‌నారాయణపురం చేనేత కలర్‌వీవ్స్ ‌సంస్థ ఎంపికైంది. టైమ్స్ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌లెర్నింగ్‌ ‌లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కార్ఘా బ్రాండ్‌కు అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనకు ఎంట్రీ లభించింది. తెలంగాణ చేనేతను హానరబుల్‌ ‌మెన్షన్‌గా గ్లోబలెన్స్ అవకాశం లభించింది. చేనేత కార్మికులు తయారుచేస్తున్న 48 ఉత్పత్తులు జియోగ్రాఫికల్‌ ఇం‌డికేషన్‌ ‌చట్టం ప్రకారం రిజిస్టర్‌ అయ్యాయి.
అంత గొప్ప చేనేత కళాకారుడు దారపు పోగుల్లెక్క పలుచబడ్డ ఎముకలగూడుతో, రంగుపూతలద్దని రాట్నంపై తిరిగే బాబిన్‌లెక్క, మగ్గానికి, మరయంత్రానికి మధ్యలో చితికి, చిటికీ నేతతో చిత్రవిచిత్రాలు సృష్టిస్తూ, ఫ్యాషన్‌ ‌ప్రపంచానికే సవాల్‌ ‌విసురుతూ సాలెగూడులాంటి పొదరిళ్లలో అడ్డమొరిగి ఆసుకు తలవాల్చి కనిపిస్తున్నాడు. వెండి వెన్నెల జరీ చీరల నేతగాడిగా, అగ్గిపెట్టెలో ఆరున్నర గజాల పద్యాన్ని మడిచిపెట్టిన అద్భుత కళాకారుడిగా, రక్తమాంసాలతో ఒక మహోన్నతమైన వస్త్రకావ్యాన్ని సృష్టించినవాడిగా, పూరిపాకలో వస్త్రసౌధాలు నిర్మిస్తున్నాడు.
మరమగ్గాల పుణ్యమా అని చేనేత రంగం తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నది. జీఎస్టీ అమలు చేయడం వల్ల చేనేత రంగంపై మూలిగే నక్కపై తాటిపండు ఊడిపడినట్లయిందని, గిట్టుబాటు ధర లభించక చౌక ధరలకే చేనేత వస్త్రాలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. హ్యాండ్‌లూమ్‌ ‌బోర్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయని చేనేత కార్మికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్య సిరిసిల్లలో ఎక్కువగా చేనేత కార్మికులు పనులు లేక,చేసే పనులు గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఆత్మహత్యతో గానీ, ఆకలి చావులతో గానీ మరణించిన వారి సంఖ్య 500 కి దాటింది. నేడు, దేశవ్యాప్తంగా చేనేత చేనేత కార్మికుల యొక్క పెద్ద కష్టం ఏమిటంటే, తగిన పరిమాణంలో మంచి నాణ్యమైన నూలును తగినంతగా లభించకపోవడం. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ‌సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వాలు చెప్పడమే తప్ప ఆచరణలో ఎక్కడా సాధ్యం కావడంలేదు. కో ఆపరేటివ్‌ ‌సొసైటీల నుంచి వచ్చే ఉత్పత్తులు మాత్రమే ఆప్కో కొనుగోలు చేస్తున్నది కేవలం 9శాతం మాత్రమే. 91శాతం ఎక్కడ విక్రయించాలనేది కార్మికులకే దిక్కుతోచడంలేదు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకిచ్చే యూనిఫామ్‌, ఇతర అవసరాలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని అడిగినా ఫలితం లేదు. కమీషన్ల కోసం ఆశపడి పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. చేనేత బజార్లు ఏర్పాటు, ఆన్‌లైన్‌ ‌ట్రేడింగ్‌తో ఒప్పందం అని చేనేత జౌళిశాఖ చెబుతున్నా అవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి తప్ప ఆచరణలోకి రావడంలేదు. చేనేత కార్మికుల వినతులు పట్టని కేంద్రం జాతీయ స్థాయిలో నేషనల్‌ ‌హ్యాండ్లూమ్‌ ‌డెవల్‌పమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఉన్నా కేవలం నూలు మాత్రమే అందిస్తోంది తప్ప మార్కెటింగ్‌ ‌సౌకర్యం కల్పించడం లేదు. దీన్ని నేషనల్‌ ‌హ్యాండ్లూమ్‌ ‌డెవల్‌పమెంట్‌ ‌ఫైనాన్స్ ‌కార్పొరేషన్‌గా మార్చి రూ.5వేల కోట్లు నిధులు కేటాయించాలని హ్యాండ్లూమ్‌ ‌బోర్డు సభ్యుల బృందం పలుమార్లు కేంద్రానికి విన్నవించినా ఫలితం కనిపించడంలేదు.
రాష్ట్ర స్థాయిలో హ్యాండ్లూమ్స్ ‌ఫైనాన్స్ అం‌డ్‌ ‌డెవల్‌పమెంట్‌ ‌కార్పొరేషన్‌ ‌కావాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. ఇతర కార్పొరేషన్లకు ఇచ్చిన విధంగా నిధులు కేటాయించి సహకార రంగంతోపాటు అందులో లేని కార్మికులకు కూడా మూలధనం ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్‌. ‌హ్యాండ్లూమ్‌ ‌వీవర్స్ ‌గ్రూప్‌లు ఏర్పాటు చేసి గ్రూపునకు లోన్లు ఇవ్వాలి. ఇలా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 100 నుంచి 200 సంఘాలు ఏర్పాటు చేసి లోన్లు ఇస్తే చేనేత బతుకులు కొంతైనా మెరుగు పడతాయని నేతన్నలు అంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ చేనేతపై పన్నులేదని, మహాత్మా గాంధీ రాట్నం వడికే ఫోటో ఆఫీసులో పెట్టుకొనే కేంద్ర పాలకులు చిలపనూలుపై ఐదుశాతం పన్ను విధించడం బాధాకరమని చేనేత కార్మికులు వాపోతున్నారు. ఇక తెలంగాణలో వరంగల్‌ ‌కేంద్రంగా చేనేత టెక్స్ ‌టైల్స్ ‌పార్క్ ‌నిర్మిస్తామని ఊరిస్తున్నది.
చేనేత కార్మికులు అలసిపోయారు. వీరికి ఈ రోజు కావాల్సిన ఆదాయం రావాలంటే భారతీయులు అందరూ కూడబలుక్కొని ఈ రంగాన్ని బలపరచాలి. దీంట్లో భాగంగానే తెలంగాణ సర్కారు చేనేతకు చేయూత, చేనేత లక్ష్మీ లాంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నది. కాబట్టి వ్యక్తిగతంగా.. సంస్థాగతంగా అందరూ చేనేతపై అవగాహన కలిగి చేయూతనిస్తే మంచి ఫలితాలు పొందడమేకాక ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది! లేకపోతే చేనేతను మ్యూజియంలో చూడాల్సి వస్తుంది.
డా।। ఏరుకొండ నరసింహుడు,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ టీచర్స్ ‌యూనియన్‌(‌టిటియు)