Take a fresh look at your lifestyle.

నేటి నుంచి 6వ విడతహరితహారం

నర్సరీల్లో సిద్దంగా ఉన్న మొక్కలు
ఉపాధిహాతో గుంతలు సిద్దం చేసిన కూలీలు
ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించిన
మంత్రి హరీష్‌ ‌రావు, అధికారులు
గ్రామాల్లో సర్పంచ్‌లను సన్నద్దం
చేసిన మంత్రి ఎర్రబెల్లి
జిల్లాల్లో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

ఆరో విడత హరితహారం కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. పచ్చదనమే లక్ష్యంగా గత ఆరేళ్లుగా చేపడుతున్న కార్యక్రమంతో ఊరూవాడా మొక్కలు నాటుతున్నారు. సర్పంచ్‌లకు గ్రామాల బాధ్యతను అప్పగించారు. ఊరికో
నర్సరీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అడవులను 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఏటా వానకాలం ప్రారంభంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నది.ఆరోవిడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ‌గురువారం మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ అర్బన్‌ ‌పార్కులో  మొక్కలు నాటి, కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సిఎం రాక కారణంగా భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు  మొక్కలు నాటుతారు. తొలకరి వర్షాలు పడడంతో భూమి పదనుతో మొక్కలు నాటేందుకు అనువుగా ఉంది.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి హరీష్‌ ఆన్నారు. జిల్లాతో పాటు రాష్ట్రంలోని అడవులను పునరుద్ధరించాలన్నారు.ఈ కార్యక్రమానికి నర్సాపూర్‌ ఎకో పార్కు వేదిక కానున్నదని మంత్రి అన్నారు. సీఎం  కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలన్నారు. దీనిలో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ప్రతి 30కిలో టర్లకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాకు సీఎం రానున్న నేపథ్యంలో ఒక్కో అధికారికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. వారు చేయాల్సిన పనులను మంత్రి వివరించారు. విద్యుత్‌, ‌వ్యవసాయ, డీపీవో, డీఆర్డీఏ, ఫైర్‌, ‌రోడ్లు, భవనాల శాఖ అధికారులు తమ సిబ్బందితో అందుబాటులో ఉండాలన్నారు. సీఎం కేసీఆర్‌ ‌రాకకు అవసరమైన స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హరితహారం కార్యక్రమానికి మొత్తం రూ.12.3కోట్లు వెచ్చించి, 1752హెక్టార్లలో మొక్కలు నాటనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో ట్రీ గార్డులు, వాటికి సపోర్టుగా కర్రలను వాడాలని, పెద్ద మొక్కలను నాటాలని కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి అన్నారు. హరితహారంలో ప్రత్యేక అధికారులు అవసరమైన నివేదికలు సిద్ధం చేసుకొని ఉంచుకోవాలని చెప్పారు. మెదక్‌ ‌జిల్లాలో  ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో  అటవీ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ శోభ, కలెక్టర్‌ ‌ధర్మారెడ్డి, మెదక్‌ ఎం‌పీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షిం చారు. అర్బన్‌ ‌పార్కులో నూతనంగా నిర్మించిన ప్రధానగేటు, బిడ్జి, ఔషధ మొక్కలు, వాచ్‌టవర్‌ ‌వంటివి పరిశీలించారు. నర్సాపూర్‌ అటవీ ప్రాంతంలో తిరిగి, ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే వివరాలు, నాటాల్సిన మొక్కలకు సంబంధించిన వివరాలను అధికారులకు సూచించారు.
ఇదిలావుంటే ఆరో విడత హరితహారానికి అన్ని నర్సరీల్లో మొక్కలు సిద్దంద్‌ధ్దంగా ఉన్నాయి. ప్రతి గ్రామపంచాయతీలో 5వేల నుంచి
10వేల మొక్కలను పెంచుతున్నారు. ప్రభుత్వం గడిచిన ఐదు విడుతల్లో హరితహారం కింద నాటిన మొక్కలతో మండలంలోని పల్లెలో పచ్చదనం సంతరించుకుంది. ఒక్కో నర్సరీలో 5 వేల మొక్కలను పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఉపాధిహా నర్సరీల్లో 100 శాతం మొక్కలను పెంచేందుకు ఉపాధి పథకం అధికారులు ముందస్తుగా నర్సరీలకు షెడ్‌నెట్లను ఏర్పాటు చేశారు. ఉపాధి పథకం ఉన్నత అధికారులు నర్సరీలను పరిశీలించి మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వాహకులకు సూచనలు చేశారు. ఆసక్తి ఉన్న రైతులకు వారి పంట పొలాల వద్ద పెంచుకునేందుకు ఉచితంగా ఉపాధిహా పథకం ద్వారా గుంతలు తీయడంతో పాటు మొక్కలను అందించనున్నారు. గ్రామాల్లో రోడ్లకు ఇరుపక్కలా, గ్రామపంచాయతీ భవనాల వద్ద, పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ కార్యాలయాలు, తదితర చోట్ల మొక్కలను నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే  జిల్లాల్లో ఐదు విడతలుగా హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు వృక్షాలుగా మారి పచ్చదనాన్ని సంతరించు కుంటున్నాయి. ఈ నెల 25నుంచి ఆరో విడత ప్రారంభం కానుండడంతో అధికారులు మొక్కలు నాటేందుకు గుంతలు తీయించి పెట్టారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, యువజన, మహిళా సంఘాలు సహకరించాలన్నారు. అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తించి,నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉంచారు. మరోవైపు గ్రాణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు ఇప్పటికే అధికారులతో సక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Leave a Reply