జాతీయ నులిపురుగుల నివారణ వారోత్సవాలను రూరల్ జిల్లా పరిధిలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వారోత్సవాలను విజయవంతం చేయా లని రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్5నుండి12 వరకు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో సిబ్బంది, అధికారులు 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మరీ ముఖ్యంగా వైద్య శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నులి పురుగుల నివారణ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని అన్నారు.
కోవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూనే నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చల్లా మధుసూదన్ కాన్ఫరెన్స్లో వైద్య అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ నులిపురుగుల నివారణ వారోత్సవాలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు ఒకటి నుండి రెండు సంవత్సరాల వయస్సు పిల్లలకు సగం మాత్ర మాత్రమే చెంచా నీళ్లలో కలిపి తాగించాలని సూచించారు. 2 నుండి19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు పూర్తి మాత్రం వేయించాలన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని, కరోనా లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే పిల్లలకు గానీ వారి కుటుంబ సభ్యులకు దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓలు డాక్టర్ ప్రకాష్, డాక్టర్ గోపాల్ రావు, స్వరూపా రాణి, హెచ్ ఈ కెవి రాజు, పలు శాఖల జిల్లా స్థాయి ఆధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.