Take a fresh look at your lifestyle.

నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్షం.. వరంగల్‌ ఎం‌జిఎం

ఎం‌జీఎం ను సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చి దిద్దుతామని చెప్పుకొచ్చే మన పాలకులు కనీసం వీటికి సరిపడే నిధులు కూడా కేటాయించకపోవటం, సరిపడా మందులు సరఫరా చేయకపోవటం, సిబ్బందిని సరిపడ నియమించకపోవటం, ఖాళీపోస్టులను భర్తీ చేయకపోవటం, అవసరమైన భవనాలు నిర్మించకపోవటం లాంటివి చేస్తూనే ప్రజల ముందు నిసిగ్గుగా ఎంజీఎం ను అభివృద్ది చేస్తున్నట్లు మన పాలకులు పోజులు కొట్టడడాన్ని ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందనేది గుర్తించాలి.‘‘స్వాతంత్య్రం వస్తే మన ఊరి హెడ్‌కానిస్టేబుల్‌ ‌మారతాడా’’..అని గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కంలో ఓ పాత్ర ప్రశ్నిస్తుంది. కన్యాశుల్కంలో వేసిన ఈ ప్రశ్న వందేండ్లు దాటిన కూడా ఇప్పటికీ ప్రాధాన్యతగానే ఉంది. ఎవరు పోయినా..ఎవరు వచ్చినా..వ్యవస్థలో మార్పులు లేకపోతే ప్రయోజనం లేదనే అభిప్రాయం గురజాడ తన కన్యాశుల్కంలోని ఒక పాత్ర ద్వారా వ్యక్తీకరించారు.
సరిగ్గా ఈ ప్రశ్న మన తెలంగాణ పాలకులకు, రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య రంగానికి సరిపోతుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా…పాలకులు మారినా కూడా వైద్య, ఆరోగ్య రంగ పరిస్థితులు ఏ మాత్రం మారటం లేదనేది కాదనలేని సత్యంగా ఉంది. ఇందుకు వరంగల్‌ ఎం‌జీఎం ఆసుపత్రి ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ ఆసుపత్రిగా వరంగల్‌ ఎం‌జీఎం ఆసుపప్రతి పేరొందింది. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లానే కాదు, రాష్ట్రంలోని సుమారు 15 జిల్లాల నుంచి రోగులు ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యసేవలు పొందటానికి వస్తుంటారంటే అతియోశక్తి కాదు. వెయ్యి పడకల ఆసుపత్రిగా చెప్పుకుంటున్న ఎంజీఎంను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మన పాలకులు సూపర్‌స్పేషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని, మెరుగైన వైద్యసేవలు అందించెందుకు చర్యలు చేపడుతామని, ఆసుపత్రి అభివృద్దికి అత్యధికంగానే నిధులు కేటాయిస్తామని మన పాలకులు గొప్పగానే చెప్పారు. ఇంకా చెప్పుతూనే ఉన్నారు. ఇవన్నీ ఆచరణలోకి వస్తే సంతోషమే. కానీ మన పాలకులు చెప్పే మాటలు వరంగల్‌ ఎం‌జీఎం ఆసుపత్రిలో అమలుకు ఆమడ దూరంలో ఉన్నాయనేది ఇక్కడ గమనించాల్సిన అంశం. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య. ఆరోగ్య రంగం నత్తనడక వ్యవహారంగా ఉందని, నిర్లక్ష్యానికి గురవుతుందని వరంగల్‌ ఎం‌జీఎం ఆసుపత్రి దుస్థితి తేటతెల్లం చేస్తోందనటంలో సందేహంచాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే నిత్యం సుమారు 4వేల మంది వరంగల్‌ ఎం‌జీఎం ఆసుపత్రిలో వైద్యసేవల కోసం రోగులు వస్తుంటారు. 2014లో సుమారు
6లక్షల మంది వైద్యసేవలు పొందగా 2018 లో ఈ సంఖ్య 12లక్షలకు చేరుకున్నట్లు అధికారిక లెక్కలు చెప్పుతున్నాయంటే ఎంజీఎం ఆసుపత్రి ఎంత కీలకమైందో అర్థం చేసుకోవాలి. ఇంత పెద్ద స్థాయిలో రోగులకు వైద్యసేవలందించే ఆసుపత్రిలో సౌకర్యాలు మాత్రం చాలా దయానీయంగా ఉన్నాయి. వెయ్యి పడకల ఆసుపత్రిగా గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ అందుకనుగుణంగా ఆసుపత్రి నిర్వహణ లేదు. ఏడు వందల బెడ్లు, అరకొర వసతులతో, సిబ్బంది కొరతతో ,సరిపడ పరికరాలు లేక, ఉన్నా సరిగా పని చేయక సమస్యలకు నిలయంగా కొనసాగుతుంది. ఫలితంగా రోగులు ఇబ్బందులు పడటం, వైద్యసేవలు కుంటుపడటం సర్వసాధరణ అంశంగా మారింది. సుమారు 30 వరకు ఉన్నటువంటి వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోనే చెప్పుకోదగిన అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న ఎంజీఎంలో అన్ని విభాగాలను కలుపుకొని 1500 సిబ్బంది అవసరమని అధికారులే భావిస్తుండగా అందుకు అనుగుణంగా ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సులు ఇతర సిబ్బంది సరిపడ లేకపోవటం చూస్తే ఎంజీఎం పట్ల ఏలికల చిత్తశుద్ది ఏ మేరకు ఉందో తెలుస్తుంది.
కీలకమైన కొన్ని విభాగాల పరిస్థితిని, వైద్యుల కొరతను, సిబ్బంది కొరతను మచ్చుకు కొన్ని పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యసేవలంటూ మాట్లాడే మన పాలకుల మాటలకనుగుణంగా ఎంజీఎంలో వైద్యులు లేరు. సూపర్‌ ‌స్పెషాలిటీకి ఆసుపత్రిలో ఉండాల్సిన కీలకమైన చిల్డ్రన్‌ ‌నూరో సర్జన్‌, ‌మేజర్‌ ‌న్యూరో సర్జన్‌, ‌కార్డియాలజీ, న్యూరోయాలజీ, తదితరులు ఏ ఒక్కరూ లేరనేది గమనించాల్సిన అవసరం ఉంది. వీరు లేకుండా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి ఎలా అవుతుందో…సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు ఎలా అందుతాయో మన ఏలికలకే తెలియాలి. ముఖ్యంగా ఎంజీఎం 26 మంది ప్రొఫెసర్లు అవసరం ఉండగా 11 మంది మాత్రమే ఉన్నారు. అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్లు 61మంది అవసరం ఉండగా 26 మంది మాత్రమే ఉన్నారు. 73 ఎంఎన్‌ఓ, 42 ఎఫ్‌ఎన్‌ఓ ‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్‌నర్సులు 61, కార్డియో టెక్నిషియన్లు 14, డార్కురూం అసిస్టెంట్లు 14, డార్కురూం అటెండర్లు 13 పోస్టులు భర్తీకి నోచుకోవటం లేదు. ఇక తోటి 64, స్వీపర్లు 79, కామాటి 29, దోబి 8, రేడియో గ్రాఫర్లు 5, బార్బర్లు 10, ఫిజియోథేరపిస్టు 10, అసోషియేట్‌ ‌ప్రొఫెసర్లు 7, సిటి స్కాన్‌ ‌టెక్నిషియన్‌ 4, ‌వాచ్‌మెన్‌ 6, ‌గ్రాండ్‌2 ‌ల్యాబ్‌ ‌టెక్నిషియన్‌ 3, ‌పిమెచ్‌ఎన్‌(‌టి) 5, జూనియర్‌ ‌స్టెనో 3, స్టేనో టైపిస్టు 8, టెక్నికల్‌ అసిస్టెంట్‌ 8, ఇలా ప్రతి విభాగంలోనూ ఖాళీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక రకంగా ఖాళీలు లేని విభాగమే ఎంజీఎంలో లేదనేది గమనించాల్సిన అంశం.
ఇక పరికరాల పరిస్థితి మరీ అద్వానంగా ఉంది. ముఖ్యంగా సిటి స్కాన్‌, ఎంఆర్‌ఐ ‌స్కాన్‌, ‌డిజిటల్‌ ఎక్స్‌రే, రక్తకణాలను పరీక్షించే పరికరాలు లేవు. ఫలింగా రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వీటి వినియోగం ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే. ఇంతటి కీలకమైన పరికరాలు ఎంజీఎంలో లేకపోవటం ఫలితంగా రోగులు ప్రయివేటును ఆశ్రయించటం అనివార్యం అవుతుంది. ఒక రకంగా రోగులను ప్రయివేటు వైద్యం వైపు ప్రభుత్వమే నెట్టేస్తున్నట్లుగా పరిస్థితులు తెలుపుతున్నాయి. రోగులు ఆర్థికంగా నష్టపోవటమే కాకుండా సరైన సమయంలో సేవలు అందకపోవటం మూలంగా ప్రాణనష్టం కూడా జరుగటం సర్వసాధరణంగా మారుతోంది. వీటికి తోడు వెంటిలేటర్లు లేవు. కనీసం సరిపడ స్ట్రచర్లు కూడా లేవంటే ఎంజీఎం ఎంతటి దుర్భర స్థితిలో ఉందో, ఎంజీఎం అభివృద్ది పట్ల పాలకుల నిర్లక్ష్యం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.
ఇక మందుల కొరత కూడా తీవ్ర స్థాయిలోనే ఉంది. రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మందులు లేవు. మందుల సరఫరా లేదు. కనీసం ఫారాసెటిమెల్‌ ‌టాబ్లెట్‌ ‌కూడా పరిపడ లేదంటే…ఈసీజీ తీయటానికి కనీసం పేపర్‌ ‌కూడా కొరతగా ఉందంటే ‘ వైద్యో యమధర్మరాజా హరి’ అన్నట్లుగా ఎంజీఎం పరిస్థితి ఉందనకుంటే ఏమనాలి..? మరో వైపు జనరల్‌ ‌మెడిసిన్‌ ‌డిఫార్టుమెంట్‌, ‌జనరల్‌ ‌సర్జరీ డిఫార్టుమెంట్‌, అనస్థిషియా డిఫార్టుమెంట్‌, ఆర్థోపెటిక్‌ ‌డిఫార్టుమెంట్‌, ‌పాథోలాజీ డిఫార్టుమెంట్‌, ‌మైక్రో బయోలాజీ డిఫార్టుమెంట్‌, ‌రేడియోలాజీ డిఫార్టుమెంట్‌, ‌బ్లడ్‌బ్యాంక్‌ ‌డిఫార్టుమెంట్‌లలో కావాల్సిన అవసరమైన పరికరాలు లేవు. పాలకులు కూడా సమకూర్చటానికి సిద్దంగా ఉన్నట్లు కూడా కనిపించటం లేదు.
ఎందుకంటే సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వాధినేతలు ఎంజీఎంను సందర్శించి వైద్యరంగం అభివృద్ది గురించి, ఎంజీఎం అభివృద్దికి ప్రభుత్వం ఏదో చేస్తున్నట్లు అందమైన మాటలు గొప్పగొప్పగా చెప్పే మన పాలకులకు ఎంజీఎంలో నెలకొన్న సమస్యలు కనిపించటం లేదంటే ఏమనుకోవాలో మన ఏలికలే చెప్పాలి..? ఎంజీఎం ను సూపర్‌ ‌స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చి దిద్దుతామని చెప్పుకొచ్చే మన పాలకులు కనీసం వీటికి సరిపడే నిధులు కూడా కేటాయించకపోవటం, సరిపడా మందులు సరఫరా చేయకపోవటం, సిబ్బందిని సరిపడ నియమించకపోవటం, ఖాళీపోస్టులను భర్తీ చేయకపోవటం, అవసరమైన భవనాలు నిర్మించకపోవటం లాంటివి చేస్తూనే ప్రజల ముందు నిసిగ్గుగా ఎంజీఎం ను అభివృద్ది చేస్తున్నట్లు మన పాలకులు పోజులు కొట్టడడాన్ని ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం కూడా ఎంతో ఉందనేది గుర్తించాలి. నిజంగా పాలకులకు ఎంజీఎం అభివృద్ది మీద దృష్టి ఉంటే లక్షలాది మందికి కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆసుపత్రి అభివృద్దిలో చిత్తశుద్ది కనపర్చాలి. కనీసం 200 కోట్లు కేటాయించి ఎంజీఎంను అభివృద్ది చేయాలి. సరిపడ వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించాలి. అదనంగా మరో 250 మంది శానిటేషన్‌ ‌సిబ్బందిని, సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలి. వీరందరినీ పర్మినెంట్‌ ‌చేయాలి. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా భవానాలు నిర్మించాలి. విశ్రాంతి గదులు నిర్మించాలి.బెడ్లనె పెంచాలి. ఓపీ సమయాన్ని పెంచాలి. పాలకులు అందమైన అబద్దపు మాటలే వీడి ఎంజీఎం అభివృద్ది కోసం ఆచరణాత్మకమైన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి.ఎంజీఎం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఏలికలు గుర్తించాలి. ప్రజలు కూడా ప్రశ్నించటానికి సిద్దం కావాల్సిన అవసరం ఉంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy