Take a fresh look at your lifestyle.

నిరుపమానం, నిర్విశేషం, నిష్కళంకం… రామనామం

వశిష్ట మహర్షిని దశరథ• మహారాజు పేరు పెట్టమన్నప్పుడు, వారికి నామకరణం గావించాడు. ‘జో ఆనన్ద సింధు సుఖరాసీ సీకరతే త్రైలోక సుపాసీసో సుఖ ధామ రామ షసనామా అఖిలలోక దాయక్‌ ‌విశ్రామృ’. ఆనందానికి సముద్రం లాంటి వాడు, సుఖానికి రాసి లాంటివాడు. ఆ సముద్రంలోని ఒక్క బిందువు చేత మూడు లోకాలకూ సుఖాన్ని ఇచ్చేవాడు అయిన ఈ సుఖధాముడికి రాముడని పేరుంది. ఈ శిశువు మూడు లోకాలకు విశ్రాంతి నివ్వగలడు. జ్ఞానులకు ఈయన ఆనంద సింధు. కర్మల్లో ప్రవృత్తమై ఉన్నవారికి సుఖరాసి, భక్తులకు వైకుంఠ సుఖరూపధాముడు ఈ రాముడు.

‘ఖండ ఉ నామరామ రఘువరకో హేతుకృపాను భాను హిమకరకో – బిధిహఱి హరమయ బేదషానసో అగున అనూపమగున నిధ్యాసో’ అన్నారు తులసీదాసు. కృశాను(అగ్ని), భాను(సూర్య), హిమకర(చంద్ర), హేతువై (అవి నిలవడానికి కారణమై), త్రిమూర్తి (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరి) రూపమై వేదాలకు ప్రాణమై, నిర్గుణమై ఉపమాన రహితమై (పోల్చడానికి మరోకటి లేదిదై), గుణభాండారమై ఉన్న రామనామానికి వందనాలు అంటాడు.

‘ర’ కారం అగ్ని బీజాక్షరం. దానిలో త్రేతాగ్నులు ఉన్నాయి. దీన్ని మననం చేస్తే శుభాశుభరూపమైన మనోమలాన్ని పోగొడుతుంది. ‘అ’ కారం సూర్య బీజాక్షరం. ఇది సమస్త జ్ఞానాన్ని ప్రకాశింపజేసి అవింద్యాంధకారాన్ని నాశనం చేస్తుంది. ‘మ’ కారం చంద్ర బీజాక్షరం. ఇందులో అమృతం నిండి ఉంది. ఇవి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపాలను శాశ్వతంగా తొలగించి, శీతలత్వం శాంతినిస్తుంది. ై+ఆ+మ : రామ. అందుకే సోమసూర్యాగ్నులను మించిన స్వప్రకాశము రామనామము అన్నారు. ఇంకో విధంగా చూసినా, రామనామము సూర్య చంద్రాగ్నులకు కారణమనవచ్చు. దశావతారాల్లో మూడు రామావతారాలున్నాయి. ఒకటి పరశురామవతారం. జమదగ్ని వంశంలోనిది. శ్రీరామావతారం సూర్యవంశంలోనిది. బలరామావతారం చంద్రవంశంలోనూ ఆవిర్భావించాయి. కావున ఈ విధంగా చూసినా కూడా రామనామం సూర్య చంద్రాగ్నులకు కారణం అయ్యింది. రామనామం త్రిమూర్తిస్వరూపం. మూడు మూర్తుల జన్మభూమికి మూలదైవము రామనామము. ర : రుద్ర, ఆ : బ్రహ్మ, మ : విష్టు.

వేదాలకు ప్రాణం ప్రణవం (ఓంకారం). వేదాలలో నేను ప్రణవాన్ని అని స్వయంగా పరమాత్మే చెబుతాడు. అటువంటి ప్రణవానికి ప్రాణం రామనామం. మూడు గుణముల ప్రకృతి – వికృతికి మూలకందము రామనామము.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

పరమేశ్వరుడు పార్వతీ దేవితో ఇలా అన్నారంటారు. ఒక్క రామ నామం విష్ణుసహస్ర నామాలతో సరి సమానమైనది. నేను సదా ‘రామ, రామ, రామ’ అంటూ మనోహరమైన రామనామంలోనే రమిస్తుంటాను. ‘రామ, రామ’ అని ఇలా ఘోషించడం సంసార బీజాలను వేయించేస్తుంది. సమస్త సుఖసంపదలనూ ఇస్తుంది. యమదూతలను భయభ్రాంతులను చేస్తుంది. ‘ఆపదామపహర్తారం’. ఆపదలను హరించివేస్తుంది.
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వాస్మరన్‌
‌న•రోన లిప్యతే పాపైర్ఖుక్తిం ముక్తిం వింద్యతి.

రామ, రామభద్ర, రామచంద్ర అనే నామాలను స్మరించడం వలన మానవుడూ పాపవిముక్తుడవటమే గాకుండా, భోగమోక్షాలను కూడా పొందుతాడు. జగజ్జత్రైక మంత్రేజా రామ నామ్నాభి రక్షితమ్‌ అన్నారు. ఈ జగత్తు మొత్తాన్ని జయించడానికి ఎకైక మంత్రమైన రామనామంచే సురక్షితమైన జీవితాన్ని మనం గడుపుదాం. హరేరామ, హరేరామ, రామరామ హరేహరే. అందుకే రామనామం నిరుపమానం, నిర్విశేషం, నిష్కళంకం.

– డా।। పులివర్తి కృష్ణమూర్తి

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!