Take a fresh look at your lifestyle.

నిరంజన్‌రెడ్డి సాబ్‌…‌జర ఇదర్‌ ‌దేఖో? తీరని యూరియా కొరత..అన్నదాతల ఆగ్రహం

ఫోటో: శుక్రవారం అల్లీపూర్‌ ‌పిఏసిఎస్‌ ‌వద్ద ఉదయం 5గంటలకే యూరియా కొరకు బారులు తీరిన రైతన్నలు
ఫోటో: శుక్రవారం అల్లీపూర్‌ ‌పిఏసిఎస్‌ ‌వద్ద ఉదయం 5గంటలకే యూరియా కొరకు బారులు తీరిన రైతన్నలు

జిల్లాలో యూరియా కొరకు రైతులు పడిగాపులుగాస్తున్నారు. యూరియాను సరఫరా చేసే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పిఏసిఎస్‌)‌ల వద్ద, సంబంధిత ఫర్టిలైజర్స్ ‌దుకాణాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. తెల్లారకముందే రైతులు యూరియా కొరకు పిఏసిఎస్‌ ‌వద్ద క్యూలైన్‌లో నిలుచుంటున్నారు. యూరియా కొరత జిల్లా రైతాంగం ఉసురు తీస్తోంది. పంటకు బలాన్ని ఇవ్వాల్సిన ఎరువులు… అన్నదాతల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఎరువులు కోసం పడిగాపులు పడీపడి ప్రాణాలు కోల్పోతున్నారు. యూరియా కోసం జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు అల్లాడిపోతున్నారు. భార్య-పిల్లలు, ఇళ్లు, పొలాలను వదిలిపెట్టి, తిండీ తిప్పల్లేకుండా యూరియా సరఫరా కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే, రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా.. గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా… ఎరువులు దొరక్కపోవడంతో… ఆ నిరాశతో కొందరు ఆసుపత్రుల పాలవుతుండగా… మరికొందరు క్యూలైన్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలోని దుబ్బాకలో యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడిన రైతు ఎల్లయ్య… క్యూలైన్లో నిలబడీ నిలబడి అలసిపోయాడు. ఎలాగైనా యూరియా తీసుకెళ్లి పంటను కాపాడుకుందామనుకున్న ఎల్లయ్య గుండె క్యూలైన్లోనే ఆగిపోయింది. తన వంతు రాకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. తనకున్న కాస్తోకూస్తో పొలంలో వ్యవసాయం చేస్తోన్న ఎల్లయ్య… యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడ్డాడు. అయినా, యూరియా దొరక్కపోవడంతో…. ఈసారి ఎలాగైనా సరే దక్కించుకోవాలని…. క్యూలైన్లో నిలబడ్డాడు. కానీ, అప్పటికే పడిగాపులు-పడీపడి అలసిపోయిన ఎల్లయ్య క్యూలైన్లో కుప్పకూలాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. దాంతో, ఎల్లయ్య మృతికి ప్రభుత్వమే కారణమంటూ రైతులు ఆందోళనకు దిగారు. యూరియా రైతు ఎల్లయ్య ప్రాణం తీసినప్పటికీ…సంబంధిత శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డికి రైతుల బాధలు కనిపించకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు ఎల్లయ్య మృతిని సినిమా టికెట్ల లైన్‌తో పోల్చడాన్ని అటు అన్నదాతలు, ఇటు ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. యూరియా కొరకు లైన్‌లోనే కుప్పకూలి రైతు ఎల్లయ్య ప్రాణాలు కోల్పోయినా కూడా రైతులు యూరియా కొరకు ఎంతగా బాధలుపడుతున్న విషయం మంత్రి నిరంజన్‌రెడ్డికి అగుపించకపోవడాన్ని ఏమనుకోవాలని పలువురు రైతులు బహిరంగంగా, సూటిగానే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారుతోంది. యూరియా కొరతపై విపక్షాలు…. ప్రభుత్వాన్ని టార్గెట్‌ ‌చేస్తుంటే, అసలు కొరతే లేదంటోంది కేసీఆర్‌ ‌సర్కారు. రైతుల అవస్థలకు ఎల్లయ్య మృతి అద్దం పడుతోందని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైనా కేంద్రంతో మాట్లాడి, అవసరమైన యూరియాను తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చాలని సూచిస్తున్నారు. అలాగే దుబ్బాకలో మరణించిన రైతుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటోన్న విపక్షాలు… ఎల్లయ్య కుటుంబానికి 25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. మరోవైపు మూడ్రోజుల్లో యూరియా కొరత తీర్చకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని రైతులు హెచ్చరిస్తున్నారు.
యూరియా కొరకు అల్లీపూర్‌లో ఉదయం ఐదు గంటలకే క్యూ కట్టిన రైతులు…
చిన్నకోడూర్‌ ‌మండల కేంద్రంలోని అల్లీపూర్‌ ‌సొసైటీ ముందు రైతులు యూరియూ కోసం ఉదయం ఐదు గంటల నుండి క్యూలో నిలబడ్డారు. వీరిలో పలువురు మహిళా రైతులు కూడా ఉన్నారు. యూరియా కొరకు రైతులు నిరీక్షణ చేస్తున్నా అధికారులు వచ్చి యూరియూ ఇవ్వకపోవడం ఏమిటని రైతులు వాపోతున్నారు. దాదాపుగా మూడు గంటల నుండి క్యూలో రైతులు నిలుచున్నప్పటికీ..సంబంధిత అధికారి ఒక్కరంటే ఒక్కరూ రాలేదనీ,దీంతో నిలబడి నిలబడి కాళ్లు గుంజుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారనీ పలువురు రైతులు పడుతున్న బాధలను వివరించారు. యూరియా కోసం క్యూలో నిలబడితే వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడి సినిమా చూసేవాళ్లతో పోల్చి రైతులను అవమానించారనీ, నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యలు ఎంతమాత్రం సబబుగా లేవనీ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.సకాలంలో యూరియ కేంద్రాలల్లో నిల్వ ఉంచితే క్యూలో నిల బడే బాధ తప్పేదని క్యూలో నిలబడడం వలనా ఒత్తిడి తట్టుకోలేక రైతులు అస్వస్థతకు గురౌతున్నారనీ మరికొందరు రైతులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు కావల్సిన యూరియాను సకాలంలో అందించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. అధికారులు, పాలకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి!

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy